రెండో తరం సంస్కర్త వాజపేయి

తొలితరం ఆర్థిక సంస్కరణలు పీవీ నరసింహారావు ప్రారంభిస్తే వాటికి కొనసాగింపుగా చేపట్టిన సంస్కరణలతో వాజపేయిని రెండో తరం ఆర్థిక సంస్కరణల పితామహునిగా అభివర్ణిస్తారు. వాజపేయి చేపట్టిన ఈ రెండో తరం ఆర్థిక సంస్కరణలు అన్ని వర్గాల మన్ననలను పొందింది. విమర్శలకు తావులేకుండా ఆయన సంస్కరణలను అమలు పరిచిన తీరు ప్రశంసలను అందుకుంది.

స్వర్ణ చతుర్భుజి పేరుతో దేశం నలుమూలలను కలిపే 4-6 లైన్ల నేషనల్ హైవే ప్రాజెక్టు వాజపేయి హయాంలోనే ప్రారంభించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా శ్రీనగర్-కన్యాకుమారి, చెన్నై- కోల్‌కతా, ఢిల్లీ-ముంబై, పోరుబందర్-సిల్చార్‌లను కలుపుతూ చేపట్టిన ఈ ప్రాజక్టును ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కేవలం కొనసాగించడం మాత్రమే చేశాయి. రోడ్డు-రవాణా సౌకర్యాలను మెరుగుపరచడం ద్వారానే అభివృద్ధి వేగం పుంజుకుందని పరిశ్రమ వర్గాలు ఇప్పటికీ ప్రశంసిస్తున్నాయి.

దేశంలో ఇంధన సరఫరాను పెంచడానికి విదేశాల్లో చమురు క్షేత్రాలను కొనుగోలుకు అనుమతులను కూడా వాజపేయి ప్రభుత్వమే ఇచ్చింది. ప్రభుత్వం చేసే పని వ్యాపారం కాదంటూ ఆయన చేపట్టిన ప్రైవేటీకరణ, డిజిన్వెస్ట్‌మెంట్ ప్రక్రియ వంటి భారీ సంస్కరణలకు వాజపేయి తెరలేపారు.

ఆయన ఐదేండ్ల పదవీకాలంలో 32 ప్రభుత్వ రంగ కంపెనీలు, హోటళ్లను ప్రైవేట్ పరం చేశారు. ప్రైవేటీకరించేందుకు వీలైన ప్రభుత్వ కంపెనీలను గుర్తించేందుకు డిజిన్వెస్ట్‌మెంట్ శాఖను తొలిసారిగా ఏర్పాటు చేశారు. డిజిన్వెస్ట్‌మెంట్ చేయదగిన కంపెనీలను గుర్తించిన తర్వాత వాటిని త్వరితగతిన ఆమోదించడానికి క్యాబినెట్ కమిటీని కూడా నియమించారు.

ఇందులో భాగంగా 1999-2000లో మోడ్రన్ ఫుడ్ ఇండస్ట్రీస్‌ను హిందుస్థాన్ యూనిలీవర్‌కు విక్రయించారు. భారత్ అల్యూమినియం కంపెనీ (బాల్కో), హిందుస్తాన్ జింక్‌లను మైనింగ్ దిగ్గజం అనీల్ అగర్వాల్ కంపెనీ స్టెరిలైట్ ఇండస్ట్రీస్‌కు విక్రయించారు. ఐటీ రంగంలో ప్రభుత్వ రంగ కంపెనీ సీఎంసీని, విదేశ్ సంచార్ నిగమ్ (వీఎస్‌ఎన్‌ఎల్)ను టాటాలకు అప్పగించారు. చమురు మార్కెటింగ్ కంపెనీ ఐబీపీని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌కు విక్రయించారు.

ఇండియన్ పెట్రోకెమికల్స్ కార్పోరేషన్ (ఐపీసీఎల్)ను రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు అమ్మారు. ఈ కంపెనీలకు తోడు అనేక ప్రభుత్వ రంగ హోటళ్లను కూడా ప్రైవేటీకరించారు. కేవలం అశోక్ బీచ్ రిసార్ట్, కోల్‌కతాలోని హోటల్ ఎయిర్‌పోర్ట్ అశోక్ తో పాటు న్యూఢిల్లీలోని రంజీత్ హోటల్, కుతుబ్ హోటల్ , హోటల్ కనిష్కలను విక్రయించారు. అయితే వీటి ప్రవేటీకరణ అంత తేలిగ్గా జరగలేదు. బాల్కో ప్రైవేటీకరణపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయింది.

కేసులు సుప్రీంకోర్టు దాకా వెళ్లాయి. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్‌ను ప్రైవేటీకరించాలన్న ప్రతిపాదనకు స్వంత క్యాబినెట్ మంత్రులే వ్యతిరేకించడంతో జరగలేదు. రష్యాలోని అతిపెద్ద సఖాలిన్-1 చమురు, గ్యాస్ క్షేత్రాన్ని 2001లో 170 కోట్ల డాలర్లకు కొనుగోలు చేయడం ఆయన విజన్‌కు నిదర్శనంగా పేర్కొంటారు. అప్పటికి అది మనదేశం విదేశాల్లో చేసిన అతి పెద్ద పెట్టుబడి కూడా.

ఆ తర్వాత సుడాన్‌లోని చమురు క్షేత్రాన్ని 720 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేశారు. వివాదాస్పద దేశాల్లో అంత భారీ పెట్టుబడులను పెట్టడంపై ప్రతిపక్షాలు విమర్శలు చేసినా వాటిని ఆయన పట్టించుకోలేదు. ఆతర్వాత కొన్ని సంవత్సరాల్లోనే సుడాన్‌లో పెట్టిన పెట్టుబడులు రికవరీ కావడంతో ఆయన నిర్ణయం సరైందేనని తేలింది.

విదేశాల్లోని చమురు క్షేత్రాల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా దేశీయంగా ఇంధన భద్రతను సాధించాలన్న ఆయన ప్రణాళికతో ఆ తర్వాత 20 దేశాల్లోని చమురు క్షేత్రాలను కొనుగోలు చేసింది. ఇతర దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరుచుకునేందుకు ఇంధన దౌత్యం నడిపారు. ఈ విధానాన్ని ఆదర్శంగా తీసుకుని చైనా కూడా గత పదిహేను ఏండ్లుగా విదేశీ చమురు క్షేత్రాలను కొనుగోలు చేయడం ప్రారంభించింది.

 అలాగే పెట్రోల్‌కు ప్రత్యామ్నాయంగా చెరకు నుంచి వచ్చే ఇథనాల్‌ను వినియోగించాలన్ని ప్రతిపాదన కూడా ఆయనదే. పెట్రోల్‌కు ప్రత్యామ్నాయంగానే కాకుండా రైతులకు ప్రత్యామ్నాయ ఆదాయ వనరుగా కూడా ఆయన ఈ చర్యను ప్రోత్సహించారు. గత పదేండ్లు ఈ విధానంపై ప్రోత్సాహకర ప్రగతిని సాధించలేకపోయినా ఇటీవల మళ్లీ కదలిక వచ్చింది.