అల్పాహారాల్లో విషం విరజిమ్ముతున్న క్యాన్సర్ !

కేన్సర్‌ వ్యాధికి కారణమవుతోందని భావిస్తున్న మోనశాంటో కలుపు నివారణి పురుగు మందు పిల్లల అల్పాహారాల్లో వున్నట్లు వెల్లడైంది. ఒక కప్పు ఓట్స్‌తో మన దైనందిన జీవితాన్ని ప్రారంభించడం ఆరోగ్యానికి హేతువు అని ఇప్పటివరకు భావిస్తూ వచ్చారు. కానీ కొత్త అధ్యయనం ప్రకారం ఓట్స్‌లో అత్యంత ప్రమాదకరమైన గ్లైఫోసాట్‌ వున్నట్లు వెల్లడైంది. క్రిమిసంహారక రసాయనమైన ఇది కేన్సర్‌ కారకమని భావిస్తున్నారు. పర్యావరణ వర్కింగ్‌ గ్రూపు ఈ అధ్యయనాన్ని నిర్వహించింది.

 

అమెరికాలో మూడు ప్రాంతాల్లో 45 రకాలైన అల్పాహారంగా తీసుకునే వివిధ రకాల ధాన్యాలను పరీక్షించగా వాటిలో 43 రకాల్లో గ్లైఫోసాట్‌ వున్నట్లు వెల్లడైంది. వీటిల్లో 31 రకాల్లో ఈ రసాయనం అత్యంత ప్రమాదకరమైన స్థాయిలో వుంది. మోనశాంటో తయారుచేసే రౌండప్‌ క్రిమిసంహారక మందు అమెరికాలో చాలా ప్రజాదరణ పొందింది. ఇందులో గ్లోఫోసాట్‌ పెద్ద మోతాదులో ఉంది.

 

అనేక ఏళ్ళ తరబడి రౌండప్‌ను ఉపయోగిస్తూ కేన్సర్‌ బారిన పడిన స్కూలు తోటమాలి మోనశాంటో కంపెనీపై కేసు వేయగా మొత్తం 28.90కోట్ల డాలర్లు నష్టపరిహారం చెల్లించాలంటూ కోర్టు ఆదేశించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ 2015లోనే గ్లైఫోసాట్‌లో కేన్సర్‌ కారకాలు వున్నాయని పేర్కొంది. అమెరికాలో 1985లోనే పర్యావరణ పరిరక్షణ సంస్థ ఈ మేరకు హెచ్చరించింది.