మహాకుటమి ఓ కుట్ర....మహా ఓటమి తప్పదు : లక్ష్మణ్

తెలంగాణ ఎన్నికల సందర్భంగా  మహాకూటమి ఓ కుట్రని, తెలంగాణపై మళ్లీ పెత్తనం చేసేందుకే చంద్రబాబునాయుడు ఈ రూపంలో పాచిక వేశారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డా. కె లక్ష్మణ్‌ తీవ్ర స్థాయిలో ద్వజమెత్తారు.  ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలంగాణ ప్రయోజనాల్ని దిల్లీకి, చంద్రబాబుకు తాకట్టుపెడుతున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నేతృత్వంలోని మహా కూటమికి, ఈ ఎన్నికల్లో మహా ఓటమి తప్పదని జోస్యం చెప్పారు. తెలంగాణ భవిష్యత్తును మార్చే పార్టీ బీజేపీయేనని స్పష్తం చేసారు. అవినీతి, కుటుంబ రాజకీయాలు లేని పార్టీ ఏదైనా ఉంటే అది బీజేపీనేనని స్పష్టం చేసారు.  

టీడీపీ, కాంగ్రెస్ పొత్తుతో అమరవీరుల ఆత్మలు ఘోషిస్తున్నాయని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీని ఎదుర్కోలేక విష కూటములు వస్తున్నాయని విమర్శించారు. చంద్రబాబు ప్రవర్తిస్తున్న తీరు, విధానం ప్రజలు గమనిస్తున్నారని హెచ్చరించారు. గతంలో కలిసి పోటీ చేద్దామని కేసీఆర్‌తో చంద్రబాబు అన్న విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పుడు కాకపోయినా ఎన్నికల తర్వాత రెండూ కలిసే పార్టీలేనని వెల్లడించారు. పెత్తనం చెలాయించడం కోసమే మహా కూటమిలో చంద్రబాబు చేరారని ఆరోపించారు.

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించగానే. ఆ పార్టీ చీలిపోతుందని లక్ష్మణ్ స్పష్టం చేసారు.  మహాకూటమిలో అవమానిస్తున్నా.. కేవలం సీట్ల కోసమే  కోదండరామ్, సీపీఐ కొనసాగుతోందని చెప్పారు. ఈ కూటమి పచ్చి అవకాశవాదంతో ముందుకు సాగుతోందని ఆరోపించారు. టీఆర్‌ఎస్ ఓటమి అంచున నిలుచున్నదని, ఆ పార్టీకి చెందిన వారు అనేకమంది తమతో టచ్‌లో ఉన్నారని వెల్లడించారు. తెలంగాణలో టీడీపీ ఈ ఎన్నికలతో పూర్తిగా ఖాళీ అవుతుందని జోస్యం చెప్పారు

మంత్రి కేటీఆర్ తన స్థాయిని మరిచి మాట్లాడుతున్నారని లక్ష్మణ్ మండిపడ్డారు. ఓటమి తప్పదని తెలిసిన తరువాత నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని ద్వజమెత్తారు. దేశంలోని 19 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ ఉనికి గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని హితవు చెప్పారు. ఈ ఎన్నికల తరువాత కేసీఆర్ ఉనికిని వెతకాల్సి వస్తుందని జోస్యం చెప్పారు. ఎన్నికల ప్రచార సభల్లో ప్రధానమంత్రి మోడీ, అమిత్ షా పాల్గొన్న తరువాత రాష్ట్రంలో రాజకీయ ముఖ చిత్రం మారుతుందని తెలిపారు.

తెలంగాణ భవిష్యత్‌ను మార్చేది బీజేపీ ఒక్కటే లక్ష్మణ్ తెలిపారు. అవినీతిరహిత పాలన బీజేపీతోనే సాధ్యమని ప్రజలు భావిస్తున్నారని చెప్పారు. ప్రజల ఆకాంక్ష మేరకు పని చేస్తామని నమ్ముతున్నారని చెబుతూ అవినీతి, కుటుంబ రాజకీయాలు లేని పార్టీ ఏదైనా ఉంటే అది బీజేపీనేనని పేర్కొన్నారు.