టీఆర్‌ఎస్‌ను శాశ్వతంగా శిక్షిస్తారా.? కొన్నేళ్లే శిక్షిస్తారో ?

తెలంగాణ కోసం కొట్లాడిన విద్యార్థులు, ఉద్యోగులు సహా అన్నివర్గాల వారిని టీఆర్‌ఎస్ ప్రభుత్వం వంచించిందని.. నాలుగున్నరేళ్ల పాలనలో ఆ పార్టీ చేసిన మోసాలను పల్లెపల్లెకు, ఇంటింటికీ తీసుకెళ్లి ప్రజాకోర్టులో దోషిగా నిలబెడతామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ వెల్లడించారు. ఎన్నికల్లో ఓడించి టీఆర్‌ఎస్ కు గుణపాఠం చెప్పాలని, ఆ శిక్ష పదేళ్లా, యావజ్జీవమా అన్నది తెలంగాణ ప్రజలే నిర్ణయించాలని ఆయన కోరారు.

కేంద్రమంత్రి జె.పి.నడ్డా, రాష్ట్ర ముఖ్యనేతలతో కలిసి లక్ష్మణ్‌ బిజెపి రాష్ట్ర శాఖ కెసిఆర్ పాలనపై తయారు చేసిన ‘టీఆర్‌ఎస్ నయవంచక పాలనపై బీజేపీ ఛార్జ్ షీట్’ను విడుదల చేస్తూ తెలంగాణ సెంటిమెంట్‌తో అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ ఎన్నికల ప్రణాళికలోని హామీలతోపాటు, అసెంబ్లీ సాక్షిగా చెప్పిన వాటినీ అమలుచేయలేదని.. 100 వాగ్దానాలను ఉల్లంఘించిందని లక్ష్మణ్ ఆరోపించారు.

‘‘లక్ష పైచిలుకు ఉద్యోగాలు భర్తీ చేయలేదు. ఒక్క డీఎస్సీ నిర్వహించలేదు. ఇంటింటికి నల్లా నీళ్లు, 2.60 లక్షల ఇళ్ల నిర్మాణం చేయలేదు. దళితులు, బీసీలు, ఎస్సీలను, ఉద్యోగులను.. అన్నివర్గాలను మోసంచేశారు’’ అంటూ నిప్పులుచెరిగారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా ఓట్లడగలేని స్థితిలోనే 9 నెలలముందు అసెంబ్లీ రద్దుచేసి ఎన్నికలకు వెళ్లారని, రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేకుండా కేసీఆర్‌ చేశారని దుయ్యబట్టారు. అనంతరం పార్టీ ప్రచారం కోసం తయారుచేసిన ఎల్‌ఈడీ ప్రచార రథాల్ని జేపీ నడ్డాతో కలిసి లక్ష్మణ్‌ ప్రారంభించారు.

ఎన్నికల ముందు టీఆర్‌ఎస్ విడుదల చేసిన మెనిఫెస్టోలో పేర్కొన్న అంశాలతో పాటు ఎన్నికల తరువాత ఇచ్చిన హామీలు, చేసిన వాగ్దానాలపై చర్చించింది. హామీలు, వాగ్దానాల్లో ఒక్కశాతం కూడా అమలు చేయలేదన్న నిర్ణయానికి వచ్చింది. అన్ని వర్గాలనూ కేసీఆర్ మోసం చేశారని ఏకాభిప్రాయానికి వచ్చింది. ఇచ్చిన హామీలు, వాగ్దానాలను పేర్కొంటూ వాటిని అమలు చేయని అంశాన్ని తన ఛార్జ్ షీట్ లో చేర్చింది.

తెలంగాణ సాధన కోసం అమరులు చేసిన త్యాగాన్ని  వాడుకొని అధికారంలోకి వచ్చిన తరువాత అందరినీ మోసం చేశారని తెలిపింది. తొలిగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చడంలో ఫూర్తిగా విఫలమైందని వెల్లడించింది. యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండా.. వారిని మోసం చేశారని ఆరోపించింది.

తెలంగాణ ఉద్యోగులను కూడా దగా చేశారని విమర్శించింది. తొలిదశ ఉద్యమంలో ఉద్యమకారులను ఆనాటి కాంగ్రెస్ నిర్దాక్షిణ్యంగా పొట్టన పెట్టుకున్నదని ఆరోపించింది. కేసీఆర్ మాత్రం వారి త్యాగాలను వాడుకొని అధికారంలోకి వచ్చారని విమర్శించింది. కుటుంబ పాలనలో అవినీతికి పాల్పడుతూ నియంతృత్వంగా పాలించారని ఆరోపించింది. నమ్మి అధికారం అప్పగించిన ప్రజలను వంచన చేసిన కేసీఆర్‌కు తగిన బుద్ధి చెప్పి శాశ్వతంగా శిక్షించాలని విజ్ఞప్తి చేసింది.