రాహుల్ సమక్షంలోనే ఎంపి నేతల వాగ్వివాదం

ఎన్నికలు జరుగుతున్న సమయంలో కాంగ్రెస్ అద్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలోనే మధ్య ప్రదేశ్ కాంగ్రెస్ లో ఇద్దరు ప్రముఖ నాయకులు పరస్పరం వాగ్వివాదానికి దిగడం ఆ పార్టీ వర్గాలను కలవరానికి గురిచేస్తున్నది. ప్రజలలో మంచి క్రేజ్ ఉన్న జ్యోతిరాదిత్య సింధియాను ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించకుండా, ప్రదేశ్ కాంగ్రెస్ అద్యక్షుడిగా చేయకుండా అడ్డుకొంటున్న మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ సింగ్ అవకాశం దొరికినప్పుడల్లా తన అక్కసు వెళ్లగక్కుతూనే ఉన్నారు.

ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలలో గెలుపొందే అవకాశాలున్న అభ్యర్ధులను ఎంపిక చేసే బాధ్యతను కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అశోక్ ఘేలోట్, సింధియాలకు అప్పజెప్పారు. ఈ సందర్భంగా ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి త్రిసభ్య కమిటీని రాహుల్ నీయమించారు. ఈ కమిటీలో ఘేలోట్ తో పాటు అహ్మద్ పటేల్, వీరప్ప మొయిలి ఉన్నారు.

ఈ మధ్య జరిగిన కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో తమ మద్దతుదారులకు సీట్లు ఇప్పించుకొనే విషయమై రాహుల్ గాంధీ సమక్షంలోనే ఈ నాయకులు ఇద్దరు పరస్పరం తీవ్ర వాగ్వివాదానికి దిగిన్నట్లు తెలుస్తున్నది.

మధ్య ప్రదేశ్ కాంగ్రెస్ లో ప్రచార కమిటీ అధినేత సింధియా కాగా, సమన్వయ కమిటి అద్యక్షుడిగా దిగ్విజయ్ వ్యవహరిస్తున్నారు. వీరిద్దరి మధ్య నెలకొన్న అంతర్గత కుమ్ములాటలు రాష్ట్రంలో బీజేపీని గద్దె దింపి, కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకు రావాలని రాహుల్ చేస్తున్న ప్రయత్నాలకు గండి కొడుతుందని కాంగ్రెస్ నేతలే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తాను మాట్లాడితే కాంగ్రెస్ పార్టీకి వోట్లు తగ్గిపోతాయని, అందుకనే ఎన్నికయ్యే వరకు తాను ఏ సభలో కుడా మాట్లాడబోనని గత నెలలో దిగ్విజయ్ ప్రకటించారు. రెండు సార్లు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన రాష్ట్రంలో రాహుల్ గాంధీ పాల్గొంటున్న ఎన్నికల ప్రచార సభలలో ఎక్కడా కనిపించడం లేదు. మరోవంక ప్రముఖ కాంగ్రెస్ నేత గులాబ్ నబి ఆజాద్ గత నాలుగేళ్ళుగా పార్టీ హిందూ అభ్యర్ధులు ఎవ్వరు తనను ప్రచారానికి పిలవడం లేదని, పిలిస్తే హిందువులు వోట్లు వేయరాని భయపడుతున్నారని ప్రకటించి పార్టీ నేతలను ఇరకాటంలో పడవేశారు.