ఓ సామాజికవర్గం కాంగ్రెస్‌ని హైజాక్‌ చేసింది

ఏఐసీసీ కార్యాలయం ముందు పలువురు బీసీ నేతలు ఆందోళనకు దిగారు. జనాభా ప్రకారం బీసీలకు సీట్లు కేటాయించాలంటూ నిరసనకు దిగారు. టిక్కెట్‌ ఇవ్వకపోతే రెబల్‌గా పోటీకి దిగుతామంటూ బీసీ నేతలు హెచ్చరించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఓబీసీ కమిటీ కన్వీనర్‌ అశోక్‌ గౌడ్‌ మాట్లాడుతూ 4.2 శాతం ఉన్న ఓ సామాజికవర్గం కాంగ్రెస్‌ పార్టీని హైజాక్‌ చేసిందని ఆరోపించారు.

బీసీలకు సరైన విధంగా సీట్లు కేటాయించకపోతే ఓట్లు అడగవద్దని స్పష్టం చేసారు. బీసీలు ఇంతకుముందులా లేరని వ్యాఖ్యానించారు. 4.2 శాతం ఉన్న ఓ సామాజికవర్గం వారికి 42 సీట్లు కేటాయిస్తే 50 శాతం పైగా ఉన్న బీసీలకు ఎన్ని సీట్లు కేటాయించాలని సూటిగా ప్రశ్నించారు.

ఆ సామాజిక వర్గం అభ్యర్థులపై ఎన్ని కేసులున్నా సీట్లు కేటాయిస్తారు కానీ..క్లీన్‌ ఇమేజ్‌ ఉన్న మాకు(బీసీలకు) సీట్లు ఎందుకు కేటాయించరని అడిగారు. స్క్రీనింగ్‌ కమిటీలో ఆ సామాజిక వర్గానికి చెందిన వారే ఉన్నారని, స్క్రీనింగ్‌ కమిటీతో బీసీలకు ఒరిగేదేమీ లేదని వ్యాఖ్యానించారు. బీసీలకు న్యాయం జరగాలంటే కాంగ్రెస్‌లో ముందే బీసీ అభ్యర్థిని ముఖ్యమంత్రిగా ప్రకటించాలని రాహుల్‌ గాంధీని కోరుతున్నామని ప్రకటించారు.

బీసీలకు కాంగ్రెస్‌ పార్టీలో అన్యాయం జరుగుతోందని ద్వజమెత్తుతూ తమకు సరైన విధంగా సీట్లు కేటాయించకపోతే తమ కార్యచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. తమకు రాహుల్‌ గాంధీ దగ్గరికి తీసుకెళ్లాలని కోరుతూ, లేని పక్షంలో న్యాయం జరిగే వరకు ఏఐసీసీ ఆఫీసు ఎదుటే కూర్చుని దీక్ష చేస్తామని, అవసరమైతే ఆత్మహత్యకు ప్రయత్నిస్తామని బీసీ నేతలు హెచ్చరించారు.