కేసీఆర్ పాలనకు.. చరమగీతం పాడండి

కేసీఆర్ నియంత పాలనకు చరమగీతం పాడాలని కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ పిలుపునిచ్చారు. అంబర్‌పేటలో బీజేపీ నిర్వహించిన సదస్సులో ఆమె మాట్లాడుతూ ప్రజాస్వామ్యం అంటున్న కేసీఆర్ కుటుంబ పాలనకు తెరలేపారని, లక్ష ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఇవ్వకుండా నిరుద్యోగులను మోసం చేశారని ఆరోపించారు. పేదల ఆరోగ్యం కోసం మోడీ ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ కార్యక్రమం చేపడితే తెలంగాణలో అమలు చెయక పోవడం బాధాకరమని చెప్పారు.

కేవలం మోడీకి పేరు వస్తుందన్న భయంతో కేసీఆర్ ఈ పధకాన్ని అమలు చేయలేదని ఆమె ద్వజమెత్తారు. ఆయుష్మాన్ భారత్ ద్వారా పేదలకు రూ.5 లక్షల బీమా అందకుండా పోయిందని విచారం వ్యక్తం చేసారు. ఈవిధంగా కేంద్రం చేపట్టిన అనేక పథకాలను కేసీఆర్ అమలు చేయలేదని ఆరోపించారు.

కేసీఆర్ సర్కారు తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించక పోవడంపై ఆమె మండిపడ్డారు. ఒక పార్టీకి భయపడి నిర్వహించడం లేదని అంటూ పోలింగ్ జరిగే డిసెంబర్ 7ను విమోచన దినంగా భావించి బీజేపీకి ఓటు వేయడం ద్వారా కేసీఆర్ కుటుంబ సర్కారును సాగనంపాలని స్మృతీ ఇరానీ పిలుపునిచ్చారు. నియంతగా వ్యవహరిస్తున్న ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఓడించేందుకు బీజేపీ కార్యకర్తలంతా కృషి చేయాలని ఆమె కోరారు.  

రాష్ట్ర కేబినెట్ లో మహిళలకు అవకాశం కల్పించని కేసీఆర్‌కు వారే బుద్ధి చెప్పాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ పిలుపునిచ్చారు. కేసీఆర్‌కు నిజమైన ప్రత్యామ్నాయంగా ప్రజలు బీజేపీని గుర్తించారని తెలిపారు. కేసీఆర్ నుంచి తెలంగాణను కాపాడడానికి బీజేపీకి ఓటు వేయాలని ఆయన కోరారు.