కర్ణాటకలో రాజకీయ చిచ్చు రేపిన టిప్పు జయంతి

ఒకప్పటి మైసూర్ రాజు, 18వ శతాబ్దానికి చెందిన పాలకుడు టిప్పు సుల్తాన్ జయంతి వేడుకలు మరోసారి కర్ణాటకలో రాజకీయంగా నిప్పును రాజేశాయి. వేడుకలను అడ్డుకుంటామని బీజేపీ, ఇతర హిందూ సంస్థల హెచ్చరిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరిపాయి. ఏది ఏమైనా కార్యక్రమాన్ని నిర్వహించి తీరుతామన్న కాంగ్రెస్ పట్టుదలతో రాష్ట్రంలో భారీగా భద్రతా బలగాలు మోహరించాయి.

అయితే ప్రభుత్వ పరంగా అధికారికంగా జరిపిన జయంతి కార్యక్రమానికి ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి, ఉప ముఖ్యమంత్రి జీ పరమేశ్వర గైర్హాజరు కావడంతో శనివారం నిర్వహించిన వేడుకలు పేలవంగా మారాయి. మూడురోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలన్న `వైద్యుల సలహా’తో సీఎం కుమారస్వామి కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కార్యాలయం ముందుగానే ప్రకటించింది. ఆహ్వాన పత్రికల్లో సైతం సీఎం పేరును ముద్రించలేదు.

ముఖ్యమంత్రి లేకపోవడంతో విధాన సౌధ వద్ద తలపెట్టిన ప్రధాన కార్యక్రమాన్ని డిప్యూటీ సీఎం పరమేశ్వర ప్రారంభించాల్సి ఉండగా ఆయన కూడా రాలేదు. డిప్యూటీ సీఎం నగరంలో అందుబాటులో లేరని, అందుకే కార్యక్రమానికి రాలేదని ఆయన కార్యాలయ వర్గాలు తెలిపాయి. ముఖ్యమంత్రి గైర్హాజరుతో టిప్పు జయంతి వేడుకలపై అధికార కూటమిలో విభేదాలు తలెత్తాయన్న వార్తలు వెలువడ్డాయి.

కుమారస్వామి ప్రతిపక్షంలో ఉండగా టిప్పు జయంతి వేడుకలను నిర్వహించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించేవారు. దీంతోపాటు మైసూర్ ప్రాంతంలో జేడీఎస్‌కు గట్టిపట్టుందని. మైసూర్ మహారాజుల నుంచి టిప్పుసుల్తాన్ అధికారాన్ని కైవసం చేసుకున్న చరిత్ర ఉన్నందున ఆయన జయంతి వేడుకల్లో పాల్గొంటే అక్కడి ప్రజలు బాధపడుతారని భావించి కుమారస్వామి వేడుకలకు దూరంగా ఉన్నారని భావిస్తున్నారు.

మరోవైపు జయంతి వేడుకలను వ్యతిరేకిస్తున్న ప్రతిపక్ష బీజేపీ, సంఘ్‌పరివార్ సంస్థలు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలతో హోరెత్తించాయి. టిప్పు సుల్తాన్ మతదురభిమాని అని, అతడి జయంతిని నిర్వహించాలన్న నిర్ణయాన్ని వెనుకకు తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేసింది. ప్రతిష్టకు పోయి వేడుకలను జరుపవద్దని కోరుతూ ముఖ్యమంత్రికి బిజెపి రాష్ట్ర అద్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి బి ఎస్ యడ్డ్యురప్ప లేఖ వ్రాసారు. కాంగ్రెస్ వోట్ బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నట్లు దుయ్యబట్టారు.

సిద్దరామయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ వేడుకలు నిర్వహించే సంప్రదాయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించింది. కాగా టిప్పు సుల్తాన్ జయంతి వేడుకలకు ముఖ్యమంత్రి కుమారస్వామి, డిప్యూటీ సీఎం జీ పరమేశ్వర హాజరుకాకపోవడం ముస్లింలను అవమానించడమేనని మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే తన్వీర్ సెయిత్ విమర్శించారు.