కాంగ్రెస్ పార్టీకి ఛత్తీస్‌గఢ్‌లో కాలం చెల్లింది !

కాంగ్రెస్ పార్టీకి ఛత్తీస్‌గఢ్‌లో కాలం చెల్లిందని, ఆ పార్టీకి సంస్థాగత నిర్మాణం లేదని, కార్యకర్తలు లేనే లేరని జనతా కాంగ్రెస్ ఛత్తీస్‌గఢ్ (జేసీసీ) అధినేత, మాజీ ముఖ్యమంత్రి  అజిత్ జోగి స్పష్టం చేసారు. ఈ నెలలో జరిగే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో జేసీసీ-బీఎస్‌పీ కూటమికి, అధికార బీజేపీకి మధ్యే ప్రధాన పోటీ ఉంటుందని చెప్పారు. బీఎస్‌పీ అధినాయకురాలు మాయావతితో పొత్తు కేవలం కొద్ది గంటల్లోనే ఖరారైందని చెబుతూ  ఛత్తీస్‌గఢ్‌లో జేసీసీ- బీఎస్‌పీ కూటమి తరఫున తానే సీఎం అభ్యర్థినని అజిత్ జోగి తెలిపారు.

వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల్లోనూ తమ కూటమి కొనసాగుతుందని, మాయావతి ప్రధాని అభ్యర్థిగా ఉంటారని ప్రకటించారు. దేశ ప్రధాని పదవికి మాయావతి అర్హురాలు. ఆ పదవికి ఆమె సరైన వ్యక్తి. సామర్థ్యం గల నేత అని అజిత్ జోగి తెలిపారు. మాయావతి సహజసిద్ధమైన నాయకురాలని అభివర్ణించారు. ప్రధానిగా పలు అంశాలు ఆమెకు అనుకూలంగా ఉన్నాయని పేర్కొన్నారు.

ఆమె దళిత సామాజికవర్గానికి చెందిన వారు. మహిళ. నాలుగుసార్లు ఉత్తర్‌ప్రదేశ్ సీఎంగా పని చేసిన అనుభవం ఉంది అని చెప్పారు. 2000లో మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్‌గఢ్ ఏర్పాటైన తర్వాత 2003 వరకు అజిత్ జోగి నాటి కాంగ్రెస్ ప్రభుత్వానికి సీఎంగా పని చేశారు. తర్వాత అంతర్గత కుమ్ములాటలతో కాంగ్రెస్ పార్టీ ఏనాడూ అధికారంలోకి రాలేదు. 2003 నుంచి 15 ఏళ్లుగా బీజేపీ అధికారంలో కొనసాగుతున్నది.

2016లో కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన అజిత్ జోగి సొంతంగా జేసీసీ పేరుతో పార్టీని ఏర్పాటు చేశారు. 2003, 2008, 2013 ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య ముఖాముఖి పోరు జరిగింది. ప్రస్తుత ఎన్నికల్లో జోగి- మాయావతి కూటమి తృతీయ పక్షంగా ఉండటంతోపాటు హంగ్ అసెంబ్లీ ఏర్పడితే తమ మద్దతు కీలకంగా మారి కింగ్ మేకర్ పాత్ర పోషించ వచ్చని జోగి భావిస్తున్నట్లు కనిపిస్తున్నది.

బీఎస్‌పీ అధినాయకురాలు మాయావతి దళిత ఓటర్లను ఆకర్షించగలరని, తన సామాజిక వర్గం మహర్లు, సత్నామీల మద్దతు తమకు లభిస్తుందని జోగి పేర్కొన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని మోదీపై ఉమ్మడి పోరు సాగించేందుకు కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఏర్పాటయ్యే మహా కూటమిలో మాయావతి కూడా ఒక కీలక భాగస్వామి అవుతారని భావిస్తున్న తరుణంలో ఆమెతో ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో అజిత్ జోగి పొత్తు కుదుర్చుకోవడం ప్రాధాన్యం సంతరించుకున్నది.