కాంగ్రెస్ వకాల్తా పుచ్చుకొంటున్న చంద్రబాబు

దేశంలో బిజెపి వ్యతిరేక కూటమి ఏర్పాటు పేరుతో తెలుగు దేశం పార్టీ అధినేత వాస్తవానికి ఆ పార్టీని ఎన్ టి రామారావు ఏ కాంగ్రెస్ పార్టీ ని కూకటి వ్రేళ్ళతో పెగిలించి పారవేయడం కోసం ఆహర్నిశలు పాటుపడ్డారో ఆ పార్టీకి ప్రాణం పోయడానికే కంకణం కట్టుకున్నట్లు కనిపిస్తున్నది. వివిధ ప్రతిపక్ష నేతలతో ఆయన జరుపుతున్న సమావేశాలు, సంప్రదింపులు అన్ని కాంగ్రెస్ ప్రతినిధిగా, ఆ పార్టీ అద్యక్షుడు రాహుల్ గాంధీకి వకాల్తా పుచ్చుకున్నట్లు ఉంటున్నది గాని అన్ని ప్రతిపక్షాలను ఒక చోటకు చేర్చడం కోసం నిజాయితీతో చేస్తున్న ప్రయత్నంగా కనిపించడం లేదు.

ఇప్పటి వరకు ఆయన కలుస్తున్న నేతలు అందరు ఏదో విధంగా కాంగ్రెస్ తో సంబంధాలు ఉన్నవారే. ఎస్పి అధినేత అఖిలేష్ యాదవ్ ఉత్తర ప్రదేశ్ లో గత సంవత్సరం తండ్రి ములాయం సింగ్ యాదవ్ ను సహితం కాదని పొత్తు ఏర్పరచుకొని బోల్త పడిన వారే. ఎన్సిపి అధినేత శరద్ యాదవ్ మహారాష్ట్రలో ఇప్పటికే కాంగ్రెస్ తో పొత్తుకు సిద్దమై, సీట్ల సర్దుబాటు విషయంలో కుడా చాలావరకు ఒక అవగాహనకు వచ్చారు. కర్ణాటకలో అయితే కాంగ్రెస్ మద్దతుతోనే హెడి కుమారస్వామి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. తమిళనాడులో గత ఎన్నికల సమయం నుండే డిఎంకె తో కాంగ్రెస్ పొత్తు కొనసాగుతున్నది. బిఎస్పి అధినేత మాయావతి సూత్రప్రాయంగా కాంగ్రెస్ తో పొత్తుకు సిద్దపడ్డారు. అయితే ఆమె గొంతెమ్మ కోర్కెలకు కాంగ్రెస్ సిద్ద పడక పోవడంతో ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలలో పొత్తు కుదరలేదు.

కాంగ్రెస్ తో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో పొత్తుకు సిద్దపడుతున్న పార్టీలు ఏవీ కుడా కాంగ్రెస్ ఆధర్యంలో, అదీ రాహుల్ గాంధీ నాయకత్వంలో బిజెపి వ్యతిరేక కూటమి ఏర్పాటుకు సిద్ద పడటం లేదు. ఎవ్వరికీ వారు తమ సొంత ఆశలు పెంచుకొంటున్నారు. హంగ్ పార్లమెంట్ ఏర్పడితే ప్రధాన మంత్రి పదవి చేపట్టాలని మమత బెనర్జీ, మాయావతి, శరద్ పవర్ వంటి నేతలు అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. అందుకనే రాహుల్ నాయకత్వంలో ఒక కూటమిగా ఏర్పాటుకు సిద్ద పడటం లేదు.

ప్రస్తుతం రాష్ట్ర స్థాయిలో సీట్లు సర్దుబాటు చేసుకొని, లోక్ సభ ఎన్నికల అనంతరం అందరం కలసి కూర్చొని కూటమి విషయం ఆలోచిద్దామని చెబుతున్నాయి. అందుకనే రాహుల్ గాంధీ ఏర్పాటు చేసే అఖిల పక్ష సమావేశాలకు పలువురు ప్రతిపక్ష నేతలు హాజరు కావడం లేదు. రాహుల్ నిత్యం విమర్శలు చేస్తున్న రాఫేల్ డీల్ విషయంలో అంతా సక్రమంగానే జరిగిన్నట్లు భావిస్తున్నానని శరద్ పవర్ స్పష్టం చేసారు. ఇందులో ఏదో కుంభకోణం జరిగిన్నట్లు రాహుల్ అంటున్నారని, ఆయన వద్ద ఏ సాక్ష్యాధారాలు ఉన్నాయో తనకు తెలియదని అంటూ చురక కుడా అంటించారు.

