వాజపేయి గొప్ప ఆర్థిక సంస్కర్త

వాజపేయి గొప్ప ఆర్థిక సంస్కర్త అంటూ దేశ కార్పొరేట్ దిగ్గజాలు నివాళులు అర్పించాయి. ఆయన హయాంలో ఆర్థికవృద్ధి వేగం పుంజుకుందని ప్రశంసలు కురిపించారు. వాజపేయి మరణవార్త విని మేమంతా ఎంతో విచారించామని టాటా ట్రస్ట్ చైర్మన్ రతన్ టాటా అన్నారు. ఆయనో గొప్ప నాయకుడే కాదు కరుణ, హాస్యం స్పృహ ఉన్న నాయకుడని అన్నారు. మార్కెట్ సంస్కరణల ద్వారా పారిశ్రామిక, ఆర్థికాభివృద్ధిని సాధించిన గొప్ప నాయకుడని సీఐఐ పేర్కొది. వాజపేయి దూరదృష్టితో చేపట్టిన రెండోతరం ఆర్థిక సంస్కరణలతో పెట్టుబడులు వాతావరణం మెరుగుపడడంతో పాటు ఆర్థిక వ్యవస్థ వృద్ధి వేగం పుంజుకుందని సీఐఐ అధ్యక్షుడు రాకేశ్ భారతీ మిట్టల్ అన్నారు. ప్రపంచ వేదికపై గొప్ప నాయకుణ్ణి స్వతంత్ర భారత దౌత్యనీతిజ్ఙున్ని దేశం కోల్పోయామని టాటా గ్రూపు ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ అన్నారు.

గొప్ప ఆర్థిక సంస్కర్తగా ఆయన సరళీకృత ఆర్థిక విధానాలతో దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తి స్థాయిలో వృద్ధి చెందగలదని ఆయన బలంగా నమ్మే వారని భారతీ ఎంటర్‌ప్రైజెస్ ఛైర్మన్ సునీల్ భారతీ మిట్టల్ అన్నారు. వాజపేయితో జరిపిన సమావేశాల్లో తాను ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నట్టు మహీంద్రా గ్రూపు ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా తెలిపారు. ప్రధానిగా దేశాన్ని అత్యున్నత శిఖరాలకు చేర్చిన గొప్ప రాజకీయ నాయకుడు వాజపేయి బయోకాన్ ఛైర్మన్ కిరణ్ మజుందార్ షా నివాళి ఆర్పించారు.

స్వర్ణ చతుర్భుజీ, టెలికం విధానం, సర్వ శిక్షా అభియాన్, ఎఫ్‌ఆర్‌బీఏ చట్టం వంటి చర్యలతో భవిష్యత్ తరాలకు మార్గదర్శకత్వం వహించారని అపోలో హాస్పిటల్స్ ఛైర్మన్ ప్రతాప్ సీ రెడ్డి అన్నారు. జిందాల్ గ్రూపు ఛైర్మన్ నవీన్ జిందాల్, వేదాంత ఛైర్మన్ అనీల్ అగర్వాల్, ఆసోచామ్ అధ్యక్షుడు జజోడియాలు కూడా నివాళులు అర్పించిన వారిలో ఉన్నారు. కాగా, వాజపేయి మృతికి సంతాప సూచకంగా ఆలిండియా ట్రేడర్ల సమాఖ్య (సీఏఐటీ) ఢిల్లీ ట్రేడ్ బంద్‌కు పిలుపునిచ్చింది. వాజపేయి మరణించడంతో దేశవ్యాప్తంగా ట్రేడర్లంతా దిగ్బ్రాంతికి గురయ్యారని పేర్కొంది. ట్రేడర్ల సమాఖ్య ఏర్పాటులో అటల్‌జీ నిర్మాణత్మక కృషి చేశారని పేర్కొంది.