ఎంఎస్‌ఎంఈలకు 59 నిమిషాల్లోనే కోటి రూపాయల రుణం

దేశంలో అత్యధికంగా ఉపాధిని కల్పిస్తున్న రెండో అతిపెద్ద రంగం ఎంఎస్‌ఎంఈకి ప్రధాని నరేంద్ర మోదీ వరాల జల్లు కురిపించారు. 59 నిమిషాల్లోనే కోటి రూపాయల వరకు రుణాలను మంజూరు చేయడం, కార్మిక చట్టాల సడలింపు, పర్యావరణ నిబంధలను సులభతరం చేయడం, కంపెనీ చట్టంలో ఎంఎస్‌ఎంఈలకు అనుకూలంగా మార్పులు తీసుకురావడంతో సహా అనేక చర్యలను ప్రధానమంత్రి ప్రకటించారు. ఎంఎస్‌ఎంఈ సపోర్ట్ ప్రోగ్రామ్‌ను శుక్రవారం నాడు ప్రధానమంత్రి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీఎస్టీతో రిజీష్టర్ చేసుకున్న ఎంఎస్‌ఎంఈలకు 59 నిమిషాల్లోనే కోటి రూపాయల రుణాన్ని మంజూరు చేయడంతో పాటు ఇంక్రిమెంటల్ రుణాలపై 2శాతం వడ్డీ రాయితీని కల్పిస్తున్నట్టు ప్రకటించారు. అలాగే ఎంఎస్‌ఎంఈలు చేసే ఎగుమతులపై రుణాలకు షిప్‌మెంట్లకు ఇస్తున్న వడ్డీ రాయితీని ప్రస్తుతం ఉన్న 3 శాతం నుంచి 5 శాతానికి పెంచుతున్నట్టు ప్రకటించారు. ఇన్‌స్పెక్టర్‌రాజ్ నుంచి ఈ రంగాన్ని కాపాడేందుకు నరేంద్రమోదీ మరికొన్ని మార్పులను ప్రవేశపెట్టారు. ఏ ఇన్‌స్పెక్టర్ ఎక్కడికైనా, ఎప్పుడైనా వెళ్లే సంప్రదాయానికి స్వస్తి పలికి కేవలం కంప్యూటరైజ్డ్ కేటాయింపుల ద్వారా మాత్రమే ఇన్‌స్పెక్టర్లు ఇక నుంచి తనిఖీలు నిర్వహించాల్సి ఉంటుంది.

పర్యావరణ అనుమతులకు సంబంధించి ఇక నుంచి కేవలం గాలి, నీరులకు ఒకే అనుమతి ఉంటే సరిపోతుంది. ఇక నుంచి ఎనిమిది కార్మిక చట్టాలు, 10 కేంద్ర నిబంధనలకు సంబంధించి సంవత్సరానికి ఒకే నివేదికను సమర్పిస్తే సరిపోతుందని ప్రధాని స్పష్టం చేసారు. కంపెనీల చట్టం ప్రకారం చిన్న చిన్న నేరాలకు జరిమానా విధింపులను సరళీకరించేందుకు ఆర్డినెన్స్‌ను జారీ చేయనున్నట్టు ఆయన ప్రకటించారు.

ఎంఎస్‌ఎంఈ పునరుద్ధరణకు ప్రకటించిన 12 చర్యలను చారిత్రకమైనవిగా ఆయన అభివర్ణించారు. దీంతో ఈ దీపావళి ఓత్సాహిక పారిశ్రామిక వేత్తలు, ఉద్యోగుల్లో మరిన్ని వెలుగులు నింపుతుందని ప్రధాని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలు 20 శాతం ప్రొక్యూర్‌మెంట్‌ను ఎంఎస్‌ఎంఈల నుంచే చేయాలని మహిళలు నిర్వహిస్తున్న సంస్థల నుంచి అదనంగా మరో 3 శాతం సేకరించాలని ఆయన ఆదేశించారు.

ఇదిలాఉండగా, టెక్నాలజీ అప్‌గ్రెడేషన్ కోసం 20 హబ్‌లు, 100 టూల్ రూమ్స్‌ల ఏర్పాటుకు రూ. 6,000 కోట్లను కేటాయిస్తున్నట్టు ప్రధాని ప్రకటించారు. ఫార్మా రంగంలో ఉత్పత్తిని పెంచేందుకు క్లస్టర్లను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. రూ. 500 కోట్ల టర్నోవర్‌ను కలిగివున్న అన్ని కంపెనీలు ట్రేడ్ రీసీవబుల్స్ ఈ- డిస్కౌంటింగ్ సిస్టమ్ ( టీఆర్‌ఈడీఎస్) ఫ్లాట్‌ఫామ్ పరిధిలో వస్తాయని, దీనివల్ల ఎంఎస్‌ఎంఈలకు నగదు కొరత ఉండదని ఆయన ప్రకటించారు.

సులభతర వాణిజ్యంతో 23 స్థానాలు ఎగబాకి 77 స్థానాన్ని దక్కించుకోవడాన్ని ఆయన ప్రస్తావిస్తూ, గత నాలుగేళ్ల తమ ప్రభుత్వం సాధించినదాన్ని చాలా మందికి నమ్మశక్యంగా లేదని చెప్పారు. 50వ ర్యాంకును సాధించడం మరెంతో దూరంలేదనీ ఆయన ధీమా వ్యక్తం చేసారు. సంస్కరణల ప్రక్రియ ఎంఎస్‌ఎంఈలకు ప్రయోజనం చేయగలదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

2019 నాటికి ఐదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఇండియా ఎదుగుతుందనీ, సమీప భవిష్యత్‌లోనే మూడో స్థానానికి చేరుకుంటుందని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ భరోసా వ్యక్తం చేసారు.  గత నాలుగేండ్లలో దేశ ఆర్థిక వ్యవస్థ 9వ స్థానం నుంచి ఫ్రాన్స్‌ను అధిగమించి 2017లోనే 6వ స్థానానికి ఎదిగిందని, ప్రపంచబ్యాంకు విశ్లేషణ్ ప్రకారం బ్రిటన్‌ను అధిగమించి ఐదో స్థానానికి వచ్చే ఏడాది చేరుకుంటుందని ఆయన చెప్పారు.

దీపావళి కానుకలంటూ ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన చర్యలు ఎంఎస్‌ఎంఈ రంగాని సులభంగా రుణాలు లభించడంతో పాటు ఈ రంగం ఎదుర్కొంటున్న అనేక ఇబ్బందులు దీర్ఘకాలంలో పరిష్కారం అవుతాయిన ఎంఎస్‌ఎంఈ నిపుణులు అభిప్రాయపడ్డారు. ప్రధాని ప్రకటించిన చర్యలు ఎంఎస్‌ఎంఈ రంగానికి కొత్త శక్తిని, ఉత్తేజాన్ని కల్పిస్తాయని అసోచామ్ సెక్రటరీ జనరల్ ఉదయ్ కుమార్ వర్మ అన్నారు. ఈ చర్యలు నిజంగానే దీపావళి కానుకలని ఆయన కొనియాడారు.