జనం ద్రుష్టి మరల్చడం కోసం రాహుల్ తో చంద్రబాబు దోస్తి !

తెలంగాణలో కాంగ్రెస్ వ్యతిరేక పార్టీగా ఆవిర్భవించిన తెలుగు దేశం పార్టీ రాజకీయ మనుగడ కోసం కాంగ్రెస్ తో పొత్తుకు సిద్దమైనప్పుడు అదంతా తెలంగాణా పార్టీ నేతల నిర్ణయమని, దానిలో తన ప్రమేయం లేదని అన్నట్లుగా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభిప్రాయం కలిగించేందుకు ప్రయత్నం చేసారు. పైగా ఈ పొత్తు తెలంగాణకే పరిమితమని, ఆంధ్ర ప్రదేశ్ లో పొరపాటున కుడా ఉండబోదని సంకేతాలు కుడా ఇచ్చారు. ఉప ముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తి వంటి వారయితే తెలుగు దేశం ఏ పార్టీతో పొత్తు దరిద్రం తమకు వద్దంటూ ప్రకటనలు చేసారు. అదే జరిగితే ఆత్మహత్యకు సిద్దం అంటూ పేర్కొన్నారు.

కాని ఇప్పుడు చంద్రబాబు నేరుగా కాంగ్రెస్ అద్యక్షుడు రాహుల్ గాంధీని కలవడం కోసం ఢిల్లీకి వెడుతున్నారు. జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటు కోసం అంటూ చెబుతున్నారు. గతంలో కాంగ్రెస్ వ్యతిరేక కూటమిలను ఏర్పాటు చేయడంలో కీలకమైన భూమిక వహించిన చరిత్ర తెలుగు దేశం పార్టీకి ఉంది. మొదటి సారిగా విజయవాడలో ప్రతిపక్షాలతో ఒక సమావేశాని ఎన్ టి రామారావు ఏర్పాటు చేసి అటువంటి కూటమికి ప్రాణం పోశారు. ఆ కూటమిలో బీజేపీ కుడా లేదు. బీజేపీ మద్దతుతూ విపి సింగ్ ప్రభుత్వం ఏర్పాటుకు ఈ కూటమి దారితీసింది.

ఆ తర్వాత చంద్రబాబు నాయుడు హయం రాగానే పరిస్థితులు మారాయి. అప్పుడే కాంగ్రెస్ తో అవగాహనకు వచ్చి, ఆ పార్టీ మద్దతుతూ దేవగౌడ, ఐ కే గుజ్రాల్ ల ప్రభుత్వాల ఏర్పాటుకు దారితీసారు. అప్పటి నుండి తెలుగు దేశం పార్టీలో అనేకమంది కాంగ్రెస్ నాయకులకు కీలక స్థానాలు ఇస్తూ వచ్చారు. ఎన్ టి రామారావు నుండి ఆ పార్టీలో ఉన్న వారందరినీ క్రమంగా బయటకు వెళ్ళేటట్లు చేయడమో,పార్టీలో ఉన్నా ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వక పోవడమో చేస్తున్నారు. కెఈ కృష్ణమూర్తి, యనమల రామకృష్ణుడులు తప్ప అసలు తెలుగు దేశం పార్టీ వారెవ్వరూ ఇప్పుడు మంత్రివర్గంలో లేరని చెప్పవచ్చు.

చివరకు చంద్రబాబు నాయుడు కుడా పార్టీ ప్రారంభించిన సమయంలో కాంగ్రెస్ లో ఉన్న వ్యక్తే కావడం గమనార్హం. ప్రతిపక్షం సభ్యులుగా ఉన్న నలుగురు ఇప్పుడు మంత్రివర్గంలో ఉన్నారు. ఇతర పార్టీల ప్రభుత్వాలలో మంత్రి పదవులు వెలగ బెట్టిన వారు కుడా ఉన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి మరో రూపంగా తెలుగు దేశం పార్టీని మార్చివేసిన చంద్రబాబు ఇక కాంగ్రెస్ తో బహిరంగంగా చేతులు కలపడం కోసం ఢిల్లీ వెళ్లుతున్నారు.

