అటల్ బిహారీ వాజపేయి ఇకలేరు

భారతరత్న, భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక అగ్రనేత, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి(93) గురువారం సాయంత్రం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వాజపేయి ఆరోగ్యం.. బుధవారం మరింత క్షీణించింది. ఇవాళ సాయంత్రం 5.05 నిమిషాల‌కు వాజ్‌పేయి క‌న్నుమూసిన‌ట్లు ఎయిమ్స్ వైద్యులు ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. జూన్ 11న ఆయ‌న్ను ఎయిమ్స్‌లో చేర్పించార‌ని, గ‌త 9 వారాలుగా ఆయ‌న ఆరోగ్యం నిల‌క‌డ‌గానే ఉంద‌ని, అయితే గ‌త 36 గంట‌ల్లో ఆయ‌న ఆరోగ్యం బాగా క్షీణించింద‌ని డాక్ట‌ర్లు తెలిపారు.

 

మూత్రపిండాలు, మూత్రనాళానికి సంబంధించిన ఇన్‌ఫెక్షన్‌తో జూన్ 11న వాజపేయిని ఢిల్లీ ఎయిమ్స్‌లో చేర్పించారు. నాటి నుంచి ఆయనకు చికిత్స అందిస్తున్నారు వైద్యులు. ఆయన ఆరోగ్యం నిన్న తీవ్రంగా విషమించడంతో వెంటిలేటర్‌పై చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఇవాళ సాయంత్రం వాజపేయి తుదిశ్వాస విడిచినట్లు ఎయిమ్స్ వైద్యులు వెల్లడించారు. వాజపేయి మృతిపట్ల రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, ఆయా రాష్ర్టాల ముఖ్యమంత్రులు, ఆయా పార్టీల నేతలు సంతాపం ప్రకటించారు.

2009లో మాజీ ప్రధాని వాజపేయి స్ట్రోక్‌కు గురయ్యారు. నాటి నుంచి ఆయన జ్ఞాపకశక్తిని కోల్పోయారు. అప్పట్నుంచి వాజపేయి.. ప్రజాజీవితానికి దూరంగా ఉంటున్నారు. ఇంటికే పరిమితమయ్యారు. బ్రహ్మచారి అయిన వాజపేయి.. పది సార్లు లోక్‌సభకు ఎన్నిక కాగా, రెండుసార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. మూడుసార్లు ప్రధాన మంత్రిగా పని చేశారు. వాజపేయికి 2014లో భారతరత్న అవార్డు వరించింది. 2014, డిసెంబర్ 25న మోదీ ప్రభుత్వం.. వాజపేయికి భారతరత్నను ప్రకటించింది.