తెలంగాణ రాష్ట్రం అవినీతికి కేరాఫ్ అడ్రస్‌

తెలంగాణ రాష్ట్రం అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయిందని, దేశంలోనే అవినీతిలో రెండవ స్థానాన్ని ఆక్రమించిందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ ద్వజమెత్తారు.  నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం పెర్కిట్ గ్రామంలో జరిగిన బూత్ స్థాయి కార్యకర్తల ఎన్నికల సన్నాహక సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొంటూ బంగారు తెలంగాణే లక్ష్యం అంటూ కేసీఆర్ జోరుగా ప్రచారం చేసి చివరకు కుటుంబాన్ని బంగారుమయంగా చేసుకున్నాడని ఆరోపించారు. తెలంగాణలో కాంట్రాక్టర్ల రాజ్యం కొనసాగుతోందని, తద్వారా అవినీతి పెరిగిపోయిందని విమర్శించారు. మిషన్ భగీరథ పేర రూ 40 వేల కోట్లను దోపిడీ చేశారని ఆరోపించారు.

టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇంటికో ఉద్యోగం ఇవ్వలేదని, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను నిర్మించలేదని, ఇతర హామీలు నెరవేర్చలేదని ఆయన గుర్తు చేసారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలన్ని నీరుగారిపోయాయని దుయ్యబట్టారు. తెలంగాణ తెచ్చామని, అధికారం కట్టబెట్టాలని ప్రజలను మభ్యపెట్టి నాలుగేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ ఐదేళ్లు కూడా పాలించలేదని చెప్పారు. ఐదేళ్లు పాలించమని అవకాశం ఇస్తే నాలుగు సంవత్సరాల 3 మూడు నెలల్లోనే అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లారని, ఇలాంటి సందర్భంలో టీఆర్‌ఎస్‌కు ఓట్లు అడిగే హక్కు లేదని స్పష్టం చేసారు.

2019లో నరేంద్ర మోదీ హవాలో కొట్టుకుపోతారన్న భయంతోనే టీఆర్‌ఎస్ ముందస్తు ఎన్నికలకు వెళ్లిందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్, టీడీపీల అపవిత్ర పొత్తుతో ఎన్‌టి రామారావు ఆత్మ క్షోభిస్తుందని ద్వజమెత్తారు. టీఆర్‌ఎస్‌కు మహాకూటమియే ప్రత్యామ్నాయమని చెప్పుకుంటూ తిరుగుతున్నారని, కాంగ్రెస్ మునిగిపోతున్న పార్టీగా మిగిలిపోవడం ఖాయమని స్పష్టం చేసారు.

తెలంగాణలో బీజేపీయే ప్రత్యామ్నాయ పార్టీ అని చెబుతూ జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా పుంజుకొని అధికారం చేపడతామని, సర్‌ప్రైజ్ ఫలితాలు వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేసారు. ప్రజలు టీఆర్‌ఎస్ నుంచి విముక్తి కోరుకుంటున్నారని పేర్కొన్నారు. ఆయన కార్యకర్తలు నెల రోజుల పాటు అహర్నిశలు కష్టపడి ధనబలాన్ని, రౌడీయిజాన్ని ఓడించాలని పిలుపిచ్చారు.

నేడు నరేంద్ర మోదీ నేతృత్వంలో భారతదేశంలో అభివృద్ధిలో దూసుకుపోతోందని చెబుతూ  అవినీతిరహిత పాలన వల్ల అభివృద్ధిలో భారతదేశం ఇంగ్లాండ్‌ను వెనుకకు నెట్టేసి ప్రపంచంలో నాలుగవ స్థానాన్ని ఆక్రమించిందని తెలిపారు. రైతాంగ సంక్షేమానికి విశేష కృషి చేశారని, 2020 సంవత్సరం వరకు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న ఉద్ధేశంతో చర్యలు చేపట్టడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. 2026 వరకు దేశంలో ఇండ్లు లేని వారు ఉండొద్దన్న సంకల్పంతో ప్రధాని నరేంద్ర మోదీ 5 కోట్ల గృహాలను నిర్మించాలని నిర్ణయించారని, ఇప్పటికే కోటి ఇళ్ల నిర్మాణం పూర్తయిందని తెలిపారు. అందరికి కార్పోరేట్ వైద్యం అందించాలన్న ఆలోచనతో ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని ఆయన చెప్పారు.