వాజపేయి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమం

భారత మాజీ ప్రధాని అటల్ బిహారి వాజపేయి (93) ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమం ఉంది. ప్రస్తుతం  వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితిపై బీజేపీ శ్రేణుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఆయనను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వరుసగా రెండో సారి వచ్చి  మరోసారి పరామర్శించారు. దాదాపు గంటసేపు గడిపారు. మరోవైపు బీజేపీ అగ్రనేతలు కూడా పెద్ద ఎత్తున ఎయిమ్స్‌ తరలి వస్తున్నారు.

వాజ్‌పేయి ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా గురువారం సాయంత్రం మీడియాకు తెలిపారు. అంతకుముందు వాజ్‌పేయిని పరామర్శించిన కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ కూడా వాజ్‌పేయి ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన పరిస్థితి అత్యంత విషమంగా ఉందని రాజ్‌నాథ్‌ మీడియాకు తెలిపారు. ఇక, మరికాసేపట్లో ఎయిమ్స్‌ వైద్యులు హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేయనున్నారు.

 కాసేపట్లో హెల్త్‌ బులిటెన్‌ వెలువడనున్న నేపథ్యంలో వాజ్‌పేయి నివాసానికి మోదీ, అమిత్‌ షా, కేంద్రమంత్రులు చేరుకున్నారు. ఇక్కడ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున వాజ్‌పేయి నివాసానికి చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పరిసర ప్రాంతాల్లో ట్రాపిక్‌ ఆంక్షలు విధించారు.  బీజేపీ పాలిత ముఖ్యమంత్రులందరూ ఢిల్లీకి రావాలని అధిష్టానం ఆదేశించింది.

ఎయిమ్స్‌కు చేరుకున్న వారిలో  కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధ్యక్షుడు ఫరుఖ్‌ అబ్దుల్లా,ఢిల్లీ సీఎం అరవింద్‌ క్రేజీవాల్‌లు కుడా ఉన్నారు.