జవాన్లతో దీపావళి జరుపుకున్న ప్రధాని మోదీ

దీపావళి పండుగ సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌ ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆయనకు అక్కడి రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

ఏటా దీపావళిని సరిహద్దులో ఉన్న జవాన్లుతో కలిసి జరుపుకోంటున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ సంవత్సరం కుడా దీపావళి సందర్భంగా జవాన్లతో గడిపారు. భారత్‌-చైనా సరిహద్దులోని హర్సిల్‌కు చేరుకున్నారు. అక్కడ ఆర్మీ, ఐటీబీపీ జవాన్లను కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారికి దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.

‘ఎత్తైన శిఖరాలపై మంచును సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహిస్తున్న మీరు దేశానికే బలం. 125కోట్ల మంది భారతీయుల భవిష్యత్‌కు, వారి కలలకు మీరు భద్రతనిస్తున్నారు’ అంటూ జవాన్లను మోదీ కొనియాడారు.

దేశ సరిహద్దుల్లో సైనికులతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొనేందుకు బయలుదేరిన ప్రధాని మోదీ కేదార్‌నాథ్‌కు చేరుకున్నారు. కేదార్‌నాథ్‌ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పునర్నిర్మాణ పనులను ఈ సందర్భంగా ప్రధాని సమీక్షించనున్నారు. 2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం మోదీ కేదార్‌నాథ్‌ను సందర్శించడం ఇది మూడవ సారి కావడం గమనార్హం.

కేదార్‌నాథ్‌లో పూజలు ముగించుకున్న అనంతరం ఆయన పంజాబ్‌ సరిహద్దులోని జవాన్లను కలుసుకొని వారితో దీపావళి వేడుకలు చేసుకోనున్నారు. ప్రధాని మోదీ దీపావళి  సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ దీపావళి ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలను నింపాలని ఆకాంక్షించారు.

కాగా, 2014లో ప్రధానిగా తొలి దీపావళిని ఆయన సియాచిన్‌లో సైనిక జవాన్లతో జరుపుకున్నారు.  తదుపరి ఏడాది 1965 ఇండో-పాక్‌ యుద్ధం జరిగి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పంజాబ్‌ బోర్డర్‌లో సైనికులతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. ఇక 2016లో ఇండో-టిబెటన్‌ బోర్డర్‌లో సరిహద్దు అవుట్‌పోస్ట్‌లో దీపావళి వేడుకలను సైనికులతో కలిసి జరుపుకున్నారు. గత ఏడాది జమ్మూ కశ్మీర్‌లోని గురెజ్‌లో సైనికులతో మాటామంతీ నిర్వహిస్తూ దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కుడా దీపావళి నాడు జవాన్లతో గడిపేవారు.

కాగా, దీపావళి పండుగ సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీకి ఆయన స్నేహితుడు ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతాన్యాహు శుభాకాంక్షలు తెలియజేశారు. హిందీలో ప్రత్యేకంగా మోదీకి ట్వీట్‌ చేస్తూ శుభాకాంక్షలు చెప్పారు. దీనికి మోదీ కృతజ్ఞతలు చెబుతూ మరో ట్వీట్‌ చేశారు.

‘బిబి.. దీపావళి శుభాకాంక్షలు చెప్పినందుకు మీకు కృతజ్ఞతలు. ఏటా నేను సరిహద్దు ప్రాంతాలకు వెళ్లి.. దేశ సైనికులను సర్‌ప్రైజ్‌ చేస్తాను. ఈ ఏడాది కూడా అదే విధంగా సరిహద్దు ప్రాంతాలకు వెళ్లి సైన్యంతో కలిసి దీపావళి జరుపుకొంటున్నాను. వారిని కలిసి ఈ ప్రత్యేకమైన సమయాన్ని గడపబోతున్నాను. దీనికి సంబంధించిన ఫొటోలను మీకు కచ్చితంగా పంపిస్తాను’ అంటూ నవ్వుతూ ఉన్న చిహ్నాన్ని పెట్టి మోదీ ట్వీట్‌ చేశారు.