ప్రతిపక్ష నేతలు అబద్దపు యంత్రాలు : మోదీ

కొంతమంది ప్రతిపక్ష నేతలు అబద్దపు యంత్రాలని, ఏకే-47లాగా అసత్యపు తూటాలు పేల్చగలరని ప్రధాని నరేంద్రమోదీ ఎద్దేవా చేశారు. దేశగతిని మార్చేందుకు బీజేపీ పనిచేస్తుంటే విపక్ష పార్టీలు తమ వారసత్వ అధికారం కోసమే చేతులు కలుపుతున్నాయని దయ్యబట్టారు.

‘‘ఏకే-47 పేల్చినపుడు బుల్లెట్లు శరపరంపరగా బయటకొస్తాయి. అదే రీతిన అబద్ధాలను పేలుస్తున్నారు. విపక్షాలు కావవి..అబద్ధాలు వెళ్లగక్కే యంత్రాలు’’ అని ప్రధాని విరుచుకుపడ్డారు. ‘‘రోజుకి పదిరకాల గణాంకాలిస్తారు. ఏంటేంటో మాట్లాడతారు. అందుకే ప్రజలు వారిని నమ్మరు’’అని మోదీ- రాఫెల్‌పై రాహుల్‌ దాడిని పరోక్షంగా ప్రస్తావిస్తూ వ్యాఖ్యలు చేశారు.

ప్రధాని మోదీ శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఐదు లోక్‌సభ స్థానాల పరిధిలోని బీజేపీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడుతూ విపక్షాలను ప్రజలు నమ్మబోరని భరోసా వ్యక్తం చేసారు. దేశం కోసం చేసిన మంచి పనులను గుర్తించకపోగా, సైన్యాన్ని అవమానిస్తూ దుర్భాషలాడుతున్నారని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ పేరెత్తకుండానే ప్రధాని మోదీ ధ్వజమెత్తారు.

ఇటీవల రాఫెల్ ఒప్పందం ఒక కుంభకోణం అని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పదేపదే ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. తాను భారతీయ విలువల పరిరక్షణకు చర్యలు తీసుకున్నప్పుడల్లా కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీ వంటి జాతి వ్యతిరేకులు ఒక్కటవుతున్నారని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.

కేవలం తమ కుమారులకు అధికారం కట్టబెట్టడం కోసమే కొన్ని విపక్షాలు (జాతీయస్థాయిలో) ఒక్కటవుతున్నాయి తప్ప సిద్ధాంతపరమైన సారూప్యతతో కాదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేసారు. ‘‘ఆ పార్టీలకు, నేతలకు అనువంశిక పాలనే ముఖ్యం. దేశ గతిని మార్చడం మన లక్ష్యం. వారికీ మనకీ ఎంత తేడా? కేవలం కొడుకులకు (అధికారాన్ని) మిగిల్చేందుకు వారు బీజేపీ-వ్యతిరేకత పేరుతో కూటమి కడుతున్నారు. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచీ ఈ వంశాలు పాలనా పగ్గాల్ని తమచేతుల్లోనే అట్టిపెట్టుకున్నాయని గుర్తు చేసారు.

“బీజేపీ గనక మరో ఐదు-పదేళ్లు అధికారంలో ఉంటే తమ గతేం కాను..? అన్నది ఈ 200 నుంచి 500 దాకా ఉన్న వంశాల భయం. అందుకే తమ పిల్లలు, బంధువుల కోసం, వంశపాలన కొనసాగేందుకు ఇలా కూటమి ఏర్పరుస్తున్నారు’’ అని ఆయన ఘాటుగా విమర్శించారు. మోదీని ఓడించడమే ఏకైక లక్ష్యంగా చంద్రబాబు, రాహుల్‌ చేతులు కలపడం, 15 పార్టీలతో జాతీయ ఫ్రంట్‌ ఏర్పరచనున్నట్లు ప్రకటించడంతో మోదీ ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం.

అనువంశిక పాలన పేరుతో రాహుల్‌, చంద్రబాబులిద్దరినీ ఆయన లక్షంగా చేసుకొంటూ  ‘‘ఈ విపక్ష కూటముల గురించి ఆందోళన వద్దు.. వాటిని పట్టించుకోకండి. ప్రతిపక్షాలకు ప్రజామోదం లేదు.. సరికదా, ప్రజలు ద్వేషిస్తున్నారు. మంచి పనులు చేస్తుంటే మెచ్చాల్సింది పోయి నెగిటివ్‌ ప్రచారం చేస్తున్నారు. దేశ సైన్యాన్ని సైతం విమర్శిస్తున్నారు, అవమానిస్తున్నారు’’అని మోదీ మండిపడ్డారు.

బీజేపీ కార్యకర్తలు ప్రజలకు వాస్తవాలు వివరించి విపక్షాల ముసుగులను బయటపెట్టాలని పిలుపునిచ్చారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సులభతర వాణిజ్యంలో భారత్ ర్యాంక్ 142 నుంచి 77వ ర్యాంక్‌కు ఎగబాకిందని గుర్తు చేశారు.