కకావికలమవుతున్న కేరళ ... 79 మంది మృతి

వరుణుడి ప్రతాపానికి కేరళ కకావికలమవుతోంది. ఇప్పటికే తీవ్రంగా నష్టపోయిన కేరళ వాసులను వాతావరణ శాఖ తాజా హెచ్చరిక మరింత కలవరపాటుకు గురిచేస్తోంది. మొత్తం రాష్ట్రంలో రెడ్ అలెర్ట్ ప్రకటించారు. ఈ రోజు మరు 12 మంది చనిపోవడంతో మృతుల సంఖ్య 79కు చేరుకొంది.  మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కేరళలో కురిసే అవకాశముందని వాతావరణ శాఖ ప్రకటించింది. వర్షాలు నిరంతరంగా కురుస్తుండటంతో సహాయక చర్యలకు కూడా తీవ్ర ఆటంకం కలుగుతోంది.

కేంద్ర హోంశాఖ కార్యదర్శి నేతఋత్వంలో ఉన్నతస్థాయి కమిటీ గురువారం సమావేశమైంది. కేరళలో వరద బీభత్సం, సహాయక చర్యలపై సమీక్షిస్తున్నారు. ముఖ్యమంత్రి పి విజయన్ మరోసారి ప్రధానమంత్రితో ఫోన్ లో మాట్లాడి కేంద్రం నుండి మరింతగా సమయం అవసరమని చెప్పారు.

 నదులు, వాగులువంకలు పొంగిపొర్లుతుండటంతో వరద ఉధృతి మరింత పెరిగింది. కొచ్చి విమానాశ్రయంలో వరద నీరు భారీగా చేరుకుంటుండటంతో మరికొన్ని రోజుల పాటు విమాన రాకపోకలను పూర్తిగా నిలిచిపోనున్నట్లు తెలిసింది. తిరువనంతపురానికి అదనంగా మరో 12 ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు చేరుకున్నాయి. ఇప్పటికే 18బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి. ఎర్నాకులం జిల్లాలో వరద ధాటికి ఇళ్లన్నీ మునిగిపోవడంతో సహాయక బృందాలు అక్కడి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి.

పెరియార్, చలక్కుడి నదుల నీటిమట్టం మరింత పెరిగింది. సమీప గ్రామ ప్రజలు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సిందిగా సీఎం పినరయి విజయన్ ట్వీట్ చేశారు. కొన్ని ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటంతో సమీప గ్రామాల ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. గురువారం పాలక్కడ్‌లో కొండచరియలు మీదపడటంతో ఐదుగురు సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. చాలా వరకు రోడ్డు మార్గాలు భారీ వరదలకు కొట్టుకుపోయాయి. అక్కడక్కడ భారీ చెట్లు కూలిపోవడంతో విద్యుత్ వ్యవస్థ కూడా దెబ్బతింది.