బిజెపి మద్దతుతో శ్రీనగర్ మేయర్ ఎన్నిక

నేషనల్‌ కాన్ఫరెన్స్‌ మాజీ నేత జునైద్‌ అజిమ్‌ మట్టు శ్రీనగర్‌ మేయర్‌గా ఎన్నికయ్యారు. ఇటీవలి స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల అనంతరం మంగళవారం శ్రీనగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ స్థానానికి ఎన్నిక నిర్వహించారు. ఈ ఎన్నికలో జునైద్‌ అజిమ్‌ మట్టు బీజేపీ, పీపుల్స్‌ కాన్ఫరెన్స్‌ పార్టీల మద్దతుతో మేయర్‌గా ఎన్నికైనట్లు ఎస్‌ఎంసీ కమిషనర్‌ పీర్‌ హఫీజుల్లా తెలిపారు.

జమ్మూ కశ్మీర్‌లో స్థానిక సంస్థల ఎన్నికలని బహిష్కరించాలని నేషనల్ కాన్ఫరెన్స్ నిర్ణయించడంతో గత సెప్టెంబర్ లో పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన జునైద్‌ అజిమ్‌ మట్టు స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేశారు. ఎస్‌ఎంసీలో మొత్తం 76 ఓట్లకు గాను కాంగ్రెస్‌ అభ్యర్థి గులామ్‌ రసూల్‌ హజమ్‌కు 26 ఓట్లు, మట్టుకి 40 ఓట్లు లభించాయి.

నాలుగు వార్డ్ ల నుండి స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసిన ఆయన మూడు చోట్ల నుండి గెలుపొందారు. పిడిపి-బిజెపి ప్రభుత్వంలో బిజెపి ప్రతినిధిగా మంత్రిగా పని చేసిన లోనే ఆయనకు తగు మద్దతు కూడదీయడంలో కీలక పాత్ర వహించిన్నట్లు తెలుస్తున్నది.  తిరుగుబాటు పిడిపి నేత, ప్రముఖ షియా నేత ఇమ్రాన్ రాజా అన్సారి కూడా కీలక పాత్ర వహించారు.

ఎన్నికలకు ముందే శ్రీనగర్ మేయర్ గా పేరు చెప్పక పోయినా విదేశాలలో చదువుకున్న వ్యక్తి కాబోతున్నారని అంటూ గవర్నర్ సత్ పాల్ మాలిక్ పేర్కొనడం రాజకీయ సంచలనం రేపింది. ఎన్నికలను బహిష్కరించిన నేషనల్ కాన్ఫరెన్స్, పిడిపి ఆందోళనకు గురయ్యాయి.

ఎస్‌ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 16 సీట్లను గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే మేయర్‌ పదవికి కనీసం 38 సీట్లు కావాల్సి ఉంది. పీపుల్స్‌ కాన్ఫరెన్స్‌ 4 , బీజేపీ 5 గెలుపొందగా, 53 సీట్లను స్వతంత్రులు దక్కించుకున్నారు.