భారత రాజకీయ భీష్ముడు వాజపేయి

 

 

అటల్ బిహారీ వాజపేయి మృతితో భారతదేశం గొప్ప రాజనీతిజ్ఞుడిని కోల్పోయిందని,  ఆయన మృతి భారత దేశానికి తీరనిలోటని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఘనంగా నివాళులు అర్పించారు. వాజ్ పేయి ఉదారవాది, మానవతావాది, కవి, సిద్ధాంతకర్త. మంచి వక్త, నిరాడంబరుడు, నమ్మిన సిద్ధాంతం కోసం జీవితాంతం వరకు పనిచేశారని కొనియాడారు. తాను నమ్మిన ఆదర్శాలను నిజజీవితంలో ఆచరించి చూపించారని తెలిపారు. ఎంపిగా, ప్రధాన ప్రతిపక్ష నేతగా, విదేశాంగ మంత్రిగా, ప్రధానమంత్రిగా, బహుముఖ పాత్ర పోషించారని పేర్కొన్నారు.

 

వ్యక్తిగతంగా, పార్టీపరంగా తనకు వాజ్ పేయితో అత్యంత సాన్నిహిత్యం ఉందని అంటూ  ఆయన పరిపాలన, రాజకీయ అనుభవాలు ‘‘వాజ్ పేయి శకం’’గా భారత రాజకీయ చరిత్రలో నిలిచిపోతుందని పేర్కొన్నారు. అత్యత్తమ పార్లమెంటేరియన్ అంటూ పార్లమెంటులో అద్భుతమైన ప్రసంగాలతో సమకాలీకులకు మార్గదర్శకం చేశారని, పార్లమెంటేరియన్ గా 4దశాబ్దాల సుదీర్ఘ అనుభవం ఉందని, 10సార్లు లోక్ సభకు, రెండుసార్లు రాజ్యసభకుఎన్నికైనారని వివరించారు. జనసంఘ్ అధ్యక్షుడిగా, జనతా పార్టీ నాయకుడిగా, తరువాత బిజెపి వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్నారని అంటూ ప్రధానిగా విశ్వాస పరీక్షలో ఒక ఓటుతో తన ప్రభుత్వం ఓడిపోయినా ఏమాత్రం చలించని మేరునగ ధీరుడని ప్రసంస్థలు కురిపించారు.

 

13రోజులు ప్రధానమంత్రిగా పనిచేసినా,13నెలలు ఉన్నా,పట్టుదలతో పనిచేసి 5ఏళ్లు ప్రధానిగా దేశ ప్రజలపై చిరకాల ముద్రవేశారని పేర్కొన్నారు. అన్ని తరాల వారితో కలిసి పని చేసిన ఘనత వాజ్ పేయికే దక్కుతుందని అంటూ ఐదు తరాలకు వారధిగా అభివర్ణించారు. 1984లో కేవలం 2సీట్లకే పరిమితం అయిన భారతీయ జనతాపార్టీని ఈ రోజు 270 సీట్లకు బిజెపి ఎదిగేలా చేయడంలో అటల్ బిహారీ వాజ్ పేయిదే ప్రధాన పాత్ర అని తెలిపారు.

 

వాజ్ పేయి మంత్రివర్గంలో ఏడెనిమిది మంత్రి పదవులు ఇవ్వడానికి ముందుకు వచ్చినా రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తాము బైటనుంచి ఎన్డీఏ-1ప్రభుత్వానికి మద్ధతు ఇచ్చామే తప్ప మంత్రి పదవులు తీసుకోలేదని గుర్తు చేశారు. అబ్దుల్ కలామ్ ను రాష్ట్రపతి అభ్యర్ధిగా ప్రతిపాదించడంలో కూడా తాను చొరవ తీసుకుని అటు వాజ్ పేయితో మాట్లాడటం, ఇటు అబ్దుల్ కలామ్ ను ఒప్పించడంలో క్రియాశీలంగా వ్యవహరించానని పేర్కొన్నారు.

 

ప్రధానమంత్రిగా అన్ని రాష్ట్రాలలో పెద్దఎత్తున ఇన్ ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చేశారని అంటూ గత 32 ఏళ్లలో అభివృద్ధి చెందిన రోడ్లలో సగం వాజపేయి నేతృత్వంలోని ఎన్.డి.ఎ ఐదేళ్ల పాలనలో అభివృద్ధి చెందినవే అని తెలిపారు. నదుల అనుసందానానికి, స్వర్ణ చతుర్భుజి రహదారుల నిర్మాణానికి విశేష కృషి చేశారని చెప్పారు.

 

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి వాజ్ పేయి ఎంతగానో తోడ్పాటు అందించారని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. తడ నుంచి ఇచ్చాపురం వరకు నేషనల్ హైవే నెం.5 అభివృద్దికి, వెలుగు ప్రాజెక్టుకు ప్రపంచ బ్యాంకు నిధులు రావడం, ఫుడ్ ఫర్ వర్క్ కింద 50వేల టన్నుల బియ్యం కేటాయింపు,  మైక్రో ఇరిగేషన్(బిందు,తుంపర సేద్యం) అభివృద్ధి, హైదరాబాద్ లో ఐటి రంగం అభివృద్ధి, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, అవుటర్ రింగ్ రోడ్డు నిర్మాణంలో వాజ్ పేయి సహకారం మరువలేనిదని పేర్కొన్నారు.


మైక్రో ఇరిగేషన్ పై టాస్క్ ఫోర్స కు ఛైర్మన్ గా తనను నియమించినప్పుడు దేశంలో 3మిలియన్ హెక్టార్లలో మైక్రో ఇరిగేషన్ (డ్రిప్ ఇరిగేషన్ 2మిలియన్ హెక్టార్లు, స్ప్రింక్లర్ ఇరిగేషన్ 1 మి.హెక్టార్లు) చేపట్టాలని అప్పట్లో ఇచ్చిన టాస్క్ ఫోర్స్ నివేదికలో పేర్కొన్నామని తెలిపారు. ఆ స్ఫూర్తితోనే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో మైక్రో ఇరిగేషన్ ను 33లక్షల ఎకరాల నుంచి కోటి ఎకరాలకు తీసుకెళ్లాలని సంకల్పంగా పెట్టుకున్నామని చెప్పారు.