మాజీ మంత్రి మాణిక్యాలరావు గృహ నిర్బంధం

తాడేపల్లిగూడెంలో టిడిపి, బిజెపి నేతల మధ్య మాటల యుద్ధం ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. బహిరంగ చర్చకు ఇద్దరు నేతలు సిద్ధం కావడంతో అప్రమత్తమైన పోలీసులు పట్టణంలో 144 సెక్షన్‌ విధించి బలగాలను మోహరించారు. బహిరంగ చర్చకు సిద్ధమని సవాళ్లు విసురుకున్న మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు, జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ ముళ్లపూడి బాపిరాజులను పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు.

ఈ సందర్భంగా మాణిక్యాల రావు నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గృహ నిర్బంధం నుంచి బయటికి వచ్చి రోడ్డుపై బైఠాయించిన ఆయనను పోలీసులు బలవంతంగా ఎత్తుకెళ్లి ఇంట్లో పడేశారు. రోడ్డుపై గంటకు పైగా తీవ్రమైన ఎండలో కూర్చోవడం, పోలీసులు లోపలికి తీసుకెళ్లే క్రమంలో జరిగిన పెనుగులాటలో మాణిక్యాల రావు అస్వస్థతకు గురయ్యారు.

ఈ క్రమంలో పోలీసులకు బీజేపీ కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. అభివృద్ధికి ఆటంకం, మట్టి మాఫియా బాపిరాజు డౌన్‌ డౌన్‌, పోలీసుల దైర్జన్యం నశించాలంటూ బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. కాగా స్థానిక జెడ్పీ చైర్మన్‌, మున్సిపల్‌ చైర్మన్‌లపై ఉచిత ఇసుక పేరుతో తెలుగు దొంగలు రాష్ట్రాన్ని దోచుకు తింటున్నారని మాణిక్యాల రావు ఆరోపించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో అవినీతిపై చర్చించేందుకు సిద్ధమంటూ పరస్పరం సవాళ్లు విసురుకున్నారు. దీంతో నిరసన చేపట్టేందుకు ఉపక్రమించిన మాణిక్యాల రావును పోలీసులు ఎత్తుకెళ్లి ఇంట్లో పడేశారు.

గత కొద్ది రోజులుగా మాణిక్యాలరావు, జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌, టిడిపి నేత ముళ్లపూడి బాపిరాజుల మధ్య ఈ విషయమై తీవ్ర స్థాయిలో విమర్శలు, ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి. ఇద్దరి మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. పరిస్థితి తీవ్ర పరిణామాలకు దారి తీసే ప్రమాదముందని గ్రహించిన పోలీసులు నేతలిద్దరినీ గృహ నిర్బంధం చేశారు.