ఏసు పాలన తేస్తామన్న ఉత్తమ్..మండిపడ్డ పరిపూర్ణానంద

తెలంగాణలో అధికారంలోకి వస్తామని, ఆ తర్వాత ఏసు పాలన సాగుతుందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ ప్రకటిండంపై బీజేపీ నాయకుడు పరిపూర్ణానంద మండిపడ్డారు. మీరు ఏసు పాలన ఇస్తే, మేం మతం మార్చుకోవాలా? అని నిలదీశారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని విస్మరించడంతో పాటు నిజామే తెలంగాణకు చరిత్ర అంటూ టీఆర్‌ఎస్‌ అధినేత చెప్పడం దారుణమని ద్వజమెత్తారు.

వరంగల్‌లో ఒక మతోన్మాది.. వృద్ధ పూజారిని విచక్షణా రహితంగా కొడితే, నిందితుడి మానసిక స్థితి బాగోలేదని పోలీసులు చెప్పడం విడ్డూరంగా ఉందని చెప్పారని దయ్యబట్టారు. మెజారిటీలుగా ఉన్న హిందువులు కూడా తమ రక్షణ కోసం చట్టాలు చేయాలన్న దుస్థితిని పాలకులు తెచ్చారని ఆరోపించారు. కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాలు రజాకార్ల విధానాలను రుద్దాయని ఆగ్రహం వ్యక్తం చేసారు. ముస్లిం మైనారిటీలకు 12శాతం రిజర్వేషన్‌లు కల్పిస్తామని హామీ ఇచ్చిన టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నాయకులు.. బీసీల పొట్టగొట్టకుండా అది అమలు చేస్తామని గుండెలమీద చెయ్యి వేసుకుని చెప్పాలని డిమాండ్‌ చేశారు.

 

‘నేను సీఎంనే. సీఎం అంటే కామన్‌ మ్యాన్‌ ఆఫ్‌ ది స్టేట్‌’అని బీజేపీ నేత, స్వామి పరిపూర్ణానంద పేర్కొన్నారు. తాను బీజేపీ సీఎం అభ్యర్థి అంటూ జరుగుతున్న ప్రచారంపై పైవిధంగా స్పందించారు. రాష్ట్రంలో ఎంఐఎంతో కలసి పనిచేస్తున్న టీఆర్‌ఎస్‌ కూటమి ఒకటైతే, టీడీపీతో కలసిన కాంగ్రెస్‌ కూటమి రెండోవైపు ఎన్నికల్లో ఉన్నాయని చెబుతూ వరంగల్‌లోని ఒక ఆలయంలో పూజలో ఉన్న పూజారిని పట్టపగలే చంపేసినా ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్న ఈ రెండు కూటములు పట్టించుకోలేదని పరిపూర్ణానంద ఆరోపించారు. పూజారిని కాపాడటంలో ప్రభుత్వం విఫలమైందని దుయ్యబట్టారు.

హిందువుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. దారుస్సలేం ఆజ్ఞల ప్రకారం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇంతకాలం నడిచిందని ఆరోపించిన పరిపూర్ణానంద లాల్‌దర్వాజ ఆకాంక్షల మేరకు ప్రభుత్వం పనిచేయాలని స్పష్టం చేసారు.  హిందువులను కాపాడుకోవడానికే తాను బీజేపీలో చేరానన్నారు. తనపై నిఘా కోసం ప్రభుత్వం 500 మంది పోలీసులు, 30 పెట్రోలింగ్‌ వాహనాలను పెట్టిందని, తన ఫోన్‌ ట్యాపింగ్‌ అవుతున్నదనే అనుమానం ఉందని పరిపూర్ణానంద పేర్కొ న్నారు. రాష్ట్రంలో బీజేపీ ఒక్కటే ప్రత్యామ్నాయమని తెలిపారు.

‘‘అణచివేత, అక్రమాలు, దౌర్జన్యాలు, దోపిడీలు, మానభంగాలు, సంస్కృతిని నాశనం చేయడం, దేవాలయాలపై దాడులు చేయించడం వంటి సంఘటనలకు నిజాం పాల్పడ్డారని చదువుకున్నా. కానీ, ఇప్పుడు వాటన్నింటినీ ఎనిమిదో నిజాం నేరుగా చూపిస్తున్నారు’’ అని పరిపూర్ణానంద ఆరోపించారు. ఎనిమిదో నిజాం ఎవరని అడగ్గా.. ఎవరైతే నిజామే తెలంగాణకు చరిత్ర అని అసెంబ్లీ వేదికగా స్పష్టం చేశారో, ఆయనే అయ్యుండాలని అని బదులిచ్చారు.

రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ కుటుంబ పాలనను తరిమికొట్టాలని పరిపూర్ణానంద ప్రజలకు పిలుపునిచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్‌ నారాయణపురంలో ఆయన మునుగోడు నియోజకవర్గ బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. టీఆర్‌ఎస్‌ పార్టీ కారులో ప్రయాణిస్తుందని, అందులో కేవలం ఐదుగురికే స్థానం ఉందని ఎద్దేవా చేశారు.