తెలంగాణ కాంగ్రెస్ లో సీట్లకై కుమ్ములాటలు

తెలంగాణలో తామే ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నామని చెప్పుకొంటూ, గెలిచే అభ్యర్ధుల కోసం అంటూ రోజుల పాటు కసరత్తు చేస్తున్నట్లు కాలయాపన చేస్తూ చివరకు ఖరారు చేసిన అభ్యర్ధుల జాబితా కాంగ్రెస్ పార్టీలో కాకా రేపుతున్నది. ప్రదేశ్ కాంగ్రెస్ అద్యక్షుడు ఉత్తమకుమార్ రెడ్డి ఢిల్లీలో రాహుల్ గాంధీకి సన్నిహితంగా ఉన్న కొందరి అండతో ఎన్నికల్లో గెలిస్తే ముఖ్యమంత్రి పదవికి తనకు అడ్డు లేకుండా చేసుకోవడం కోసం వ్యూహాత్మకంగా పలువురు ప్రముఖులను బలహీనులను చేయడం కోసం వ్యూహాత్మకంగా కసరత్తు చేసిన్నట్లు విమర్శలు చెలరేగుతున్నాయి.

ఇంకా అధికారికంగా జాబితా ప్రకటించ కుండానే గాంధీ భవన్ వద్ద సీట్ల కోసం ఆందోళనలు ప్రారంభమయ్యాయి. తమకు అడ్డు వస్తారు అనుకొంటున్న నాయకుల సీట్లను కూటమిలోని నేతలకు కేటాయించే విధంగా ఉత్తమకుమార్ రెడ్డి పధకం వేసిన్నట్లు స్పష్టం అవుతున్నది. స్వయంగా రాహుల్ గాంధీ ఇచ్చిన భరోసాతో పార్టీలో చేరిన రేవంత్ రెడ్డి మద్దతు దారులు ఎవ్వరికీ సీటు లేకుండా చేసారు.

చివరకు మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి సీట్ సనత్ నగర్ ను టిడిపికి ఇచ్చే ప్రయత్నం చేసారు. తాజాగా మాజీ ప్రదేశ్ కాంగ్రెస్ అద్యక్షుడు, మాజీ మంత్రి, ప్రముఖ బిసి నేత పొన్నాల లక్ష్మయ్యకు సీటు లేకుండా చేయడం కోసం జనగామ నుండి పోటీ చేయమని తెలంగాణా జన సమితి అద్యక్షుడు కోదండరామ్ ను ప్రోతహించిన్నట్లు చెప్పుకొంటున్నారు.

జనగామ సీటు తనదే అని కాంగ్రెస్ నేత పొన్నాల లక్ష్మయ్య స్పష్టం చేశారు. తన లాంటీ బీసీ నేతపై ఇలాంటి ప్రచారం పార్టీకి మంచింది కాదన్నారు. జనగామ సీటు మరో పార్టీకి ఇస్తే టీఆర్‌ఎస్‌కు మేలు చేసినట్టే అని ఆయన తెలిపారు. తనలాంటి సీనియర్‌ నేత సీటును రెడ్డి వర్గానికి కేటాయిస్తే పార్టీలో తప్పుడు సంకేతాలు వెళ్తాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో బీసీలు రాజకీయంగా అభద్రతతో ఉన్నారని పొన్నాల లక్ష్మయ్య అన్నారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే 74 మంది అభ్యర్థుల జాబితాను ఖరారు చేయగా పలు సీట్లలో తీవ్రమైన అసమ్మతి వ్యక్తం అవుతున్నది.   ఇప్పటికే కోమటి రెడ్డి సోదరులు  తమ అనుచరుడు చిరమర్తి లింగయ్యకు నకిరేకర్‌ టికెట్‌ ఇవ్వకపోతే పోటీ నుంచి తప్పుకుంటామని బహిరంగంగా ప్రకటించారు. తాజాగా కాంగ్రెస్‌ ఫైర్‌ బ్రాండ్‌ రేవంత్‌ రెడ్డి సైతం అలకబూనినట్లు తెలుస్తోంది. పార్టీలో చేరినప్పుడు ఇచ్చిన హామీ అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది.

తన అనుచరులకు సీట్లు ఇవ్వని పక్షంలో తానూ పోటీ నుండి తప్పుకుంటానని స్పష్టం చేసిన్నట్లు తెలుస్తున్నది రేవంత్ వరంగల్ వెస్ట్ (నరేందర్ రెడ్డి), నిజామాబాద్ రూరల్ (అరికెల నర్సారెడ్డి), ఆర్మూరు (రాజారామ్ యాదవ్), ఎల్లారెడ్డి (సుభాష్ రెడ్డి),  దేవరకొండ (బిల్యా నాయక్), ఇల్లందు (హరిప్రియ), సూర్యాపేట (పటేల్ రమేష్ రెడ్డి),  చెన్నూరు (బోడ జనార్దన్) సీట్లను కోరుతున్నారు.

గాంధీభవన్‌ ఎదుట అసంతృప్తులు ఆందోళనకు దిగారు. మల్కాజ్‌గిరి టికెట్ టీజేఎస్‌కు కాకుండా కాంగ్రెస్ అభ్యర్థి శ్రీధర్‌‌కు ఇవ్వాలని కార్యకర్తలు నినాదాలు చేస్తున్నారు. మల్కాజ్‌గిరి టికెట్ శ్రీధర్‌కే ఇవ్వాలని, టీజేఎస్ డౌన్ డౌన్ అంటూ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. మరోవైపు సీట్ల పంపకాలపై రేపు అధికారిక ప్రకటన వెలువడిన తర్వాత చాలా నియోజకవర్గాల నుంచి కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

మహాకూటమికి సీపీఐ మరోసారి అల్టిమేటం జారీ చేసింది. తమతో ఎలాంటి చర్చలు జరపకుండా 3 సీట్లు ప్రకటించటం సరికాదని, ఐదు సీట్లకు ఒప్పుకోకుంటే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని సీపీఐ నేత చాడ వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు.