ఐఎన్‌ఎస్ అరిహంత్ అణు జరాంతర్గామితో ‘శక్తిమాన్ భారత్’

భారత దేశం ఇతర దేశాలపై దాడి చేయదు అయితే ఇతరులెవ్వరైనా దాడిచేస్తే వారిని వదిలిపట్టేది లేదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. ఐఎన్‌ఎస్ అరిహంత్ అణు జరాంతర్గామి నావికాదళంలో చేరటంతో ‘శక్తిమాన్ భారత్’ రూపొందటం ప్రారంభమైందని నరేంద్ర మోదీ ప్రకటించారు. దేశ మొదటి అణు జలాంతర్గామి అరిహంత్ (శతృ వినాశిని) భారత నావికాదళంలో చేరి సముద్ర జలాల్లో తన మొదటి గస్తీ కార్యక్రమాన్ని ముగించుకుని వచ్చిన సందర్భంగా ప్రధాన మంత్రి కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో నరేంద్ర మోదీ ప్రసంగిస్తు అరిహంత్ అణ్వాయుధ, అణు జలాంతర్గామిని నావికా దళంలోకి చేర్చటం ద్వారా భారతదేశం త్రివిధ అణ్వాయుధ సామర్థ్యాన్ని సాధించుకున్నదని కొనియారు.

ఇంతవరకు సైనిక, వాయు దళాల వద్ద అణ్వాయుధ ప్రయోగ వ్యవస్థ ఉన్నది. ఎయిర్ ఫోర్స్ వద్ద ఉన్న మిరేజ్-2000 యుద్ధ విమానాలు, సైనిక దళం ఉన్న అగ్ని క్షిపణుల ద్వారా శతృ దేశాలపై అణ్వాయుధాలను ప్రయోగించగలుగుతాం. ఇప్పుడు అణ్వాయుధ ఐఎన్‌ఎస్ అరిహంత్ జలాంతర్గామి నావికాదళంలో చేరి మొదటి గస్తీ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసుకోవటంతో భారతదేశం అమ్ముల పొదిలో సైనిక, వాయు, నావికాదళ అణ్వాయుధాలు, త్రివిధ ఆణ్వాయుధ వ్యవస్థ ఏర్పడింది. త్రివిధ అణ్వాయుధ వ్యవస్థ వలన దేశంలోని 130 కోట్ల మంది ప్రజలకు పూర్తి భద్రత ఏర్పడిందని నరేంద్ర మోదీ ప్రకటించారు.

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం షిప్‌యార్డ్‌లో తయారుచేసిన ఆరువేల టన్నుల అరిహంత్ అణు జలాంతర్గామిలో 3,500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని చేధించగలిగే నాలుగు అణు క్షిపణులు, ఇతర క్షిపణలు ఉంటాయి. త్రివిధ అణ్వాయుధ వ్యవస్థ స్థాపన జరిగిన ఈ రోజు చారిత్రాత్మికమని నరేంద్ర మోదీ చెప్పారు. కొన్ని దేశాలు చేస్తున్న అణు బ్లాక్‌మెయిల్‌కు అరిహంత్ దీటైన జవాబని మోదీ చెప్పారు. భారత అణ్వాయుధాలు ఇతర దేశాలను బెదిరించేందుకు, భయపెట్టేందుకు కాదు.. కేవలం స్వీయరక్షణ కోసమేనని ఆయన స్పష్టం చేశారు. భారత అణ్వాయుధాల మూలంగా ప్రపంచ శాంతి మరింత పటిష్టం అవుతుందని మోదీ అభిప్రాయపడ్డారు.

మనదేశం చుట్టూ అణ్యాయుధాలు పెరిగిపోతున్న తరుణంలో మన వద్ద అణ్వాయుధాలుండడం ఎంతో అవసరం. ‘అరిహంత్’తో ఈ అవసరం పూర్తవుతుందని మోదీ చెప్పారు. అరిహంత్ నావికాదళంలో చేరటం వలన దేశం శక్తి సామర్థ్యాలు ఎంతో పెరిగాయని ఆయన తెలిపారు. దేశ భద్రతలో అరిహంత్ ఒక గొప్ప మైలురాయి అని ప్రధాన మంత్రి ప్రకటించారు. దేశ ప్రజలు శక్తిమాన్ భారత్‌ను కోరుకుంటున్నారు.. నవీన భారతదేశాన్ని కోరుకుంటున్నారు.. ఈ లక్ష్య సాధనకోసం మనం ఎంతో కష్టపడ్డామని ఆయన చెప్పారు.

శక్తిమాన్ భారత్ ఏర్పడటం వలన ప్రపంచ శాంతికి ఊతం లభిస్తుందని భరోసా వ్యక్తం చేసారు. అణు జలాంతర్గామి నావికాదళంలో చేరిన సందర్భంగా మనం మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి, మాజీ రాష్టప్రతి, మిస్సైల్ మ్యాన్ అబ్దుల్ కలాంను స్పరించుకోవలసిన అవసరం ఎంతో ఉన్నదని మోదీ చెప్పారు. శక్తిమాన్ భారత్‌కోసం వీరిరువురు ఎంతో కృషిచేశారని ఆయన ప్రశంసించారు. శతృవులు, అశాంతి కాముకులకు అరిహంత్ ఒక బహిరంగ హెచ్చరిక అని మోదీ తెలిపారు. శాంతి, సౌభ్రాతృత్వాన్ని కోరుకోవటం మన బలం తప్ప బలహీనత కాదు.. మన అణ్వాయుధాలు ఆక్రమణ విధానంకోసం కాదు.. శాంతి, సుస్థిరతకు మాత్రమేనని నరేంద్ర మోదీ ప్రకటించారు. అరిహంత్ అణు జలాంతర్గామి ఇండో-పసిఫిక్ ప్రాంతంలో సుస్థిరతను నెలకొల్పుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. దేశ రక్షణ మనకు సర్వస్వమని ఆయన ప్రకటించారు.