ఎపిలో రాక్షస పాలన.. కన్నా మండిపాటు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందని బీజేపీ అధ‍్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. అసలు రాష్టంలో ఎవరికీ రక్షణ లేదంటూ చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. మాజీ మంత్రి, బీజేపీ అగ్రనేత పైడికొండల మాణిక్యాల రావును  హౌస్‌ అరెస్ట్‌ చేసిన నేపథ్యంలో తాడేపల్లిగూడెం బయల్దేరిన తమ పార్టీ నేతల్ని పోలీసులు అడ్డుకోవడంపై కన్నా అసహనం వ్యక్తం చేశారు. కనకదుర్గమ్మ వారధి వద్ద రోడ్డుపై బైఠాయించిన కన్నారాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుందనడానికి ఇదే ఉదాహరణని ఆరోపించారు.

‘ మా ఎమ్మెల్యేను పరామర్శించడానికి వెళ్తుంటే పోలీసులు అన్యాయంగా రోడ్డుపైనే అడ్డుకున్నారు. రాష్ట్రంలో ఎవరికీ రక్షణ లేదు. మాణిక్యాలరావు పరిస్థితి విషమంగా ఉంది. రాష్టంలో ప్రతిపక్ష నేతకు సైతం రక్షణ లేదు. మిగతా రాజకీయ పార్టీల నాయకులకి రక్షణ ఎక్కడ ఉంటుంది. మాణిక్యాలరావును అక్రమంగా అరెస్ట్‌ చేయాల్సిన అవసరం ఏముంది’ అని ఆయన నిప్పులు చెరిగారు.

మాణిక్యాలరావును హౌస్‌ అరెస్ట్‌ చేయడంతో బిజెపి కోర్‌ కమిటీ సమావేశం రద్దు చేసుకుని తాడేపల్లిగూడెం బయల్దేరిన కన్నాను పోలీసులు అడ్డుకున్నారు. ఆయనతో పాటు బిజెపి ఎంపి జీవీఎల్‌ నరసింహరావు, కావూరి సాంబశివరావులను కూడా పోలీసులు అడ్డుకోవడమే కాకుండా వారిని హౌస్‌ అరెస్ట్‌ చేశారు. దాంతో కన్నా ఇంటి వద్ద బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.

ఇలా ఉండగా, బీజేపీ నేతలు పైడికొండల మాణిక్యాల రావు గృహ నిర్బంధం, కన్నా లక్ష్మీ నారాయణ అరెస్ట్ చేయడాన్ని ఆ పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు. డీజీపీని కలిసి ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి సత్యమూర్తి విలేకరులతో మాట్లాడుతూ స్పీకర్‌ అనుమతి లేకుండా మాణిక్యాలరావుని గృహ నిర్బంధం చేయడం చట్ట విరుద్ధమని ద్వజమెత్తారు. దేశమంతా ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందంటున్న సీఎం చంద్రబాబు నాయుడు ఏపీలో మాత్రం ప్రజాస్వామ్యాన్ని ఖునీ చేస్తున్నారంటూ మండిపడ్డారు.

చంద్రబాబు రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీల గొంతు నొక్కుతున్నారని ఆరోపించారు. బాబు చర్యలు ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఉన్నాయంటూ మండిపడ్డారు. పోలీసులు వ్యవహరించిన తీరుపై డీజీపీకి ఫిర్యాదు చేశామని తెలిపారు. జరిగిన ఘటనపై విచారణ జరిపిస్తామని డీజీపీ హామీ ఇచ్చారని చెప్పారు.