జేడీఎస్‌-కాంగ్రెస్ జోరు.. బిజెపికి షాక్

క‌ర్నాట‌క‌లో బీజేపీకి షాక్ త‌గిలింది. ఆ రాష్ట్రంలో జ‌రిగిన రెండు అసెంబ్లీ స్థానాల్లో జేడీఎస్‌, కాంగ్రెస్ కూట‌మి విజ‌యం సాధించింది. రామ‌న‌గ‌రం, జామ‌ఖండి అసెంబ్లీ స్థానాల‌ను ఆ కూట‌మి కైవ‌సం చేసుకున్న‌ది.

రామ‌న‌గ‌రం స్థానం నుంచి జేడీఎస్ అభ్య‌ర్థిగా పోటీ చేసిన ముఖ్యమంత్రి కుమారస్వామి సతీమణి అనితా కుమార‌స్వామి విజ‌యం సాధించారు. జామ‌ఖండి నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ అభ్య‌ర్థి ఆనంద న‌మ‌గౌడ గెలుపొందారు. రామ‌న‌గ‌రం అసెంబ్లీ స్థానం నుంచి అనిత కుమార‌స్వామి సుమారు ల‌క్షా 9 వేల 137 ఓట్ల తేడాతో విజ‌యం సాధించారు. ఇక జామ‌ఖండీ అసెంబ్లీ స్థానం నుంచి ఆనంద న‌మ‌గౌడ సుమారు 39 వేల 480 ఓట్ల తేడాతో గెలుపొందారు.

ఇక మూడు లోక్ సభ రెండింటిని కూటమి గెలుచుకోగా, బిజెపి మాత్రం ఒకటి గెల్చుకొంది. శివ‌మొగ్గలో బీజేపీ త‌ర‌పున పోటీ చేసిన మాజీ ముఖ్యమంత్రి య‌డ్యూర‌ప్పకుమారుడు   బీవై రాఘ‌వేంద్ర 52 వేల 148 ఓట్ల తేడాతో ప్ర‌త్య‌ర్థిపై నెగ్గారు. జేడీఎస్ పార్టీకి చెందిన మ‌ధు బంగార‌ప్పపై ఆయ‌న విజ‌యం సాధించారు.

మాండ్యా లోక్ సభ జేడీఎస్ అభ్య‌ర్థి ఎల్ఆర్ శివ‌రామ గౌడ గెలుచుకున్నారు. భారీ తేడాతో ఆయ‌న ప్ర‌త్య‌ర్థిని మ‌ట్టిక‌రిపించారు. 17 రౌండ్ల త‌ర్వాత ఆయ‌న సుమారు 3 ల‌క్ష‌ల‌కు పైగా ఓట్ల తేడాతో లీడింగ్‌లో ఉన్నారు. నాగ‌మంగ‌ల తాలూక‌కు చెందిన శివ‌రామ గౌడ‌ గ‌తంలో రెండు సార్లు ఎమ్మెల్యేగా చేశారు. శివ‌రామ గౌడ‌కు మొత్తం 5 ల‌క్ష‌ల 53 వేల 374 ఓట్లు పోల‌య్యాయి. ఆయ‌న ప్ర‌త్య‌ర్థి, బీజేపికి చెందిన సిద్ద‌రామ‌య్య‌కు కేవ‌లం 2 ల‌క్ష‌ల 44 వేల 377 ఓట్లు మాత్ర‌మే ప‌డ్డాయి.

ఇక బిజెపికి కంచుకోటగా బహావించే బళ్లారిలో 18 ఏళ్ళ తర్వాత బిజెపి మొదటి సారిగా ఓటమి చెందింది. బిజెపి అభ్యర్థి శాంతపై కాంగ్రెస్‌ అభ్యర్థి ఉగ్రప్ప రెండు లక్షల మేరకు  మెజార్టీతో గెలుపొందారు. బళ్లారిలో 2004 నుంచి బిజెపి గెలుస్తూ వస్తోంది. అంతేగాక గాలి జనార్దన్‌ రెడ్డి సోదరులకు మంచి పట్టున్న నియోజకవర్గం. గత 2014 లోక్‌సభ ఎన్నికల్లోనూ బిజెపి నేత బి. శ్రీరాములు బళ్లారిలో విజయం సాధించారు. అయితే ఈ ఏడాది కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన శ్రీరాములు తన లోక్‌సభ స్థానానికి రాజీనామా చేశారు. ఇప్పుడు ఆయన సోదరి శాంత పోటీ చేసారు.