మోదీనే మళ్లీ ప్రధాని కావాలని కోరుకొంటున్న ప్రజలు

ప్రధాని నరేంద్ర మోదీనే మళ్లీ ప్రధాని కావాలని మెజార్టీ ప్రజలు కోరుకుంటున్నారని ఓ ఆన్‌లైన్‌ సర్వే వెల్లడించింది. రెండోసారి ఆయనకు ప్రధాని అయ్యే అవకాశం ఇస్తే భవిష్యత్తు బాగుంటుందని సర్వేలో పాల్గొన్న 50శాతం మందికి పైగా అభిప్రాయపడ్డారని తెలిపింది. దాదాపు 63శాతం మందికి పైగా నెటిజన్లు మోదీపై తమకు విశ్వాసం ఉందని వెల్లడించారని సర్వే పేర్కొంది.

ఈ ఆన్‌లైన్‌ సర్వేను న్యూస్‌ పోర్టల్‌ డైలీ హంట్‌, డేటా అనలిటిక్స్‌ కంపెనీ నీల్సన్‌ ఇండియా నిర్వహించాయి. ఈ సర్వేలో భాగంగా ఆన్‌లైన్‌లో 54లక్షల మంది అభిప్రాయాలు సేకరించారు. మన దేశంతో పాటు విదేశాల్లో ఉంటున్న వారు కూడా ఇందులో పాల్గొన్నారని సర్వే నిర్వహకులు ఓ ప్రకటనలో వెల్లడించారు.

2014 ఎన్నికల సమయంలో మోదీపై ఎంత నమ్మకం ఉందో ఇప్పుడు కూడా అంతే నమ్మకముందని, అంతకంటే ఎక్కువ నమ్మకముందని 63శాతం మంది అభిప్రాయపడినట్లు సర్వే తెలిపింది. గత నాలుగేళ్లలో ఆయన చూపిన నాయకత్వ సామర్థ్యం సంతృప్తినిచ్చినట్లు చెప్పారని వెల్లడించింది. 50శాతం మందికి పైగా మోదీ రెండో సారి ప్రధాని కావాలని కోరుకుంటున్నారని తెలిపింది.

ఐదు రాష్ట్రాల ఎన్నికల విషయంలో మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌లలో ప్రజలు మోదీపై నమ్మకముంచారని సర్వే తెలిపింది. తెలంగాణలో మాత్రం అలాంటి ధోరణి లేదని చెప్పింది. మిజోరం గురించి అసలు ఏమీ వెల్లడించలేదు.