విజయనగరంలో కేంద్రీయ గిరిజన వర్సిటీ

ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా రెల్లిలో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. దీనికి వీలుగా కేంద్రీయ విశ్వవిద్యాలయాల చట్టంలో సవరణలు చేయనుంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకొంది. ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టంలోని 13వ షెడ్యూల్‌లో 6వ అంశం కింద ఇచ్చిన హామీకి అనుగుణంగా దీన్ని ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ విలేకరులకు వెల్లడించారు.

 ఏపీకి ఏం చేశామని ప్రతిసారీ అడుగుతున్నారని, దానికి ఇది సమాధానమని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. దీంతో విభజన చట్టంలోని చాలా హామీలు నెరవేర్చినట్లయిందని తెలిపారు.  తొలి దశ కింద రూ.420 కోట్లు కేటాయించనున్నట్లు ప్రకటించారు. దీని ప్రకారం వచ్చే పార్లమెంటు సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించే అవకాశం ఉంది. 2019-20 విద్యా సంవత్సరం నుంచి తరగతులు ప్రారంభమయ్యే వీలుంది.

మరోవంక, విశాఖపట్నం కేంద్రంగా పనిచేస్తున్న డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (డీసీఐ)లో కేంద్ర ప్రభుత్వానికున్న 73.44శాతం వాటాలను పూర్తిగా ఉపసంహరించాలని కేంద్ర మంత్రిమండలి నిర్ణయించినట్లు రవిశంకర్‌ప్రసాద్‌ ప్రకటించారు. ఈ వాటాలను విశాఖ, కాండ్లా, ముంబయి (జేఎన్‌పీటీ), పారాదీప్‌ ఓడరేవుల సమాఖ్యకు అప్పగించనున్నట్లు చెప్పారు. దీంతో డీసీఐలో 100% పెట్టుబడుల ఉపసంహరణ పూర్తవుతుందని చెప్పారు.