తెలంగాణలో టీఆర్‌ఎస్‌ కే అద్బుత విజయం !

తెలంగాణాలో కేసీఆర్‌ నేతృత్వంలోని టీఆర్‌ఎస్‌ అద్భుత విజయాన్ని సాధిస్తుందని ఇండియాటుడే నిర్వహిస్తున్న ‘పొలిటికల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజి (పీఎస్‌ఈ)’ అంచనా వేసింది.. అక్టోబర్ 22 నుంచి నవంబర్ 6వ తేదీ మధ్య తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాల పరిధిలో పొలిటికల్ స్టాక్ ఎక్స్చేంజ్ (పీఎస్‌ఈ) సంస్థ ఈ శాంపిల్ సర్వే నిర్వహించింది. 6,877మంది ఓటర్ల నుంచి ఫోన్ ద్వారా వివరాలు సేకరించింది.

ఏకంగా 75శాతం మంది ప్రజలు టీఆర్‌ఎస్ వైపే ఉన్నారని, గులాబీ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని వారంతా నమ్ముతున్నారని అందులో స్పష్టమైంది. 44శాతం ఓట్లతో టీఆర్‌ఎస్ ఘనవిజయం సాధిస్తుందని, 46శాతం మంది ప్రజలు కే చంద్రశేఖర్‌రావు మళ్లీ ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నారని సర్వే వెల్లడించింది.

రాష్ట్ర అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలన్న కేసీఆర్ నిర్ణ యం.. విపక్షాలపై కోలుకోలేని దెబ్బ కొట్టిందని, ఆ శరాఘాతం నుంచి ప్రతిపక్ష పార్టీలు ఇంకా పూర్తిగా తేరుకోలేకపోయాయని సర్వే సంస్థ వ్యాఖ్యా నించింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. 44 శాతం ఓటర్లు టీఆర్‌ఎస్ ఘన విజయం సాధిస్తుందని అభిప్రాయపడగా, 22శాతం మంది ఓటర్లు ఎవరికి ఓటేయాలో ఇంకా ఒక నిర్ణయానికి రాలేదని తెలిపారు.

తెలంగాణలో విపక్షాలు కూటమిగా ఏర్పడినా పెద్దగా ప్రయోజనం లేదని సర్వే వెల్లడించింది. తెలుగుదేశంపార్టీతో పొత్తు ఎలాంటి అదనపు ఓట్లను రాబట్టకపోగా, అది కాంగ్రెస్‌కు నష్టం చేకూరుస్తుందని పేర్కొన్నది. టీడీపీ అధినేత చంద్రబాబును ఇప్పటికీ కుట్రదారుగానే తెలంగాణ ప్రజలు చూస్తున్నందున, ఆ పార్టీతో కలయిక కారణంగా కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజల తిరస్కరణకు గురయ్యే ప్రమాదముందని అత్యధికులు అభిప్రాయపడినట్లు పీఎస్‌ఈ తెలిపింది. హైదరాబాద్‌లో కాస్తో కూస్తో ఉన్న కాంగ్రెస్ విజయావకాశాలకు అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఎంఐఎం పార్టీ గండికొట్టే అవకాశముందని పేర్కొన్నది.