కెసిఆర్ కుటుంభంలో ప్రకంపనాలు సృష్టిస్తున్న వంటేరు !

గజ్వేల్ లో ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు పై మరోసారి పోటీకి తలబడుతున్న కాంగ్రెస్ నేత వంటేరు  ప్రతాప్‌రెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలు తెలంగాణలోని అధికార పక్షంలో ప్రకంపనాలు సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా పార్టీ, ప్రభుత్వంపై మొత్తం ఆధిపత్యం సంపాదించు కొంటున్న కెసిఆర్ కుటుంభంలోనే కలకలం రేపుతున్నది. పార్టీ పెట్టినప్పటి నుండి కెసిఆర్ కు చేదోడుగా ఉంటూ, పార్టీ నిర్మాణంలో కీలక పాత్ర వహించిన మేనల్లుడు హరీష్ రావు ప్రాబల్యం పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకొనే సరికి తగ్గటం ప్రారంభమైనది.

అంత ముందు పార్టీలో ఏ సమస్య తలెత్తినా, కీలక నిర్ణయం ఏది తీసుకోవాలన్న కెసిఆర్ వెంట ఉండే హరీష్ రావు ఇప్పుడు కనబడటం లేదు. ఎప్పుడైతే కెసిఆర్ కుమారుడు కేటి రామారావు తండ్రితో పాటు మంత్రివర్గంలో చేరారో అప్పటి నుండే కాబోయే ముఖ్యమంత్రిగా ప్రచారం ప్రారంభం కావడంతో హరీష్ రావుకు ప్రాధాన్యత తగ్గుతూ వస్తున్నది. మరోవంక కెసిఆర్ కుమార్తె కవిత కూడా లోక్ సభ సభ్యురాలిగా పార్టీలో కీలక అధికార కేంద్రంగా మారడంతో హరీష్ రావు తన శాఖకు పరిమితం కావలసి వస్తున్నది. ఉప ఎన్నికలలో గాని, కీలక మైన రాజకీయ నిర్ణయాలు తీసుకొనే సమయంలో గాని హరీష్ రావు కనబడటం లేదు.

చివరకు అసెంబ్లీ రద్దు నిర్ణయంలో కూడా ఆయన పాత్ర కనిపించనే లేదు. `ప్రగతి నివేదన’ సదస్సు అంతా కేటిఆర్ సారధ్యంలోనే జరిగింది. అయితే ఆ సదస్సు ఆశించిన రీతిగా విజయం సాధించలేక పోవడంతో ప్రమాదం అంచున ప్రయాణం చేస్తున్నామని తెలుసుకున్న కెసిఆర్ మేనల్లుడును తిరిగి దగ్గరకు తీయడం ప్రారంభించారు. ప్రతిపక్షాలు సిద్దంగా లేని సమయం చూసి ఎన్నికలకు సై అంటూ ముందస్తు ఎన్నికలకు సిద్దమైన కెసిఆర్ ఇప్పుడు తన నియోజక వర్గంలోనే గెలుపు పట్ల సందేహించ వలసిన పరిస్థితి ఏర్పడటంలో అధికార పక్షంలో కొంత అలజడి ప్రారంభమైనది.

అటువంటి సమయంలో ఎలాగైనా తన మామ, సీఎం కేసీఆర్‌ను గజ్వేల్‌లో ఓడించాలని హరీశ్‌ తనను కోరినట్లు ప్రతాప్‌రెడ్డి ఒక సభలో వెల్లడించడం తీవ్ర సంచలనానికి దారితీస్తున్నది. గజ్వేల్ లో పలువురు ప్రముఖులు పార్టీకి రాజీనామా చేసి, కాంగ్రెస్ పార్టీలో చేరుతూ ఉంటె, ఆ నియోజక వర్గంపై మొదటి నుండి పట్టు పెంచుకొంటున్న హరీష్ రావు ను సంప్రదించకుండా వారిని కట్టడి చేసే ప్రయత్నం కేటిఆర్ చేసారు. అయితే అవి ఫలించక పోవడంతో తిరిగి హరీష్ రావు సాయం కోరడం, ఆయన వారిని సముదాయించి కాంగ్రెస్ లో చేరకుండా చేయడం జరిగింది. అయితే ఆ తర్వాత కుడా పార్టీలో పరిస్థితులు పెద్దగా మారక పోవడంతో హరీష్ రావు అసంతృప్తిగా ఉన్నారనే కధనాలు వెలువడుతున్నాయి.

ఇటువంటి సమయంలో త్వరలో జరగబోయే ఎన్నికల్లో కేసీఆర్‌ను ఓడించాలని, అవసరమైన ఆర్థియ సాయం అందిస్తానని ఆయన తనతో అన్నట్టు ప్రతాప్‌రెడ్డి పేర్కొనడం సహజంగానే కెసిఆర్ కుటుంభంలో బాంబు ప్రేల్చిన్నట్లు అయింది. అన్ని బాధ్యతలను కేటీఆర్‌కే అప్పగిస్తూ కేసీఆర్‌ తన ఇజ్జత్ తీస్తున్నారని, ఆయన వైఖరితో రాజకీయ జీవితం లేకుండా పోతోందని హరీశ్‌ చెప్పినట్లు ప్రతాప్‌ రెడ్డి చెప్పడంలో నిజం ఏమాత్రం ఉన్నప్పటికీ అధికార పక్షంలో పరిస్థితులను గమనిస్తున్న వారికి యదార్ధమే అని స్పష్టం అవుతుంది.

సహజంగానే ఈ సంచలన ఆరోపణలను హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. ఓడిపోతానన్న నిస్పృహతో ప్రతాప్‌రెడ్డి అలా మాట్లాడుతున్నారని, ఆయన మానసిక స్థితి సరిగా లేదని మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌ లోనే కొనసాగుతానని స్పష్టం చేసారు. తనపై చేసిన ఆరోపణలకు వంటేరు భేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు.

కెసిఆర్ ఓటమి చెందితే మొత్తం టీఆర్ఎస్ కుప్ప కూలిపోయే అవకాశం ఉంటుంది. అటువంటప్పుడు హరీష్ రావు రాజకీయ భవిష్యత్ కుడా ప్రశ్నార్ధకరం కాగలదు. కాంగ్రెస్, బిజెపి లలో చేరినా ఇక్కడున్నత ప్రాధాన్యత లభించే అవకాశం ఉండదు. కొందరు కాంగ్రెస్, బిజెపి నేతలతో హరీష్ రావు తరచూ సంప్రదింపులు జరుపుతున్నట్లు కధనాలు వెలువడుతున్నా అవన్నీ కెసిఆర్, కేటిఆర్ లకు హెచ్చరిక సందేశాలు పంపడం కోసకే పరిమితం కావచ్చని ఈ సందర్భంగా భావించ వలసి వస్తుంది.