పోలవరంలో అవినీతి జరగనే లేదా !

జాతీయ హోదా కల్గిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణ అంచనా వ్యయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎడాపెడా పెంచుకుంటూ పోతున్నారని ఆక్షేపిస్తూ పోలవరం ప్రాజెక్టుకు బిల్లుల చెల్లింపుల్లో కుంభకోణం జరగలేదా అని బిజెపి రాష్ట్ర అద్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. ప్రతి వారం టిడిపి పాలనా తీరుతెన్నులపై ఇదేసి ప్రశ్నలను సంధిస్తున్న కన్నా లక్ష్మీనారాయణ ఈ వారం కుడా మరో ఇదు ప్రశ్నలను వేసారు. తనది పారదర్శకత గల ప్రభుత్వం అని చెప్పుకొంటున్న టిడిపి అధినేత ఈ ప్రశ్నలకు మౌనమే వహిస్తున్నారు.

అదే విధంగా, కడప జిల్లాలో మూతబడిన చెన్నూరు చక్కర ఫ్యాక్టరీ, పొద్దుటూరు పాల కేంద్రాన్ని తెరిపించ లేకపోవటం గురించి కన్నా నిలదీసారు. పులివెందులలో రూ. 275 కోట్లతో నిర్మితమైన సెంటర్ ఫర్ అడ్వాన్స్‌డ్ రిసెర్చి ఆఫ్ లైవ్ స్టాక్ కేంద్రాన్ని కూడా పూర్తి స్థాయి వినియోగంలోకి తీసుకురాలేకపోవటం వైఫల్యం కాదా అని ప్రశ్నించారు. ఎన్నికల ప్రణాళికలో రూ. 2వేలు చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి నేడు నాలుగేళ్ల తర్వాత వెయ్యి రూపాయల మాత్రమే ప్రకటించడం న్యాయమా అని కన్నా నిలదీశారు.

ఏపీ జెన్కో దిగుమతి చేసుకున్న బొగ్గు దిగుమతుల్లో రూ. 200 కోట్లు ముడుపులు వాస్తవం కాదా అని కన్నా ప్రశ్నించారు. ఈ స్కాంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ రాష్ట్ర ప్రభుత్వానికి సమన్లు జారీ చేయలేదా అని నిలదీశారు. మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో అన్ని స్థాయిలోనూ పచ్చ పన్ను వసూళ్ల దెబ్బకు ప్రజలు భయపడి ఇళ్ల నిర్మాణాలను కూడా వాయిదా వేయించుకోవటం వాస్తవం కాదా అని ప్రశ్నించారు.