చంద్రబాబు గారూ మర్యాదగా రిటైరవ్వండి

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారూ ఇక మీరు మర్యాదగా రిటైరవ్వండి..యువ, తవ తరానికి అవకాశం ఇవ్వాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపిచ్చారు. మీకు వయసు పెరిగిపోయింది, రాజకీయాల నుంచి తప్పుకోవాల్సిందేనని స్పష్టం చేసారు. లోకేష్‌ను చంకనెత్తుకుని సీఎంని చేయండి అంటే మేమంతా ఎలా కన్పిస్తున్నామని ప్రశ్నించారు. చంకనెక్కితే సీఎం కాలేరని, అనుభవం ఉండాలని చెబుతూ “సీఎం గారూ ఇక చాలించండి మీ అవినీతి” అంటూ హెచ్చరించారు. రాజకీయాల్లోకి కొత్త రక్తం రావాలి అంటూ బాధ్యత కలిగిన శక్తి సామర్ధ్యాలు కలిగిన యువత వస్తోందని చెప్పారు.

 2019లో అధికారంలోకి వచ్చేది జనసేన అని స్పష్తం చేసారు. జనసేన ప్రజా పోరాట యాత్రలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తు వంతాడలో జరుగుతోన్న అక్రమ మైనింగ్ వల్ల ఏడాదికి ప్రభుత్వ ఖజానానికి రూ. 3వేల కోట్లు గండి పడుతోందని విమర్శించారు. వంతాడ మైనింగ్ చూసేందుకు వెళ్తుంటే ఆండ్రూస్ సంస్థ రోడ్డుకు అడ్డంకులు కల్పించిందని పవన్ కళ్యాణ్ ప్రస్తావిస్తూ ఆండ్రూస్ సంస్థ తాటతీసి కాళ్లూ, కీళ్లూ విరిచేస్తామని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

టీడీపీ అవినీతి మయంగా మారిందని ద్వజమెత్తుతూ త్వరలో ప్రజల ఆకాంక్షలకు తగిన వ్యక్తి సీఎం కానున్నారని తెలిపారు. ప్రజలు జవాబుదారీ రాజకీయాలు, అవినీతి లేని పాలన ఆకాంక్షిస్తున్నారని, ఆ ఆకాంక్షలు జనసేన నెరవేర్చుతుందని భరోసా ఇచ్చారు.  ప్రజా సమస్యలపై గుండెల్లో పెట్టుకుని పోరాటాన్ని సాగిస్తున్నానని హామీ ఇచ్చారు.  

ఎక్కడో ఏసీబీ దాడులు జరుగుతుంటే చంద్రబాబునాయుడు ఎందుకు భయపడుతున్నారని పవన్ ప్రశ్నించారు. సీ ఎంకి మనకు తెలియని రహాస్యాలేవో ఉన్నాయేమోనని అనుమానం వ్యక్తం చేసారు.  వంతాడలో రూ. మూడు వేల కోట్ల విలువైన లేటరైట్ తవ్వేశారని జేసీ నివేదిక తెలియజేస్తుందని చెబుతూ అక్రమార్కులు ప్రభుత్వ ఖజానాన్ని సొంత ఖజానాగా వాడుకుంటున్నారని ఆరోపించారు.

చంద్రబాబునాయుడు రియల్ టైమ్ గవర్నెన్స్ వల్ల సీఎం చంద్రబాబు, ఆయన కొడుకు లోకేష్ గ్రామాల్లో ఏమి జరుగుతుందో చూస్తారు గానీ, అవినీతి ఎలా జరుగుతుందో చూడలేరా అని ఎద్దేవా చేశారు. జగ్గంపేట నియోజకవర్గంలో నీరు చెట్టులో రూ.9 కోట్ల అవినీతి జరిగిందని, మట్టిని దోచుకుంటున్నారన్నారు. ‘బాగా తినమరిగిన కోడి ఇల్లెక్కి కూసినట్లు’ టీడీపీ అవినీతి తిని కూస్తోందని మండిపడ్డారు.

వంతాడ మైనింగ్ సంస్థ ఆండ్రూస్ ఉద్దేశించి హెచ్చరిక జారీ చేశారు. ‘ఒరే ఆండ్రూస్ మాకు అడ్డంకులు కల్పిస్తే తాట తీస్తాం, మీ బోడి ప్రతాపం జనసేనపై చూపిస్తే కీళ్లు విరుస్తా..’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ప్రతిపక్ష నేతగా ఆండ్రూ సంస్థ అక్రమాలను కూడా ప్రశ్నించలేకపోయారని విమర్శించారు.

టీడీపీ పవన్‌ను కరివేపాకు మాదిరి వినియోగించుకుని తీసేశారని, నా సహనాన్ని పరీక్షిస్తే విశ్వరూపం చూపిస్తానని హెచ్చరించారు. ధర్మో రక్షిత రక్షితహ అంటూ కాంగ్రెస్ పార్టీపై కోపం పద్నాలుగేళ్ళ పాటు పోదని, ఈ పద్నాలుగేళ్ళు ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిందేనని, అపుడు ఆలోచిస్తారని చెప్పుకొచ్చారు. అటువంటి పార్టీతో టీడీపీ కలవడం దారిన పోయే తద్దినాన్ని ఢిల్లీ వెళ్ళి నెత్తినెత్తుకోవడమేనని ఎద్దేవా చేసారు.