విశాఖ భూకుంభకోణంలో కీలక నిందితులను కాపాడే యత్నం !

రాష్ట్రాన్ని కుదిపేసిన విశాఖ భూ కుంభకోణం ప్రభుత్వం నియమించిన ‘సిట్’ నివేదిక వెల్లడించిన తీరు చూస్తుంటే కీలక నిందితులను కాపాడే ప్రయత్నం జరుగుతున్నట్లు అనుమానాలు కలుగుతున్నాయి. అధికార పక్ష ప్రజాప్రతినిధులు, నాయకులను తప్పించి విపక్షాలకు చెందిన నేతలను ఇరికించారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతేడాది జూన్‌లో 28న సీనియర్ ఐపీఎస్ అధికారి వినీత్ బ్రిజ్‌లాల్ నేతృత్వంలో విచారణ ప్రారంభించిన సిట్ బృందం తొమ్మిది నేలల కిందట నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. ఇంతకాలం ఆ నివేదికను పట్టించుకోకుండా ఇప్పుడు పాక్షికంగా మాత్రమె విడుదల చేయడం పలు అనుమానాలకు దారితీస్తున్నది.

అధికార పార్టీ మంత్రి అయ్యన్నపాత్రుడు సహా అప్పటి మిత్రపక్ష బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు టీడీపీ నేతల భూ ఆక్రమణలపై సిట్‌కు ఫిర్యాదు చేసి సంచలనం సృష్టించారు. ఆనందపురం మండలంలో ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ ప్రభుత్వ భూములను ఆక్రమించుకోగా, పెందుర్తి మండలం ముదపాకలో ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి ప్రభుత్వం పట్టాలిచ్చిన భూములను బీనామీ పేరిట కొనుగోలుకు యత్నించారంటూ విష్ణుకుమార్ రాజు సంచలన ఆరోపణలు చేశారు. ఇక మిగిలిన ఎమ్మెల్యేలపై కూడా పలు ఫిర్యాదులు సిట్‌కు అందాయి.

దాదాపు ఎనిమిది నెలల పాటు సాగిన సిట్ విచారణలో అన్ని అంశాలు పరిశీలించి నివేదిక సిద్ధం చేసినట్టు ప్రకటించారు. అయతే తొమ్మిది నెలల అనంతరం సిట్ అందించిన నివేదికను మంత్రి మండలి సమావేశంలో తెచ్చి ఆమోదించడం వెనుక టీడీపీ కుట్ర దాగుందంటూ విపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. ఇప్పటికైనా విశాఖ భూ కుంభకోణంపై సీబీఐ వంటి స్వతంత్య్ర దర్యాప్తు సంస్థల విచారణ జరపాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది.

స్వాతంత్ర్య సమరయోధులు, మాజీ సైనికులు, రాజకీయ బాధితుల పేర్లతో విశాఖ జిల్లాలో కేటాయించిన వందల ఎకరాలు పరుల పాలయ్యాయి. ఆయా భూములకు జారీ చేసిన నిరభ్యంతర ధ్రువీకరణ పత్రాల (ఎన్‌వోసీ) జారీ వెనుక భారీ అక్రమాలు చోటుచేసుకున్నాయి.  నిబంధనలకు నీళ్లొదిలారని, ఎన్‌వోసీల జారీ నిలిపేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన తరువాత కూడా కొంతమంది అధికారులు పట్టించుకోలేదని సిట్‌ విచారణలో వెల్లడైంది. దస్త్రాల తారుమారు, ఎన్‌వోసీల జారీపై సిట్‌ బృందం నిశితంగా విచారణ జరిపింది.

విశాఖ నగర పరిధి, సమీపంలోని పది మండలాల్లో 2002 నుంచి 2012 వరకు దాదాపు 300 ఎకరాలకు సంబంధించి 66 ఎన్‌వోసీలు జారీ అయ్యాయి. ఇందులో 55 నిరంభ్యంతర పత్రాల విషయంలో అక్రమాలు చోటుచేసుకున్నాయని సిట్‌ గుర్తించింది. వీటి ప్రస్తుత మార్కెట్‌ విలువ ఎంత కనిష్ఠంగా చూసుకున్నా రూ.1500 కోట్ల వరకూ ఉంటుందని అంచనా. ఈ భూములు విశాఖ గ్రామీణం, పరవాడ, భీమునిపట్నం, ఆనందపురం మండలాల పరిధిలో ఉన్నాయి.

