కర్ణాటక కాంగ్రెస్‌ అభ్యర్థి ఉగ్రప్పకు ఎదురుదెబ్బ

కర్ణాటక రాష్ట్రం బళ్లారి లోక్‌సభ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్న వి.ఎస్‌.ఉగ్రప్ప చరాస్తులను స్వాధీనపరచుకోవాలని దొడ్డబళ్లాపురలోని నాలుగో అదనపు జిల్లా న్యాయస్థానం ఆదేశాలను జారీ చేసింది. బెంగళూరుకు సమీపాన దొడ్డబళ్లాపుర వద్ద 2010లో జరిగిన రోడ్డు ప్రమాదంలో పరిహారాన్ని కోరుతూ ఉగ్రప్పపై 2012లో బాలాజీ కేసు పెట్టాడు. ప్రమాదంలో గాయపడిన బాలాజీకి రూ.67 వేల పరిహారాన్ని చెల్లించాలంటూ 2017 అక్టోబరు 31న న్యాయమూర్తి ఆదేశించారు.

తీర్పు వెలువడి ఏడాది గడచినా పరిహారం ఇవ్వలేదని బాధితుడు మరోమారు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. పరిహారం రూ.67 వేలు, దానిపై వడ్డీ రూ.27 వేలను కలిపి మొత్తం రూ.94వేల మొత్తానికి సరితూగేలా ఉగ్రప్ప చరాస్తులను పదిరోజుల్లోగా స్వాధీనపరచుకుని, న్యాయస్థానానికి అప్పగించాలని పోలీసులకు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. అప్పట్లో ఉగ్రప్ప ప్రయాణిస్తున్న కారు బాలాజీ వెళుతున్న ద్విచక్రవాహనాన్ని వెనుక నుంచి ఢీకొన్నట్లు కేసు నమోదు అయింది.