మరో కాషాయ రాష్ట్రంగా తెలంగాణ

‘మరో కాషాయ రాష్ట్రంగా తెలంగాణ ఆవిష్కారం కానుంది. దోచుకో.. దాచుకో విధానాలను అనుసరిస్తున్న కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ను తరిమి కొట్టి నీతివంతమైన పాలన అందించే బీజేపీకే ప్రజలు పట్టం గట్టాలి’ అని శ్రీపీఠం అధిపతి స్వామి పరిపూర్ణానంద పిలుపిచ్చారు.  పీర్జాదిగూడ పురపాలక సంఘం పరిధిలోని ఉప్పల్ బస్‌డిపో ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో మేడ్చల్ నియోజకవర్గం బీజేపీ బూత్ స్థాయి విజయ సంకల్ప సమ్మేళనంలో ప్రసంగిస్తు 38 ఏళ్లుగా బీజేపీ అధికారంలో ఉన్నా, లేకపోయినా దేశంలో ప్రజా సమస్యలపై వీరోచితంగా ఉద్యమిస్తున్నదని చెప్పారు.

నీతి, నిజాయితీ, నిబద్ధతతో పని చేసే బీజేపీకి తెలంగాణలో మంచి రోజులు రాబోతున్నాయని స్వామి జోస్యం చెప్పారు. పోలీసుల వృత్తి ధర్మం కూడా ఆపధర్మ ముఖ్యమంత్రి నిజాం పరిపాలన కింద అధర్మమేనని వ్యాఖ్యానించారు. ఎన్ని అవరోధాలు ఎదురైనా ఓపిక పట్టాలని పిలుపునిచ్చారు. సైనికులైన తమ పార్టీ కార్యకర్తల జోలికొస్తే భస్మమేనని హెచ్చరించారు. కేసీఆర్ 8వ నిజామైతే, కేటీఆర్ 9వ నిజామని విరుచుకుపడ్డారు.

తల, తోక ఒక్కటే అయిన బీజేపీ సత్తా ఏమిటో వచ్చే డిసెంబర్ 11న చూపిస్తామని పరిపూర్ణానంద స్పష్టం చేసారు. కారులో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత, సంతోష్‌తో సీట్లు నిండిపోయాయని, మిగితా వారికి సీట్ నిల్ అని తేలిపోయిందని ఎద్దేవా చేసారు. మిగతా వారంతా ఇంటికి పోవాల్సిందేనని జోస్యం చెప్పారు. ఆపధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన కర్నాటక రాష్ట్రం తరహాలో సీఎం కుర్చీ కోసం ఆశపడే ఎంఐఎం కనుసైగల్లో నడుస్తున్నని ఆరోపించారు.

87 శాతం ఉన్న బీసీలను మరిచి, మైనారిటీలుగా ఉన్న ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ ఎలా ఇస్తారో సమాధానం చెప్పాలని సర్కారును డిమాండ్ చేశారు. కాంగ్రెస్, టీడీపీ పార్టీల మహా కూటమిని కాల కూటమిగా ఆయన అభివర్ణించారు. గడ్డం తీయక జరుసలాం జీసెస్ పాలన కోసం ఎదురుచూస్తున్న టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ముస్లిం నిజాం పాలన కోరుతున్న కేసీఆర్ పాలన కావాలా, లేదంటే నీతి, నిజాయితీ, నిబద్ధతతో స్వచ్ఛమైన పాలన అందించే బీజేపీ కావాలా? అన్నది ప్రజలే నిర్ణయించుకోవాలని స్పష్టం చేసారు.

దేశ ప్రజల రక్షణ కోసం, రామాయణంలో రాముడిలా ఉన్న ప్రధాని నరేంద్ర మోదీతోనే అద్భుత తెలంగాణ కాబోతుందని జోస్యం చెప్పారు. 2019లో దేశంలో బీజెపీకి 300 స్థానాలతో అధికారంలోకి రాబోతుందని, దక్షిణాదిలో అత్యధిక స్థానాలు గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ పండుగ రాబోతోందని, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ప్రధాని నరేంద్ర మోదీ ప్రచారంలో పాల్గొంటారని చెప్పారు.

బీజేపీ మేడ్చల్ అభ్యర్థి పీ.మోహన్ రెడ్డి మాట్లాడుతూ మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్.. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని విరుచుకుపడ్డారు. సీట్ల కోసం నడి రోడ్డులో ప్రభుత్వాన్ని వదిలేసి మళ్లీ ప్రజల్లోకి వచ్చి ఓట్లు అడుగుతున్న కేసీఆర్‌కు ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. అభివృద్ధి పేరుతో రాష్ట్రాన్ని దోచుకున్న టీఆర్‌ఎస్ పాలనకు చరమ గీతం పాడాలని చెప్పారు.