వైఎస్సార్సీపీ ప్రభంజనం సృష్టించే అవకాశం

రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్‌ రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్సీపీ ప్రభంజనం సృష్టించే అవకాశాలు మరింత మెరుగయ్యాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే ఏపీలోని మొత్తం 25 సీట్లలో వైఎస్సార్సీపీ 20 స్థానాలు, అధికార టీడీపీ 5 స్థానాలు కైవసం చేసుకుంటాయని రిపబ్లిక్‌–సీ వోటర్‌ సర్వే తేల్చింది. తెలంగాణలో మొత్తం 17 స్థానాల్లో కాంగ్రెస్‌ నేతృత్వంలోని మహాకూటమి  8, టీఆర్‌ఎస్‌ 7, బీజేపీ 1, మజ్లిస్‌ 1 సీటు చొప్పున గెలుస్తాయని పేర్కొంది. డిసెంబర్‌లో జరగబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అంచనాలు భిన్నంగా ఉండొచ్చని తెలిపింది.

‘నేషనల్‌ అప్రూవల్‌ రేటింగ్స్‌’ పేరిట తాజా అంచనాల్ని గురువారం విడుదల చేసింది. కేంద్రంలో ఎన్డీయే కూటమి సాధారణ మెజారిటీకి చేరువగా వస్తుందని సర్వే తెలిపింది. కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ ప్రదర్శన మెరుగవుతుందని, ఆ కూటమి వంద సీట్లకు పైగా గెలుచుకుంటుందని తెలిపింది.

2014 లోక్‌సభ ఎన్నికల్లో 8 సీట్లు గెలుచుకున్న వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి పార్టీ వైఎస్సార్సీపీ ఈసారి ఆ సంఖ్యను 20కి పెంచుకుంటుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ క్రమంగా ప్రభవం కోల్పోతోంది. ఆ పార్టీ ఈసారి 5 సీట్లకే పరిమితమవుతుంది. ఓట్లశాతం పరంగా చూస్తే వైఎస్సార్సీపీకి 41.2 శాతం, టీడీపీకి 31.2 శాతం, బీజేపీకి 11.3 శాతం, కాంగ్రెస్‌కు 9.3 శాతం ఓట్లు దక్కుతాయి.

తెలంగాణలో సీఎం కె.చంద్రశేఖర రావు నాయకత్వంలోని టీఆర్‌ఎస్‌ 7 సీట్లు (30.40% ఓట్లు) , కాంగ్రెస్‌ నేతృత్వంలోని మహాకూటమి 8 సీట్లు(32.2%), బీజేపీ 1 సీటు(19%), ఏఐఎంఐఎం 1 స్థానం( 3.9%) గెలుచుకుంటాయి.