అయితే ఈ భూ కుంభకోణం విషయంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్న మంత్రి గంటా శ్రీనివాసరావు సిట్ తనకు క్లీన్ చిట్ ఇచ్చిన్నట్లు పేర్కొంటున్నారు.  ఈ విషయంలో తనపై స్వపక్షంతో పాటు విపక్షాల నుంచి కూడా పెద్ద ఎత్తును విమర్శలు వెల్లువెత్తాయని, సిట్ నివేదికతో అవి పటాపంచలయ్యాయని సంతోషం వ్యక్తం చేసారు.  

కాగా, సిట్ నివేదికను తక్షణమే బహిర్గత పరచాలని శాసనసభలో బీజేపీ పక్ష నేత పీ విష్ణుకుమార్ రాజు డిమాండ్ చేశారు. విశాఖ నగర శివార్లలో జరుగుతున్న భూ కుంభకోణాలు, అక్రమాలు, ఆక్రమణలపై తన డిమాండ్ మేరకే సిట్‌ను నియమించారని చెబుతూ విచారణకు ఆదేశించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయాన్ని అభినందిస్తున్నానని, అయితే విచారణలో అధికార, ప్రతిపక్ష నేతల పాత్ర ఉందంని తేలిందని స్పష్టం చేసారు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం నివేదికలో తమకు అనుకూలంగా ఉన్న అంశాలను మాత్రమే బయటపెట్టి తన పార్టీ వారిపై వచ్చిన అనుమానాలను పక్కనపెట్టారని ఆరోపించారు.

హైటెక్ పరిపానగా గొప్పలు చెప్పుకుంటున్న చంద్రబాబు ప్రభుత్వ సిట్ నివేదికను బహిర్గత పరచాలని డిమాండ్ చేశారు. సిట్ ఏర్పాటుకు తన ఫిర్యాదులే కీలకమని అంటూ అటువంటిది సిట్ ఇచ్చిన నివేదికను తనకు కూడా ఇవ్వక పోవడం పట్ల విస్మయం వ్యక్తం చేసారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సిట్ నివేదికను ప్రభుత్వ వెబ్‌సైట్‌లో పెట్టి, శాసనసభ్యులందరికీ కాపీలు ఇప్పించాలని డిమాండ్ చేశారు. అధికార పార్టీ నాయకుల పాత్ర కూడా ఉందన్న విషయాన్ని ధైర్యం చెప్పాలని డిమాండ్ చేశారు.

కాగా, ఈ కుంభకోణంలో పాత్ర ఉన్నట్లు నిరుపితమైనదని ప్రభుత్వం `లీక్’ ఇచ్చిన మాజీ రెవిన్యూ మంత్రి, ప్రస్తుతం వైసిపి నేత ధర్మాన ప్రసాదరావు భూకుంభకోణం విచారించాల్సిన ప్రత్యేక దర్యాప్తు బృందంలో రెవెన్యూ అధికారుల్ని ఎందుకు చేర్చలేదని ప్రశ్నించారు. దీనిపై ‘సిట్‌’ సరిగ్గా విచారించలేదని విమర్శించారు. విచారణలో ఎక్కడా నిజాయతీ కనిపించడం లేదని ఆరోపించారు. గతంలో స్వాతంత్య్ర సమరయోధులకు సంబంధించిన 500 ఎకరాల భూసేకరణ వెనుక ఉన్న పెద్దలు ఎవరన్నది ప్రభుత్వం బయటపెట్టాలని డిమాండ్‌చేశారు. కేసును పక్కదారి పట్టించేందుకే తమ పేరు ఇందులో చేర్చినట్లు తెలుస్తోందని ఆరోపించారు.