నక్సల్స్ రహిత రాష్ట్రంగా ఛత్తీస్‌గఢ్‌.. రైతులకు పెన్షన్ .. బీజేపీ హామీ

మరో రెండు రోజుల్లో ఛత్తీస్‌గఢ్‌లో తొలి దశ పోలింగ్‌ జరగనుండగా నకల్స్ లేని రాష్ట్రంగా ఛత్తీస్‌గఢ్‌ ను తీర్చి దిద్దుతామని, చిన్న, సన్నకారు రైతులకు పెన్షన్లు ఇస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. పార్టీ ఎన్నికల ప్రణాళికను బీజేపీ అద్యక్షుడు అమిత్ షా, రాష్ట్ర ముఖ్యమంత్రి రమణ్‌సింగ్‌ రాయ్‌పూర్‌లో జరిగిన కార్యక్రమంలో విడుదల చేశారు.

వరుసగా నాలుగోసారి బీజేపీని ఎన్నికోమని ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ రాష్ట్రంలో మల్టీ స్పెషాలిటి ఆసుపత్రులను నెలకొల్పు రాష్ట్రాన్ని సంపన్న రాష్ట్రంగా అభివృద్ధి చేస్తామని భరోసా ఇచ్చింది. `సంకల్ప పాత్ర’ పేరుతో ఎన్నికల ప్రణాళికను రూపొందించారు. వచ్చే ఐదేల్లలో రెండు లక్షల పంప్ కనెక్షన్ లను రైతులకు అందిస్తామని, ఎస్సి, ఎస్టి విద్యార్ధులకు ఉపకార వేతనాలు ఏర్పాటు చేస్తామని, పట్టణ-గ్రామీణ పేదలకు పక్క గృహాలు నిర్మిస్తామని, నిరుద్యోగ యువతకు నిరుద్యోగ బృతి కల్పిస్తామని హామీలు ఇచ్చారు.

‘బీజేపీ పాలనలో ఛత్తీస్‌గఢ్‌ సంక్షేమ రాష్ట్రంగా నిలిచింది. ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ వంటి పథకాలు అవినీతిరహితంగా ఉన్నాయి. గత 15ఏళ్లలో రమణసింగ్‌ ప్రభుత్వం రాష్ట్రంలో ఎన్నో మార్పులను తీసుకొచ్చింది’ అని అమిత్‌షా ఈ సందర్భంగా కొనియాడారు.  గిరిజనులు, రైతుల సంక్షేమం కోసం మరిన్ని పథకాలను తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు.

మరోవైపు లోర్మి ప్రాంతంలో బీజేపీ తరఫున ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘2022 నాటికి భారత్‌లోని పేదలందరికీ ఇళ్లు నిర్మించి ఇవ్వనున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. ఛత్తీస్‌గఢ్‌లో ఇల్లు లేని వారు బీజేపీ పాలనలో గృహాన్ని పొందగలిగారు’ అని ప్రకటించారు.

కాంగ్రెస్‌ తమ స్వలాభం కోసం రాష్ట్రంలో నక్సలిజాన్ని ప్రోత్సహించిందని ద్వాజమెత్తుతూ. బీజేపీ ప్రభుత్వం మాత్రం రాష్ట్రాన్ని నక్సల్‌ రహితగా తీర్చిదిద్దేందుకు కృషి చేసిందని చెప్పారు. రాజకీయ లాభం కోసం దేశ భద్రతను కాంగ్రెస్‌ ఉపయోగించుకుంటోందని మండిపడ్డారు. కానీ బీజేపీకి మాత్రం జాతీయ భద్రత చాలా ముఖ్యం అని స్పష్టం చేసారు. జాతీయ భద్రతతో ఆటలాడుకునేందుకు ప్రయత్నిస్తే బీజేపీ ఎంతమాత్రం సహించబోదు’ అని సీఎం యోగి హెచ్చరించారు.

నేటితో ఛత్తీస్‌గఢ్‌లో తొలి దశ పోలింగ్‌కు సంబంధించిన ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఈ నేపథ్యంలోనే బీజేపీ, కాంగ్రెస్‌ నేతలు హోరాహోరీగా ప్రచార కార్యక్రమాలను నిర్వహించారు. ప్రధాని మోదీ ఛత్తీస్‌గఢ్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.