చంద్రబాబు, రాహుల్ డ్రామా కంపెనీలో రేపు కేసీఆర్ !

రేపు ఎన్నికల తరువాత చంద్రబాబు, రాహుల్ గాంధీ డ్రామా కంపెనీలో కేసీఆర్ కలిసి పోయినా ఆశ్చర్య పడాల్సిన పని లేదని తెలంగాణా బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ ద్వజమెత్తారు. చంద్రబాబు, కేసీఆర్ ఇద్దరూ కాంగ్రెస్ పాఠశాలలో చదువుకున్న వారేనని, అందుకే ఆ పార్టీ తరుపున వారిద్దరూ పని చేస్తున్నారని ఆరోపించారు. ఈ డ్రామా కూటమికి ప్రజలు బుద్ధి చెప్పాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.

బిజెపిలో చేరిన మహబూబాబాద్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేతలకు కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానిస్తూ మునిగిపోయిన పడవ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన వాళ్లు భవిష్యత్ కోసం బీజేపీలో చేరారని తెలిపారు. టీఆర్‌ఎస్‌ను బీజేపీ ఒక్కటే ఎదుర్కుంటుందన్న భావనతో అనేక మంది బీజేపీలో చేరుతున్నారని చెప్పారు.

ఎన్నికల ప్రచారంలో బీజేపీ అభ్యర్థులను ప్రజలు ఆదరిస్తున్నారని సంతోషం వ్యక్తం చేసారు.  పంచపాండవులమైన తాము ఐదుగురం కలిసి మిషన్ 60 ప్లస్ లక్ష్యంగా ఎన్నికల బరిలో నిలిచామని చెబుతూ కనీసం 60 సీట్లు గెల్చుకొని ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని భరోసా వ్యక్తం చేసారు.

 ఎన్నికల్లో కొత్తవారికి ఎక్కువగా అవకాశాలిస్తున్నామని, రెండు జాబితాల్లో కలిసి 20 మంది కొత్తవారికి టికెట్లిచ్చామని లక్ష్మణ్ పేర్కొన్నారు. వచ్చే జాబితాలో కూడా మరింత మందికి అవకాశాలిస్తామని హామీ ఇచ్చారు. యువజన, కుల సంఘాల నేతలు అనుబంధంగా ఉంటూ పోటీ చేస్తామంటూ ముందుకు వచ్చాయని తెలిపారు. వారితో చర్చలు పూర్తయిన తరువాత టికెట్లను ఖరారు చేస్తామని వెల్లడించారు.

వచ్చే ఎన్నికల్లో కనీసం ఉనికి కాపాడుకోవాలన్న తాపత్రయం తో కాంగ్రెస్ నేతలు చంద్రబాబు పార్టీ టీడీపీతో పొత్తు కుదుర్చుకున్నారని లక్ష్మణ్ విమర్శించారు. తెలంగాణ సాధన కోసం జేఏసీ ఏర్పాటు చేసిన కోదండరామ్ తెలంగాణ వ్యతిరేకి చంద్రబాబుతో కలవడాన్ని ప్రజలు జీర్ణించుకోలేక పోతున్నారని విస్మయం వ్యక్తం చేసారు.

మరోవంక, ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ చేతిలో టీఆర్‌ఎస్ చిక్కుకుందని దయ్యబట్టారు.  తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దారుసలామ్‌కు తాకట్టు పెడితే, తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని చంద్రబాబు కాంగ్రెస్‌కు తాకట్టుపెట్టారని ఆరోపించారు.

ఈ ఎన్నికల్లో కేసీఆర్ నియంతృత్వ, కుటుంబ పాలన కు అంతం పలకాలని పిలుపిచ్చారు. నాలుగేళ్ల తెలంగాణ కేసీఆర్ కుటుంబంలోని నలుగురికే పరిమితమైందని చెబుతూ ప్రజల ఆకాంక్షలు, అభ్యున్నతిని కేసీఆర్ ఏ మాత్రం పట్టించుకోలేదని ఆరోపించారు.

ప్రధాని మోడీ సంక్షేమ పాలన ప్రజల జీవితాల్లో దీపావళి వెలుగులు నింపుతోందని లక్ష్మణ్ తెలిపారు. ఈ దీపావళి ప్రజల జీవితాల్లో మరింత వెలుగులు నింపాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. దేశ ప్రతిష్టను ప్రపంచవ్యాప్తంగా నిలబెడుతున్న మోడీకి ప్రజలు అండగా నిలువాలని కోరారు. దేశాభివృద్ధిలో ప్రజలు మరింత మమేకం కావాలన్నారు. దేశ రక్షణ కోసం అమరులైన సైనికులకు ప్రతి ఒక్కరూ దీపం వెలిగించి అంకితమివ్వాలని ఆయన కోరారు.