భద్రతా సవాళ్లను దీటుగా ఎదుర్కొన్న వాజపేయి

ప్రధానమంత్రిగా వాజపేయి బద్రతా పరంగా పలు పెను సవాళ్ళను ఎదుర్కొనవలసి వచ్చింది. ఎటువంటి సవాల్ ఎదురైనా ఎంతో ధైర్యంతో, సాహసంతో, దక్షతతో ఎదుర్కొన్నారు. అది అణుపరీక్ష కావచ్చు, కార్గిల్ యుద్ధం కావచ్చు, కాందహార్ లో విమానం హైజాక్ కావచ్చు, పార్లమెంట్ పై దాడి కావచ్చు దేశ ప్రజలలో ఎటువంటి అలజడికి దారితీయకుండా అసామాన్యమైన కార్యదక్షతను ప్రదర్శించారు. ఆయా సవాళ్ళ నుండి దేశాన్ని సురక్షితంగా బైట పడవేయగలిగారు. అమెరికాతో సహా అణుపరీక్ష అనంతరం ఆంక్షలు విధించినా తొణకలేదు. సై అంటూ అగ్ర రాజ్యాలను ఎదిరించారు.

సందర్భానుసారంగా అత్యంత చాకచక్యంతో వ్యవహరించడంతోపాటు సైన్యాన్ని ఒడుపుగా ఉపయోగించారు. బద్రతా దళాలకు నైతికంగా భరోసా ఇస్తూ వచ్చారు. దేశం ఎటువంటి ప్రమాదానైనా ఎదుర్కోవడానికి సిద్దమే అనే అభిప్రాయం కలిగించారు. 1998లో రెండోసారి ప్రధానమంత్రిగా వాజపేయి ప్రమాణస్వీకారం చేసిన తర్వాత అమృత్‌సర్ నుంచి లాహోర్‌కు బస్సు యాత్ర చేపట్టారు. ఈ యాత్ర ద్వారా ఇండో-పాక్ సంబంధాల్లో నూతన శకం ప్రారంభమైంది.

తర్వాత కొద్దిరోజులకే పాకిస్థాన్ తన బలగాలను కార్గిల్‌కు పంపేందుకు కోవర్ట్ ఆపరేషన్ నిర్వహించడంతో పరిమిత యుద్ధం చోటుచేసుకున్నది. అందులో పాకిస్థాన్ ఓటమిని చవిచూసింది. పాకిస్థాన్‌తో శాంతిని కోరుకున్న వాజపేయి.. సైనిక చర్యకు సైతం వెనుకాడలేదు. పాకిస్థాన్ బలగాలు నియంత్రణ రేఖను దాటినందుకు మనం యుద్ధానికి దిగాం. నియంత్రణ రేఖను దాటి పాకిస్థాన్ చేసిన తప్పు మనం చేయరాదు అని వాజ్‌పేయి బలగాలను ఆదేశించారు.

అనుకున్న విధంగానే భారత్ యుద్ధంలో గెలిచింది. వాజపేయి మరోసారి ప్రధాని బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని ఉగ్రవాదులు హైజాక్ చేసి కాందహార్‌కు తీసుకెళ్లారు. అందులో 190 మంది భారత ప్రయాణికులు ఉన్నారు. ప్రయాణికుల ప్రాణాలు కాపాడేందుకు హైజాకర్ల డిమాండ్లకు ప్రభుత్వం తలొగ్గింది. అప్పటి విదేశాంగశాఖ మంత్రి జస్వంత్‌సింగ్ ఉగ్రవాదులను అప్పగించి ప్రమాణికులను సురక్షితంగా తీసుకువచ్చారు.

డిసెంబర్ 13, 2001లో సాయుధులైన ఐదుగురు ఉగ్రవాదులు పార్లమెంట్ భవనంలోకి చొరబడి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఆపరేషన్ పరాక్రం పేరుతో పాకిస్థాన్ సరిహద్దుల్లో సైన్యాన్ని మోహరించిన కేంద్రం 11 నెలలపాటు కొనసాగించారు. తీవ్రమైన ఒత్తిడితో దిగివచ్చిన పాకిస్థాన్.. కాల్పుల విరమణకు అంగీకరించింది.