రాహుల్ గాంధీ తో చేతులు కలిపిన చంద్రబాబు

ఎన్డియే నుండి బైటకు వచ్చిన తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఏడు నెలల అనంతరం కాంగ్రెస్ అద్యక్షుడు రాహుల్ గాంధీ ఇంటికి వెళ్లి, ఆయనతో చేతులు కలిపి, బీజేపీకి వ్యతిరేకంగా కలసి పనిచేద్దామని సంసిద్దతను వ్యక్తం చేసారు. పైగా దేశంలోని మిగిలిన పార్టీలను సహితం ఒకటిగా కాంగ్రెస్ కు అండగా ఉండేటట్లు చేస్తానని భరోసా కుడా ఇచ్చి వచ్చారు.

కాంగ్రెస్‌ వ్యతిరేకతలో నుంచి పుట్టిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆ పార్టీకి జీవం పోయడానికి నడుం కట్టుకోంది. దేశంలో మరే పార్టీ, నాయకుడు కుడా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ నాయకత్వంతో  పనిచేయడానికి ముందుకు రాని సమయంలో చంద్రబాబు నాయుడు తన రాజకీయ అస్తిత్వం కాపాడు కోవడం కోసం సంసిద్దతను వ్యక్తం చేసారు.

ఇదివరకు రాష్ట్ర పర్యటనకు వచ్చిన రాహుల్ గాంధీని “ ఏ మొహం పెట్టుకుని వస్తారు. ఏమి చేశారని.  ఇంకా బతికున్నామా లేదా? అనా? .గాయం చేశాం. కారం చల్లిపోవాలి అని వస్తున్నారా?.మీ వల్ల  కదా మేం కష్టాల్లో ఉన్నది. కాంగ్రెస్ పార్టీకి సహకరించే వాళ్ళను ఏమనాలి. రాష్ట్ర ద్రోహులు కాదా వీళ్ళందరూ. రాష్ట్రానికి ఇంత ద్రోహం చేసి మళ్లా తగదునమ్మా అని ఇక్కడకు వచ్చి ఎక్కిరిస్తారా?” అంటూ ఆగ్రహంతో ఉగిపోతూ `స్వాగతం’ పలికిన చంద్రబాబు ఇప్పుడు స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి వీణను బహుకరిస్తూ మాట కలిపారు.

“ కాంగ్రెస్ పార్టీని శాశ్వతంగా బాయ్ కాట్ చేయాలి. అప్పటికి కూడా మనకు కసితీరదు.కానీ వాళ్ళతో పెట్టుకుంటే మన సమయం వేస్ట్ అవుతుంది కాబట్టి అభివృద్ధి వైపు పోవాలి. వాళ్ళను ఇగ్నోర్ చేయాలి. ఛీకొట్టాలి” అంటూ దూషించిన ముఖ్యమంత్రి ఇప్పుడు బీజేపీని గద్దె దించడం కోసం కాంగ్రెస్ కు ప్రాణం పోయాలి అంటూ సందేశాలు ఇస్తున్నారు. ఆ మాటలను దృష్టిలో ఉంచుకొనే అనుకుంటా “పొత్తు విషయంలో గతంలో ఏం జరిగిందన్నది తాము ఆలోచించడం లేదని” రాహుల్ గాంధీ స్పష్టం చేసారు. ప్రస్తుతం ముందుకెళ్లాలనే దానిపైనే ఆలోచన చేస్తున్నాని తెలిపారు.

తనకు 40 ఏళ్ళ రాజకీయ అనుభవం ఉన్నదని తరచూ చెబుతూ దేశంలో అందరికన్నా తానే సీనియర్ నేతను అని పేర్కొంటూ వస్తున్నా చంద్రబాబు మొదటిసారిగా మధ్యాన్నం భోజనం సమావేశం అనంతరం తనకన్నా శరద్ పవర్, ఫరూక్ అబ్దుల్లా సీనియర్ నేతలని `ఒప్ప్పుకున్నారు’. తాము ముగ్గురం కలసి ఇప్పడు అన్ని పక్షాలతో కలసి ఢిల్లీలో ఒక సమావేశం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఆ సమావేశానికి అన్ని పక్షాలను ఆహ్వానించే బాధ్యతను మిగిలిన ఇద్దరు చంద్రబాబుపై పెట్టారు అంట.

ఇప్పటికే మోదీకి వ్యతిరేకంగా మహాకూటమిని ఏర్పాటు చేయాలని విపక్షాలన్నీ భావిస్తున్నాయి. అయితే కాంగ్రెస్‌తో కలిసేందుకు ఎవ్వరూ ఇష్టపడడం లేదు. దీంతో కూటమి పక్రియ ఓ అడుగు ముందుకు రెండగులు వెనక్కు అన్నట్లు మారింది. కాని జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌ ఉన్న కూటమితోనే ప్రత్యామ్నాయం సాధ్యమనే అంచనాకు వచ్చి రాహుల్‌గాంధీతో భేటీ అయ్యారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. చంద్రబాబు కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడితో రాజకీయ సంప్రదింపులు జరపడం 20 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి కావడం గమనార్హం. 1996లో కేంద్రంలో యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వ ఏర్పాటు సమయంలో ఆయన అప్పటి కాంగ్రెస్‌ అధ్యక్షులు పీవీ నరసింహరావు, సీతారాం కేసరిలతో సంప్రదింపులు జరుపుతూ వచ్చారు.