2019 లో జయలలిత బయోపిక్ !

ఒకవంక సుప్రసిద్ధ తెలుగు నటుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్ టి రామారావు  బయోపిక్ నిర్మాణం ఆయన తనయుడు నందమూరి బాలకృష్ణ సారధ్యంలో శరవేగంగా జరుగుతూ, వచ్చే సంక్రాత్రికి విడుదల చేయడం కోసం సన్నాహాలు చేస్తుండగా, ఇప్పుడు త‌మిళ‌నాడు దివంగ‌త మాజీ సీఎం జ‌య‌ల‌లిత బయోపిక్ నిర్మాణ సన్నాహాలు కుడా ప్రారంభం అవుతున్నాయి.

ఇటు సినిమాలు, అటు రాజ‌కీయాల‌లో త‌న‌దైన పాత్ర పోషించి త‌మిళ‌నాడు ఐర‌న్ లేడీగా, అమ్మ‌గా, పురుచ్చతలైవీగా పేరొందిన జ‌య‌ల‌లిత గ‌త ఏడాది అనారోగ్యం కార‌ణంగా మృతి చెందింది. ప్ర‌స్తుతం ఎన్టీఆర్ బ‌యోపిక్ నిర్మిస్తున్న వైబ్రీ మీడియా జ‌య‌ల‌లిత బ‌యోపిక్‌ని కుడా నిర్మిస్తున్నట్లు ప్రకటించింది. తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల‌లో నిర్మించే ఈ చిత్రాన్ని విజ‌య్ డైరెక్ట్ చేయ‌నున్నారు.

జ‌య‌లలిత పుట్టిన తేది ఫిబ్ర‌వ‌రి 24న చిత్ర నిర్మాణం ప్రారంభించడంతో పాటు వచ్చే ఏడాదిలోనే విడుదల చేయాలనీ కుడా నిర్ణయించారు. చలనచిత్ర సీమలో, రాజకీయాలలో కుడా ఆమె సాధించిన విజయాలను ముఖ్యంగా ఈ చిత్రంలో చూపదలచిన్నట్లు చెబుతున్నారు.

మరోవంక  ఆదిత్య భ‌ర‌ద్వాజ్  జ‌య‌ల‌లిత బ‌యోపిక్‌ని తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల‌లో చేయ‌బోతున్న‌ట్టు గ‌తంలో ప్ర‌కటించాడు. వై స్టార్ సీటీపీఎల్ బేన‌ర్‌పై ఈ చిత్రం రూపొంద‌నుంది. థాయ్ పురుచ్చతలైవీ అనే టైటిల్‌ని జ‌య‌ల‌లిత బ‌యోపిక్‌కి ఫిక్స్ చేశారు. త్వ‌ర‌లోనే ఈ ప్రాజెక్ట్ అఫీషియ‌ల్‌గా లాంచ్ కానుంది.