ప్రస్తుత పరిస్థితులలో రాహుల్ గాంధీ నేతృత్వంలో కూటమి ఏర్పాటు గాని, రాహుల్ ను ప్రధాన మంత్రి అభ్యర్ధిగా అంగీకరించడం సాధ్యం కాదని శరద్ పవర్, మమత బెనర్జీ వంటి పలువురు నేతలు స్పష్టం చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ దయాదక్షిన్యాలపై కొడుకు ముఖ్యమంత్రి పదవిలో ఉండడంతో దేవగౌడ మాత్రం రాహుల్ గాంధీ ప్రధాని పదవికి పొటీ పడితే మద్దతు ఇస్తామని మాత్రం వ్యూహాత్మకంగా చెబుతున్నారు. ఇటువంటి పరిస్థితులలో చంద్రబాబు నాయుడు బీజేపీ వ్యతిరేక ఫ్రంట్‌కు కాంగ్రెస్ పార్టీ అత్యంత కీలకమని, ఆ పార్టీ లేకపోతే విపక్ష కూటమి ఉండబోదని పలువురు నేతలను కలసి నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కూటమికి ఎవరు నేతృత్వం వహించాలనే అంశంపై విపక్ష పార్టీలు ఏకాభిప్రాయానికి రానప్పటికీ, చంద్రబాబు మాత్రం కాంగ్రెస్‌ను నాయకత్వస్థానంలో నిలిపేందుకు ప్రయత్నించడం గమనార్హం.

పైగా రాహుల్ గాంధీ కి కితాబు కుడా ఇస్తున్నారు. రాహుల్‌గాంధీ స్వతహాగా నాయకుడు. బీజేపీకి వ్యతిరేకంగా స్థిరంగా పోరాడుతున్న జాతీయపార్టీ కాంగ్రెస్ ఒక్కటే. మిగతావన్నీ ప్రాంతీయ పార్టీలే. అలాంటి కాంగ్రెస్ లేకపోతే మహాకూటమి ఎలా సాధ్యం? అని అమాయకంగా ప్రశ్నించారు.

రాహుల్ గాంధీ `రాయబారిగా’ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అశోక్ గేహ్లాట్ ప్రత్యేకంగా అమరావతికి వచ్చి చంద్రబాబు నాయుడును కలవడం, ఇద్దరు కలసి ఈ నెల 22న ఢిల్లీలో ప్రతిపక్ష నేతల సమావేశం ఏర్పాటు చేయాలనీ నిర్ణయించడం చూస్తుంటే కాంగ్రెస్ ఆడించి న్నట్లు చంద్రబాబు ఆడుతున్నట్లు స్పష్టం అవుతున్నది. తెలంగాణలో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నా రెండు, మూడు సీట్లలో మించి బలం లేని సిపిఐ సహితం అదనపు సీట్ల కోసం పోరాడుతుంటే, తెలుగు దేశం మాత్రం `మీరెన్ని సీట్లు ఇస్తే అంతే ప్రసాదం’ అన్నట్లు వ్యవహరిస్తున్నది. అంటే కాంగ్రెస్ నాయకత్వం ముందు చంద్రబాబు `లొంగుబాటు’ ధోరణి ప్రదర్శిస్తున్నట్లు అర్ధం అవుతున్నది.

కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం కొనసాగితే తన హయంలో ఆంధ్ర ప్రదేశ్ లో జరుగుతున్నా అక్రమాలు, అవినీతి చర్యలకు బాధ్యత వహించ వలసి ఉంటుందని, చట్టపరమైన చిక్కులు ఎదుర్కోవలసి వస్తుందని భయపడుతున్నారు. అందుకనే తనను ఈ ప్రమాదం నుండి కాపాడ గలిగింది మునిగిపోతున్న కాంగ్రెస్ అని భావిస్తున్నట్లు కనిపిస్తున్నది.