గతంలో తనను ప్రధానమంత్రిగా ఉండమని రెండు సార్లు కోరినా తాను ఒప్పుకోలేదని తరచూ చెబుతూ ఉంటారు. కానే ఆ మాటను అప్పట్లో ఆయనతో పాటు కూటమిలో ఉన్న ఇతర పార్టీల నేతలు ఎవ్వరు ఇప్పటి వరకు చెప్పిన సందర్భమే లేదు. పైగా దేవగౌడ, గుజ్రాల్ లను తానే ప్రధాన మంత్రులుగా చేసానని ప్రచారం చేసుకొంటూ ఉంటారు. ఈ మధ్య కరుణానిధి చనిపోయినప్పుడు తనను ప్రధాన మంత్రిగా చేసింది ఆయనే అంటూ దేవగౌడ పేర్కొనడం గమనార్హం.

దేవగౌడ కాంగ్రెస్ బ్లాకుమెయిల్ రాజకీయాలతో విసుగు చెంది రాజీనామాకు సిద్దపడితే, ఆయనను రాజీనామా చేయకుండా అడ్డుకోవడం కోసం చంద్రబాబు నాయుడు గంటకు పైగా ఆయన గది బయట వేచి ఉన్నారు. కనీసం కలవకుండా, రాజీనామా చేసి వచ్చాకే కలవడం ద్వారా ఈ విషయంలో చంద్రబాబుతో మాట్లాడవలసింది ఏమీ లేదనే సందేశం దేవగౌడకు ఇచ్చారు.  

రాహుల్ గాంధీ నాయకత్వంలో తిరిగి ప్రజల మద్దతు పొందగలమనే నమ్మకం ఇప్పుడు కాంగ్రెస్ వారిలోనే కలగడం లేదు. రాహుల్ గాంధీ నాయకత్వంలో కూటమి ఏర్పాటుకు దేశంలో దాదాపు ఏ పార్టీ కుడా ఒప్పుకోవడం లేదు. కర్ణాటకలో కాంగ్రెస్ మద్దతుతో కుమారుడు కుమారస్వామి ముఖ్యమంత్రిగా ఉండడంతో కేవలం దేవగౌడ మాత్రమె రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అభ్యర్ధిగా వస్తే మద్దతు ఇస్తామని ప్రకటించారు. అంతే గాని రాహుల్ గాంధీ నాయకత్వంలో జాతీయస్థాయిలో కూటమి ఏర్పాటుకు ఆయన కూడా సిద్దంగా లేరు.

ఇప్పుడు నాయకత్వ సమస్య లేకుండా, ఏ రాష్ట్రంకు ఆ రాష్త్రంలోనే బలమైన పార్టీ నాయకత్వంలో ఇతర పార్టీలు సర్దుబాట్లు చేసుకొని, ఎన్నికల అనంతరం ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తే ఆ పార్టీ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే ఆలోచన చేయవచ్చని శరద్ పవర్, మమత బెనర్జీ, అఖిలేష్ యాదవ్, ఫరూక్ అబ్దుల్లా వంటి నాయకులు ఇప్పటికే చెప్పారు. 30కు పైగా సీట్లు వచ్చే అవకాశం మమత బెనర్జీ, అఖిలేష్ యాదవ్, మాయావతి, ఏం కే స్టాలిన్ వంటి వారికి మాత్రమె ఉన్నాయి. వారు గెల్చుకొన్న సీట్లలో సగం గెలుచుకోవడం కుడా చంద్రబాబుకు సాధ్యం కాకపోవచ్చు.

ఇటువంటి పరిస్థితులలో చంద్రబాబు నాయకత్వంలో ఆయా పార్టీల నాయకులు అన్ని కలసి వచ్చేటట్లు చంద్రబాబు చేస్తారనే ప్రచారం చేయడం ఆంధ్ర ప్రదేశ్ లో తగ్గిపోతున్న ప్రజాదరణను పెంచుకోవడం కోసం చేస్తున్న ప్రచారంగానే భావించ వలసి ఉంటుంది. తన ప్రభుత్వ వైఫల్యాల నుండి, ప్రభుత్వంపై వస్తున్నా అవినీతి ఆరోపణల నుండి ప్రజల దృష్టి మళ్ళించడం కోసం రాహుల్ తో జత కలిపి, జాతీయ స్థాయి నాయకుడిగా ఎదిగిన్నట్లు కనిపించే ప్రయత్నం చేస్తున్నారు.