ఈనెల 9న కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా

తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల ప్రకటన మరింత ఆలస్యం కానుంది. తొలుత ఈ రోజు లేదా రేపు కాంగ్రెస్‌ పార్టీ తన అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేయనుందనే వార్తలు వచ్చినప్పటికీ అది సాధ్యపడలేదని తెలుస్తోంది. మిత్ర పక్షాలతో సీట్ల సర్దుబాటు ఒక కొలిక్కి రాకపోవడం, కొన్ని సీట్ల విషయంలో నిర్ణయానికి రాలేక పోవడంతో పాటు అమావాస్య ముందు ఎందుకనే సెంటిమెంట్ తో అభ్యర్ధుల ప్రకటనను వాయిదా వేస్తున్నారు. దసరాకు ముందే అభ్యర్ధులను ప్రకటిస్తామన్న పార్టీ నేతలు ఇప్పుడు దీపావళి వెళ్ళాలి అంటున్నారు.

కాంగ్రెస్‌ అభ్యర్థులందరి జాబితాను ఈ నెల 8 లేదా 9వ తేదీన ఒకే సారి ప్రకటించనున్నట్టు ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్‌ ఆర్సీ కుంతియా తెలిపారు. కాంగ్రెస్‌ అభ్యర్థుల ఎంపికపై చర్చించడానికి గురువారం యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియా గాంధీ నివాసంలో ఆ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరిగింది.

ఆ సమావేశం అనంతరం కుంతియా మాట్లాడుతూ తెలంగాణలో టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌లతో కలిసి మహాకూటమిగా బరిలోకి దిగనున్న నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ 95 స్థానాల్లో పోటీ చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు వెల్లడించారు. మిగతా స్థానాల నంచి మిత్రపక్షాలు బరిలో నిలవనున్నట్టు ఆయన ప్రకటించారు. కాంగ్రెస్‌ పోటీ చేయనున్న 95 స్థానాల్లో నేడు 57 స్థానాల అభ్యర్థులపై స్పష్టత వచ్చిందని పేర్కొన్నారు. 

టీపీసీసీ అద్యక్షుడు ఉత్తమకుమార్ రెడ్డి కాంగ్రెస్ 95 స్థానాల్లో, టీడీపీ 14 స్థానాల్లో పోటీ చేయాలన్న అవగాహన కుదిరిందని తెలిపారు. మిగిలిన స్థానాల్లో టీజేఎస్‌, సీపీఐ పార్టీల అభ్యర్థుల నిర్ణయం జరగాల్సి ఉందన్నారు. అయితే 8 సీట్లు మాత్రమె ఇవ్వడం పట్ల తెలంగాణా జనసమితి నేత కోదండరామ్ నిరసన వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం రాహుల్ గాంధీతో భేటి కానున్నారు. ప్రభుత్వం ఏర్పడితే కీలక పదవి ఇస్తామనే హామీ ఇవ్వడం ద్వారా ఒప్పించాలని భావిస్తున్నారు. అట్లాగే సీట్ల విషయంలో అసంతృప్తిగా ఉన్న సిపిఐ నేత చాడ వెంకటరెడ్డికి ప్రభుత్వం వస్తే ఎమ్యేల్సి పదవి ఇస్తామనే హామీ ఇస్తున్నారు.