చత్తీస్‌గఢ్ లో 62 మంది మావోయిస్టులు లొంగుబాటు

చత్తీస్‌గఢ్ రాష్ట్ర అసెంబ్లీకి మరో నాలుగు రోజుల్లో తొలిదశ పోలింగ్ జరుగనుండగా మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టులకు పెట్టనికోట వంటి బస్తర్ ప్రాంతంలో 62 మంది నక్సల్స్  లొంగిపోయారు. ఇది చాలా పెద్ద విజయం అని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. 62 మంది నక్సల్స్‌లో 51 మంది బర్మార్ తుపాకులతో లొంగిపోయారని బస్తర్ రీజియన్ ఐజీ వివేకానంద సిన్హా తెలిపారు.

వీరంతా మావోయిస్టు కుతుల్ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో చురుగ్గా పని చేస్తున్న కార్యకర్తలే అని చెప్పారు. భారీస్థాయిలో నక్సల్స్ జనజీవన స్రవంతిలో కలువడం తప్పనిసరిగా సానుకూల పరిణామం. ఇది మావోయిస్టులపై మానసికంగా తీవ్ర ప్రభావం చూపుతుంది అని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల బహిష్కరణకు పిలుపునిచ్చిన మావోయిస్టులు ఉనికిని కాపాడుకునేందుకు విధ్వంసాలకు పాల్పడుతూ, ప్రాణ, ఆస్తి నష్టాలకు దిగుతున్నారని విమర్శించారు. లొంగిపోయిన వారిలో కనీసం ఐదుగురు మావోయిస్టులు పలు నేరాలకు పాల్పడినట్లు అరెస్ట్ వారంట్లు ఉన్నాయని చెప్పారు.

90 స్థానాల ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికల్లో తొలిదశ కింద ఈ నెల 12న 18 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగనుంది. ఈ నియోజకవర్గాల్లో అత్యధికం బస్తర్ రీజియన్ పరిధిలోనివే. నక్సల్స్ లొంగుబాటు వార్త తెలియగానే కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ స్పందిస్తూ ఛత్తీస్‌గఢ్‌లో ఆయుధాలు విడనాడి మావోయిస్టులు భారీ సంఖ్యలో పోలీసుల ముందు లొంగిపోయారని తెలియజేసేందుకు సంతోషిస్తున్నట్లు తెలిపారు. ఇంతటి భారీ విజయాన్ని సాధించిన రాష్ట్ర ముఖ్యమంత్రి రమణ్‌సింగ్‌ను, డీజీపీని, పోలీసు బలగాలను అభినందిస్తున్నా అని ట్వీట్ చేశారు.

ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం నక్సల్స్ లొంగుబాటు కోసం సమర్థవంతంగా అమలు చేస్తున్న పునరావాస విధానానికి తాజా లొంగుబాట్లు స్పష్టమైన సంకేతం అని రాజ్‌నాథ్ వరుస ట్వీట్లలో పేర్కొన్నారు. లొంగిపోయిన వారంతా మావోయిస్టు అనుబంధ ప్రజా సంఘాల్లో ఏడెనిమిదేండ్లుగా పని చేస్తున్నారని చెప్పారు.