జ‌గ‌న్‌ను ప్ర‌జ‌లే కాపాడుకోవాలి : విజయ‌మ్మ

రాష్ట్ర ప్రజల్ని వైఎస్ తన కుటుంబ సభ్యుల్లా చూశారని, కత్తి దాడి నుంచి జగన్ కోలుకోవడం ఆయనకు పునర్జన్మ అని వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ అన్నారు. రాష్ట్ర సమస్యలపై జగన్ రాజీలేని పోరాటం చేస్తున్నారని, జగన్‌ను ప్రజలే కాపాడుకుంటున్నారని తెలిపారు. తమపై నిరాధార ఆరోపణలను మౌనంగా భరిస్తున్నామని ఆమె పేర్కొన్నారు. కేసులు, విచారణల పేరుతో జగన్‌ను చాలా ఇబ్బంది పెట్టారని.. ఎన్ని సమస్యలున్నా, కష్టాలున్నా తన కుమారుడు చలించలేదని విజయమ్మ వెల్లడించారు. జైల్లో ఉన్న 16 నెలలు తప్ప మిగిలిన అన్ని రోజులు జగన్, జనం మధ్యనే ఉన్నారని ఆమె ఒకింత భావోద్వేగంతో చెప్పుకొచ్చారు.

జ‌గ‌న్‌పై విశాఖ‌లో దాడి జ‌రిగిన అనంత‌రం ఆయ‌న త‌ల్లి విజ‌య‌మ్మ తొలిసారి స్పందించారు.  ‘వైఎస్‌ జగన్‌ పాదయాత్రకు తిరిగి వెళ్తుండగా.. కృతజ్ఞతను, విన్నపాన్ని తెలపాడానికి మీ ముందుకు వచ్చాను. రాష్ట్ర ప్రజానికానికి ఎంతో రుణపడి ఉన్నాం. దివంగత నేత వైఎస్‌ రాజశేఖరెడ్డిని, కార్యకర్తలకు, తమ కుటుంబాన్ని ప్రేమించే ప్రతి సన్నిహితుడికి హృదయ పూర్వక నమస్కారాలు తెలుపుతున్నాను. జగన్‌ కోలుకోవాలని, ప్రతి ఒక్కరు ప్రార్ధించారు. ప్రేమించారు. వారందరికి మా కుటుంబం ఎంతో రుణపడి ఉంటుంది. 

‘జ‌గ‌న్ నా బిడ్డే అయినా మీ (ప్ర‌జ‌ల‌) తోనే ఎక్కువ‌గా ఉన్నారు. రాష్ట్ర కోసం జ‌గ‌న్ నిత్యం పోరాడుతున్నారు. అలాంటి బిడ్డ‌ను ప్ర‌జ‌లే కాపాడుకోవాలి. ఎన్ని స‌మ‌స్య‌లున్నా...ఎంత‌మంది బెదిరించినా జ‌గ‌న్ ఎవరికీ త‌ల‌వంచ‌లేదు. ప్ర‌జ‌ల నుంచి జ‌గ‌న్‌ను ఎవ‌రూ వేరుచేయ‌లేరు. ప్రతిపక్షనేతపై దాడి జరుగుతుందని ఒక పెద్దమనిషి అన్నారు. అప్పుడు నేనేం చేయలేదు. దేవుడిని మాత్రమే ప్రార్ధించాను.’

` గోదావరి జిల్లాలో అంతం చేయాలని రెక్కీ జరిగిందని అక్కడ కుదరకపోవడంతో ఎయిర్‌పోర్ట్‌లో ఆ పని చేశారు. అక్కడైతే ఎవరు అడ్డుకోరని ఆ ప్రాంతాన్ని ఎన్నుకున్నట్లు నేను అనుకుంటున్నా. తల్లి, భార్య, చెల్లెలిపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు. మౌనంగా సహిస్తున్నాం. భరిస్తున్నాం. రాజశేఖర్‌ రెడ్డి ఏ పార్టీకి అయితే 30 ఏళ్లు సేవ చేశాడో ఆపార్టీ ఆ మహానేతను దోషిని చేసింది. ఇప్పటికి వేధిస్తుంది. ఆర్థికంగా ఇబ్బంది పెట్టాలని వైఎస్‌ జగన్‌పై అన్నిదాడులు చేయించి 16 నెలలు జైలులో పెట్టారు. దేశంలో ఏ నాయకుడికి నాకు తెలిసి ఇన్ని వేధింపులు ఎదొర్కోలేదు. అయినా జగన్‌ దేనికి చలించలేదు, అదరలేదు.’

`అన్ని సమస్యలను పక్కన పెట్టి ప్రజల మధ్య ఉండి పోరాడుతున్నారు. జగన్‌పై హత్యాయత్నం జరిగి 17 రోజులవుతుంది. అయినా ఈ కేసులో పురోగతి లేకపోగా ఎక్కడేసిన గొంగళిలా అక్కడే ఉంది. గాయం ఎంత లోతు ఉందని, డీజీపీ, సీఎం, మంత్రులు మాట్లాడుతున్నారు. విచారణ జరపకుండా రోజుకో మాటతో పబ్బం గడుపుతున్నారు. విఐపి లాంజ్‌లోనే భద్రతా లేకుంటే ఎలా అని అడుగుతున్నా. చిన్న గుండు సూది కూడా తీసుకుపోనివ్వని ఎయిర్‌పోర్ట్‌లోకి ఏ విధంగా కత్తులు వెళ్లాయి?’ అని ఆమె ప్రశ్నించారు.

 ఎవరు సహకరించారనే దిశలో విచారణ జరగడం లేదు. ఘటన జరిగిన గంటలోనే విచారణ జరగకుండా డీజీపీ దాడి చేసింది జగన్‌ అభిమానని ఎలా చెబుతార‌న్నారని విస్మయం వ్యక్తం చేసారు. ఎవరైతే ఈ హత్యాయత్నం చేశారో వారికి ఇలాంటి ప్రయత్నాలు చేయవద్దని ఆమె కోరారు. `ఇప్పటికే వైఎస్ఆర్‌ను పోగొట్టుకొని బాధలోఉన్నాం. నా కడుపుకొట్టొద్దని చేతులెత్తి నమస్కారం చేస్తున్నా.’ అని విజయమ్మ భావోద్వేగంతో మాట్లాడారు.