సీట్ల సర్దుబాటుపై మహాకూటమిలో లుకలుకలు

ఎన్నికల షెడ్యుల్ ప్రకటించే సమయం దగ్గర పడుతున్నా మహాకుటమిలో సీట్ల సర్దుబాటు ఒక కొలిక్కి రావడం లేదు. ఈ విషయమై కాంగ్రెస్ పెద్దన్న పాత్ర వహిస్తున్నట్లు మిత్ర పక్షాలు వాపోతున్నాయి. ముందు తమ సీట్ల విషయం తెలుపకుండా తమ అభ్యర్ధుల ఎంపికలో మునిగిపోయినదని కాంగ్రెస్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తమకు మొక్కుబడిగా మాత్రమె సీట్లు ఇస్తామంటూ మీడియాలో లీక్ లు ఇవ్వడం తప్ప నిర్దుష్టంగా తమతో చర్చలు జరపడం లేదని నిరసన వ్యక్తం చేస్తున్నారు.

ఢిల్లీ వెళ్లి వచ్చిన టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరామ్‌ ఇక్కడ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో చర్చలు జరిపినా కేటాయించే సీట్ల విషయమై ఒక నిర్ధారణకు రాలేక పోతున్నారు. కాంగ్రెస్ అనుసరిస్తున్న ఏకపక్ష వైఖరిని మిగిలిన పక్షాలు సమావేశం ఏర్పాటు చేసుకొని ప్రశ్నిస్తున్నాయి. సోమవారం కూటమి సమావేశం జరిగితే ఒక కొలిక్కి రావచ్చని భావిస్తున్నారు. ముందుగా తమ సీట్ల విషయం తేల్చకుండా ఎన్ని సమావేశాలు జరిపినా ప్రయోజనం ఉండబోదని మూడు పక్షాలు కాంగ్రెస్ కు స్పష్టం చేసారు.

సీట్ల విషయం తేలక పోవడంతో ప్రచారం విషయంలో ముందుకు వెళ్ళలేక పోతున్నామని కోదండరామ్‌ నేరుగా రాహుల్ గాంధీకే ఫిర్యాదు చేసారు. సాధ్యమైనంత త్వరగా సీట్ల కేటాయింపులు పూర్తి చేయాలని ఉత్తమ్‌కుమార్‌ రెడ్డిని రాహుల్‌ ఆదేశించినా ఇంకా కొలిక్కి రాకపోవడం వారికి చికాకు కలిగిస్తున్నది. మొత్తం సీట్లకు పోటీ చేస్తాం అంటూ చెబుతూ వచ్చిన కోదండరామ్‌ అకస్మాత్తుగా కాంగ్రెస్ తో కలిసి ఇప్పుడు ఐదారు సీట్ల కోసం పట్టుబడుతూ ఉండటం వల్లన జనంలో పలచబడి పోతున్నట్లు ఆయన మద్దతు దారులు భావిస్తున్నారు.

తమ పార్టీకి 15 సీట్లు కేటాయించాలని పట్టుబడుతున్న ఆయన ఇప్పుడు ఇస్తాం అన్న ఎనిమిది సీట్లు తోడుగా మరో రెండు, మూడు అయినా ఇవ్వమని కోరుతున్నట్లు తెలుస్తున్నది. అయితే కాంగ్రెస్ కు బలమైన సీట్లనే కొరుతూ ఉండటం, ఎక్కడా టిజేఎస్ కు బలమైన స్థానిక నాయకత్వం లేక పోవడంతో సీట్ ఇచ్చినా మొత్తం ఎన్నిక పక్రియను తామే చేపట్టవలసి ఉంటుందని కాంగ్రెస్ నేతలు వాపోతున్నారు. చివరకు ఆర్ధిక వనరులు కూడా సమకూర్చ వలసి వస్తుందని భావిస్తున్నారు.

మరో వంక సిపిఐ అల్టిమేటం ఇచ్చింది. తమకు ఐదు సీట్లు ఇవ్వని పక్షంలో తమ దారి తాము చూసుకుంటామని, అందుకోసం `బి’ ప్లాన్ కుడా సిద్దం చేసుకొంతున్నామని ప్రకటించింది. సోమవారం సాయంత్రం లోగా తమ సీట్ల విషయం తేల్చమని చెప్పడంతో పాటు తమకు కావలసిన సీట్లను కుడా ప్రకటించింది. తమ పార్టీకి రెండు మూడు స్థానాలంటూ కాంగ్రెస్‌ నేతలు ఇస్తున్న లీక్‌లపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్లాన్ బి కింద తామే 24 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తామని సీపీఐ సహ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి స్పష్టం చేశారు.

టీడీపీకి 14 సీట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటించినా ఈ విషయమై ఇంకా ఒక నిర్ధారణకు వచ్చిన్నట్లు కనిపించడం లేదు. ముఖ్యంగా టిడిపి కోరుకొంటున్న పలు సీట్లను కాంగ్రెస్ నాయకులు సహితం కోరుకొంటూ ఉండడంతో వివాదాలు చెలరేగుతున్నాయి. ముందుగా తాము కోరుతున్న కీలక స్థానాలపై స్పష్టత రావాల్సి ఉందని టిడిపి రాష్ట్ర అద్యక్షుడు ఎల్ రమణ స్పష్టం చేస్తున్నారు. కనీసం మరో రెండు సీట్ల కోసం పట్టుబడుతున్నారు. చివరకు రెండు, మూడు సీట్ల కోసం కాంగ్రెస్ పై వత్తిడి తేవలసిన నిస్సహాయ స్థితిలో మిత్ర పక్షాలు కనిపిస్తున్నాయి.