తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వారంలో రెండో సారి ఢిల్లీ పర్యటనకు వెళ్లి, వివిధ ప్రతిపక్ష నాయకులతో భేటిలు జరుపుతూ, బీజేపీని ఓడించడం కోసం కాంగ్రెస్ నాయకతంలో ఒక కొత్త కూటమి ఏర్పాటు కోసం చేస్తున్న ప్రయత్నాలను బీజేపీ కొట్టి పారవేసింది. చంద్రబాబు ప్రయత్నాన్ని చాలా తేలికగా తీసుకొంటూ “రాజకీయ పర్యాటకుడు” వలే ఢిల్లీ యాత్ర జరుపుతున్నారని ఎద్దేవ చేసింది.
మరో కూటమి ఏర్పాటు కోసం చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు తమకు ఎటువంటి ఇబ్బంది కలిగించాబోవని బీజేపీ భరోసా వ్యక్తం చేసింది. “రాజకీయ పర్యటకుడిగా ఫోటో సెషన్ కోసం జరుపుతున్న పర్యటన” అని బీజేపీ అధికార ప్రతినిధి శాహ్నావజ్ హుస్సేన్ అభివర్ణించారు. `మహాఘతబంధన్’ ఏర్పాటు కోసం చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు ఆయన హైదరాబాద్ కు చేరుకొనే సారికి కుప్పకూలి పోతాయని చెప్పారు.
“నేడు కాంగ్రెస్ తో చేతులు కలపడం ద్వారా యన్ టి రామారావు వారసత్వాన్ని చంద్రబాబు ధ్వంసం చేసారు. ఎవ్వరి నుండైనా అండకోసం చూసే విధంగా రాహుల్ గాంధీ చాల బలహీనంగా ఉన్నారు” అని ఆయన పేర్కొన్నారు. 1980వ దశకం ప్రారంభంలో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో కాంగ్రెస్ ను తరిమి కొట్టడం కోసం టిడిపిని ఎన్టిఆర్ ప్రారంభించారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసారు.
నిప్పులు చెరిగిన కన్నా
కాగా, కాంగ్రెస్‌తో కలిసి చంద్రబాబు నాయుడు కూటమిని ఏర్పాటు చేయడంపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ నిప్పులు చెరిగారు. ‘‘తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో స్వర్గీయ ఎన్టీఆర్ గారిచే 1982లో తెలుగుదేశం పార్టీ స్థాపితమైందని.. కుటిల రాజకీయ ప్రయోజనాలతో చంద్రబాబు గారిచే 2018లో ఆ పార్టీ భూస్థాపితం అయ్యింది’’ అని ఆయన సోషల్ మీడియాలో వెల్లడించారు. తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో ఎన్టీఆర్ 1982లో స్థాపిస్తే... కుటిల రాజకీయ ప్రయోజనాలతో చంద్రబాబు 2018లో పార్టీని భూస్థాపితం చేశారని కన్నా విమర్శించారు. చంద్రబాబు కాంగ్రెస్‌తో చేతులు కలపడం చూసి ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుందని ఆక్షేపించారు. 1984లో చంద్రబాబును ఎందుకు పార్టీలో చేర్చుకున్నానా అని ఎన్టీఆర్ మదనపడుతూ ఉంటారని చెప్పారు.
కాంగ్రెస్‌తో టీడీపీ జతకట్టి ఎన్నికలకు వెళ్లడం తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడమే నని బీజీపీ తాజా మాజీ ఎమ్మెల్యే జి. కిషన్‌రెడ్డి ద్వజమెత్తారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పుట్టిన పార్టీ టీడీపీ అని ఆయన గుర్తు చేశారు. అధికారమే పరమావధిగా చంద్రబాబు రాజకీయలు చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీకి తెలుగువారి ఆత్మగౌరవాన్ని టీడీపీ తాకట్టు పెడుతుందని ఆరోపించారు.
రాష్ట్ర ప్రయోజనాలు, అభివృద్ధి చంద్రబాబుకు అవసరం లేదని, అధికారం కాపాడుకోవడం, కుర్చీని నిలుపుకోవడమే ఆయన లక్ష్యమని పేర్కొన్నారు. నందమూరి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు నారా వారి తెలుగుదేశం పార్టీగా మారిందని ఆక్షేపించారు. మహాకూటమి చంద్రబాబు కనుసన్నల్లోనే నడుస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ వ్యతిరేక శకులన్నీ ఈ విషయాన్ని గుర్తించాలని కిషన్‌రెడ్డి కోరారు.
మరోవైపు కాంగ్రెస్‌తో టీడీపీ కలవడంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు స్పందిస్తూ.. ‘‘ఈ మధ్య జరిగిన ఆదాయపు పన్ను దాడుల వలన బాబు గారిలో కలిగిన అభద్రత భావం పునాదిగా ఏర్పడిన పరస్పర వ్యతిరేక ధ్రువాల అవకాశవాద కలయిక. ఈ కలయిక దేశ ప్రయోజనాల కోసం అని ప్రజలకు భ్రమ కల్పించటం వారి చెవిలో పువ్వు పెట్టాలని చూడటమే అవుతుంది. ప్రజలు అంత అమాయకంగా లేరు’’ అంటూ వ్యాఖ్యానించారు.