నాలుగోసారీ అధికారాన్ని కైవసం చేసుకుంటా

వరుసగా నాలుగోసారీ అధికారాన్ని కైవసం చేసుకుంటామని ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి రమణ్‌ సింగ్‌ ధీమా వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా బీజేపీ కంచుకోటల్లో ఒకటిగా ఇప్పుడు ఛత్తీస్‌గఢ్‌ మారింది. ఒకప్పటి కాంగ్రెస్‌ అడ్డా అయిన ఛత్తీస్‌గఢ్‌పై బీజేపీ పట్టు సాధించి 2003 నుండి వరుసగా మూడు పర్యాయాలు బిజెపిని అధికారంలోకి తీసుకు రావడంలో రమణ్‌ సింగ్‌ కీలక పాత్ర వహించారు. ఇపుడు తిరిగి నాలుగే సారి కుడా తమదే అధికారం అని భరోసాతో ఉన్నారు.

మావోయిస్టులు ఎన్నికల బహిష్కరణకు పిలుపునివ్వడం అప్రజాస్వామికం అని విమర్శించారు. ఎన్నికలు ప్రజలకు రాజ్యాంగం కల్పించిన హక్కు. దీన్ని వినియోగించుకునేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుంటే మావోయిస్టులు హెచ్చరించడమేంటని ప్రశ్నించారు. రాష్ట్రంలో నక్సలైట్ల ప్రభావాన్ని గణనీయంగా తగ్గించగలిగామని చెబుతూ ఇప్పుడు బస్తర్‌ ప్రాంతానికే వారు పరిమితమయ్యారని పేర్కొన్నారు.

రాష్ట్రంలో పూర్తిగా శాంతి నెలకొల్పడమే తమ ప్రభుత్వ లక్ష్యం అని చెబుతూ అధికారంలోకి రాగానే ఈ దిశగా మా కార్యాచరణ ప్రారంభిస్తామని ప్రకటించారు.  వాస్తవానికి గత ఎన్నికల్లోనే (2013) తమకు తీవ్రమైన పోటీ ఉందని, అప్పుడే కాంగ్రెస్ నేతలను నక్సలైట్లు కాల్చి చంపారని గుర్తు చేసారు. అయితే అంతటి సానుభూతిలోనూ తామే విజయం సాధించామని, ఇప్పుడు అంతటి తీవ్రమైన పోటీ పెద్దగా ఎదురవడం లేదని తెలిపారు.

మాజీ ముఖ్యమంత్రి  అజిత్‌ జోగి బిఎస్పి మద్దతుతో పోటీలోకి రావడం మంచి పరిణామమని చెప్పారు. జోగి తన సొంతపార్టీతో పోటీ చేయడం ఈ ఎన్నికలను మరింత రసతవత్తరంగా మారుస్తుంది. ఆయన బీఎస్పీతో కలిసి ఎన్నికల బరిలో దిగుతుండటం బీజేపీ, కాంగ్రెస్‌లపై దీని ప్రభావం ఉంటుంది. ఏమాత్రం సందేహం లేదు. కానీ ఇది కాంగ్రెస్‌కే ఎక్కువ నష్టం చేస్తుందని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. ఆయన్ను ఇప్పటికీ కాంగ్రెస్‌ నేతగానే ప్రజలు భావిస్తున్నారని చెప్పారు.

ఛత్తీస్‌గఢ్‌లోని మొత్తం 90 స్థానాల్లో 29 గిరిజనులకు, 10 ఎస్సీలకు రిజర్వ్‌ అయ్యాయి. మిగిలినవి జనరల్‌ స్థానాలు. గతంలో ఎస్సీ స్థానాల్లో ఎక్కువ బిజెపి గెలిచింది. ఇక  గిరిజనులెప్పుడూ బిజెపితోనే ఉంటారు. ఛత్తీస్‌గఢ్‌లో కులసమీకరణాల ప్రభావం పెద్దగా ఉండదని, తాను తటస్థ వాదినని, రాష్ట్రవ్యాప్తంగా అన్ని కులాలూ తననే ఆదరిస్తాయని రామన్ సింగ్ పేర్కొన్నారు. అయినా.. అభివృద్ధి అంశంపైనే తాము ఈ సారి ఎన్నికల బరిలో నిలుచున్నామని అంటూ ఛత్తీస్‌గఢ్‌లో మేమేం చేశామో ప్రజలకు తెలుసు. రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేకత అనే పదానికి తావే లేదని స్పష్టం చేసారు.