శాస్త్రోక్తంగా ముగిసిన మహాసంప్రోక్షణ

తిరుమల శ్రీవారి ఆలయంలో పన్నెండేళ్లకు ఒకసారి ఆగమోక్తంగా నిర్వహించే అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ కార్యక్రమం గురువారం శాస్త్రోక్తంగా ముగిసింది.  మహాసంప్రోక్షణ కార్యక్రమం అనంతరం ఆలయం వెలుపల చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో నిష్ణాతులైన రుత్వికులతో ఎలాంటి లోటుపాట్లు లేకుండా అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహించామని టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్‌యాదవ్, ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్ సంతృప్తి వ్యక్తం చేసారు. టీటీడీ నిర్ణయించిన సమయాల్లో యాగశాల కార్యక్రమాలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా భక్తులు ఎంతో క్రమశిక్షణతో స్వామివారిని దర్శించుకున్నారని తెలిపారు.

 

ఆగమ సలహా మండలి సూచనల మేరకు పెద్దజీయంగార్, చిన్నజీయంగార్‌ల సమక్షంలో ఆలయ ప్రధానార్చకులు వేణుగోపాల దీక్షితులు ఆధ్వర్యంలో వైభవంగా మహాసంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. 44మంది రుత్వికులు, 100మంది వేదపండితులు పాల్గొన్నారు. ఆగస్టు 11 నుండి 15వతేదీ సాయంత్రం వరకు 1.35లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఆగస్టు 17వతేదీ నుండి యధావిధిగా భక్తులు శ్రీవారిని దర్శించుకొంటున్నారు.


గురువారం ఉదయం 10.30 గంటలలకు అర్చకులు ఖాద్రి నరసింహాచార్యులు చేతుల మీదుగా ఆనందనిలయ విమాన గోపురానికి మహాసంప్రోక్షణ జరిగింది. యాగశాల కార్యక్రమాల అనంతరం శ్రీ్భగశ్రీనివాసమూర్తి, శ్రీ ఉగ్ర శ్రీనివాస మూర్తితో పాటు ఇతర దేవతామూర్తులను తిరిగి పూర్వస్థానాల్లోకి వేంచేపు చేశారు. చివరిరోజు కార్యక్రమాల్లో భాగంగా 27 హోమగుండాల్లో పూర్ణాహుతి నిర్వహించారు. గర్భాలయంలో శ్రీవారి మూలమూర్తికి, ఉప ఆలయాల్లోని స్వామివారి విగ్రహాలకు ఆగమోక్తంగా కళావాహనం నిర్వహించారు. కలశాల్లోని శక్తిని తిరిగి విగ్రహాల్లోకి ఆవాహన చేయడాన్ని కళావాహనం అంటారు.


ఆ తరువాత ప్రత్యేక ఆరాధనలు, విశేష నైవేద్యాలు సమర్పించిన అనంతరం అక్షతారోపణంతో మహాసంప్రోక్షణ కార్యక్రమం ముగిసింది. అనంతరం ఆలయ ప్రధానర్చకులతో పాటు రుత్వికులను ఆలయ ప్రదక్షిణగా అర్చక నిలయం వరకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. అక్కడ అర్చక బహుమానం సమర్పించారు. గరుడ పంచమిని పురస్కరించుకుని సాయంత్రం 5 నుండి 6.30గంటల వరకు విశేషమైన గరుడ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి 9 నుండి 11గంటల వరకు పెద్ద శేషవాహనంపై ఊరేగుతూ స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు.

 

తిరుమల శ్రీవారి ఆలయంలో గురువారం జరిగిన మహాసంప్రోక్షణ సందర్భంగా బంగారువాకిలి చెంత నిర్వహించిన చల్లింపు, శుద్ది, నివేదన సమయాల్లో గంటానాదం, డోలు, నాదస్వరం విన్యాసం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయ.