హిందువులపై వివక్షత చూపుతూ 8వ నిజాంగా కెసిఆర్

ఆపధర్మ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు హిందువులపై వివక్ష చూపుతూ, 8వ నిజాంగా ప్రవర్తిస్తున్నారని బీజేపీ జాతీయ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి ఆరోపించారు. గత నెల 26న వరంగల్ లో భక్తి పాటలు పెట్టారన్న కోపంతో పూజారి సత్యనారాయణపై మసీదులోని ఇమామ్ దాడి చేసి తీవ్రంగా గాయపరిచగా, మంచి చికిత్స అందక పోవడం వల్ల ఆయన మృతి చెందారని చెబుతూ ఇది వివక్ష కాదా? అని ప్రశ్నించారు. ఇదే రకమైన దాడి ఏ ఇమామ్‌కో, చర్చి ఫాదర్‌కో జరిగితే.. ఈ ప్రభుత్వం ఊరుకునేదా? అని ప్రశ్నించారు. 

కేసీఆర్ వైఫల్య పాలనలో రాష్ట్రంలో మత సామరస్యం పూర్తిగా దెబ్బతిన్నదని మండిపడ్డారు. పూజారిపై జరిగిన దాడి విషయంలో  ఆపధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు.

టీఆర్‌ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలన్నీ ఒకటే అని ద్వజమెత్తుతూ కేసీఆర్ నిజామ్ మాదిరిగా వ్యవహరిస్తుంటే, కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి మాత్రం తాను క్రైస్తవ రాజ్యం స్థాపిస్తానని సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని విరుచుకు పడ్డారు.  ఆయనకు హిందువులందరూ బానిసలుగా కన్పిస్తున్నారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోమ్ లో ఉన్న వారి ప్రశంసలు పొందాలని ఈ విధంగా మాట్లాడతున్నారా? అని ప్రశ్నించారు. అధికారం కోసం ఇంత నీచానికి దిగుతారా? అని నిలదీశారు.

దళిత క్రిష్టియన్లకు ఎస్సీ హోదా ఇస్తానంటూ ప్రకటించడంపై ఆయన మండిపడ్డారు. ఇది రాజ్యాంగానికి వ్యతిరేకమన్న సంగతి తెలియదా? అని ప్రశ్నించారు. కేసీఆర్, ఉత్తమ్ ఆ రెండు మతాలకు చెందినవారి దయ కోసం తాపత్రాయపడుతున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ అధికారం లోకి వస్తేనే రాష్ట్రంలో సమాన న్యాయం, సమగ్ర పరిపాలన సాగుతుందని స్పష్టం చేసారు.

గవర్నర్ కూడా హిందూ సంస్థల ప్రతినిధులను కలువకుండా గేటు బయట నుంచే పంపించడం పట్ల నిరసన వ్యక్తం చేసారు. ఎవరెవరినో కలిసే ఆయన హిందూ సంస్థల ప్రతినిధులకు మాత్రం అపాయింట్మెంట్ ఎందుకని ఇవ్వడం లేదని ప్రశ్నించారు.